Wednesday, February 28, 2024

ఆనందా హోమ్స్ బరితెగింపు..

తప్పక చదవండి
  • నెక్నంపూర్ చిన్న చెరువు దురాక్రమణ..
  • చెరువులో భారీ అంతస్తుల నిర్మాణాలు..
  • అడ్డదారిలో ఎన్.ఓ.సి. జారీచేసిన ఇరిగేషన్ అధికారులు..
  • అనుమతుల వెనుక భారీ ముడుపుల అవినీతి..
  • ఎన్.ఓ.సి. జారీతో మిగిలిన వాటికి రూట్ క్లియర్..
  • చెరువును కూల్చి కూలీలకు షెడ్ల నిర్మాణం..
  • హై కోర్టు ఆదేశాలను భే ఖాతరు అంటున్న నీటిపారుదల శాఖ అధికారులు..

నెక్నంపూర్ గ్రామంలో ఆనంద హోమ్స్ చిన్న చెరువు ఎఫ్.టి.ఎల్.లో అక్రమ నిర్మాణాలు సాగిస్తూ బరితెగింపుకు పాల్పడుతోంది.. నెక్నంపూర్ చిన్న, పెద్ద చెరువు కలిపి 99 ఎకరాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు నీటి పారుదల, రెవెన్యూ శాఖల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.. నాడు నిండుకుండలా కళకళలాడిన ఈ గొలుసుకట్టు చెరువులు అక్రమార్కుల చెరలో చిక్కి నేడు వెలవెలబోతున్నాయి.. నడి చెరువులో నిర్మాణాల అనుమతుల కోసం అడ్డదారిలో ఎన్.ఓ.సి. జారీ చేయడంతో హెచ్.ఎం.డీ.ఏ., రేరా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎయిర్పోర్ట్ అథారిటీ, వంటి సంస్థలు ఎన్.ఓ.సి. లు జారీ చేసేందుకు రూట్ క్లియర్ అవుతోంది.. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చెరువుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, చుట్టూ ఫెన్సింగ్ వంటి రక్షణ చర్యలు చేపట్టాలని హై కోర్టు సైతం హెచ్చరించింది.. కానీ ఇరిగేషన్ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను భే ఖాతరు చేస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని బహిరంగ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీల శివారు గ్రామమైన నెక్నంపూర్ చిన్న, పెద్ద గొలుసుకట్టు చెరువు ఆనంద హోమ్స్ అనే బడా నిర్మాణ సంస్థ కబంధ హస్తాల్లో చిక్కి వెలవెలబోతోంది.. ఈ గొలుసుకట్టు చేతులు కలిపి 99 ఎకరాల్లో ఉన్నట్లు రెవెన్యూ, నీటిపారుదల శాఖల రికార్డులను బట్టి తెలుస్తోంది.. మణికొండ మున్సిపాలిటీలో 10 శాతం, నార్సింగి మున్సిపాలిటీకి 90 శాతం ఏరియా కలవడంతో ఈ నిర్మాణ సంస్థపై అధికారులు దృష్టి పెట్టలేదు.. ఇదే ఆ బడా నిర్మాణ సంస్థకు వరంగా మారింది.. దీంతో ఇదే అదునుగా భావించిన ఆనంద హోమ్స్ నిర్మాణ సంస్థ ఇరిగేషన్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని భారీగా ముడుపులు ముట్టజెప్పడంతో అడ్డదారిలో నిరభ్యంతర ( ఎన్.ఓ.సి.) తో నిర్మాణ అనుమతులు పొందినట్లు బహిరంగ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. చిన్న చెరువు 30 ఎకరాల్లో ఉండవచ్చునని స్థానికులు అంచనా వేస్తున్నారు.. ఈ నిర్మాణ సంస్థ బఫర్ జోన్ ను మింగి చెరువు ఎఫ్.టి.ఎల్. లోనే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు జంకు, బొంకు లేకుండా యథేచ్ఛగా సాగించడంతో బాటు, మాకు అన్నీ అనుమతులు ఉన్నాయంటూ సదరు నిర్మాణ సంస్థ ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఇరిగేషన్ అధికారులు ధన దాహంతో ఎన్.ఓ.సి. జారీ చేస్తే, హెచ్.ఎం.డీ.ఏ., రేరా, పీ.సి.బీ., ఎయిర్పోర్ట్ అథారిటీ వంటి సంస్థలు ఎన్.ఓ.సి. జారీ చేసేముందు క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే ఏసీ గదిలో కూర్చొని గుడ్డిగా, అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.. ప్రధమంగా ఇరిగేషన్ అధికారులు జారీ చేసే ఎన్.ఓ.సి. మిగిలిన సంస్థలకు కీలకంగా మారడంతో అక్రమార్కులకు రూట్ క్లియర్ అవుతోందని ఈ ప్రాంత ప్రజలు ఆక్షేపిస్తున్నారు.. దారుణమైన విషయం ఏమిటంటే, నది చెరువును పూడ్చి దినసరి కూలీలకు షెడ్లు వేయటం ఇరిగేషన్ అధికారులు ధనదాహం మత్తులో అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఆనంద హోమ్స్ అక్రమాలకు అద్ధం పడుతోంది.. అంతేకాకుండా చెరువు ఎఫ్.టి.ఎల్. లోనే రేకులతో చుట్టూ ప్రహారీ నిర్మాణం చేసింది.. చెరువు విస్తీరణం బట్టి బఫర్ జోన్ 9 మీటర్లు అనగా 27 అడుగులు మినహాయించి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది.. ఈ గొలుసుకట్టు చెరువు 99 ఎకరాల విస్తీరణంలో వుంది కాబట్టి ఆ లెక్కన చూస్తే 30 మీటర్లు అనగా 100 అడుగులు మినహాయించాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను తుంగలో తొక్కిన అక్రమార్కులు, ఇరిగేషన్ అధికారుల కనుసన్నలలోనే ఈ అక్రమం సాగించడం ఎంత దుర్మార్గమో తేటతెల్లమవుతోంది.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా వందలాది చెరువులు, కుంటలు పూడికలు తీసి కట్టపై వాకింగ్ ట్రాక్, సుందరీకరణ చేసి నీటి నిల్వలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నది ఎంత వాస్తవమో.. చెరువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులే చెరువులు కనుమరుగైయ్యేందుకు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షించడానికి చెరువుల పరిరక్షణ కమిటీ ఏర్పాటుతో పాటు నిత్యం పర్యవేక్షణ, ఫెన్సింగ్ వంటి రక్షణ చర్యలు చేపట్టాలని హై కోర్టు సైతం హెచ్చరించింది.. ఆ ఆదేశాలను పక్కనే ఉన్న పెద్దచెరువులో కలిపి నీటిపారుదల శాఖ అధికారులు అక్రమార్కులతో అంటకాగుతున్నారని బహిరంగ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.. పట్టా భూముల్లో చెరువులు, కుంటలు ఉన్నా వాటిని పూడ్చటం, వ్యర్ధాలతో కలుషితం చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం నీటిపారుదల చట్టాలకు విరుద్దము, చట్టరీత్యా నేరం.. ఉన్నతాధికారులు సైతం అవినీతి, అక్రమాలకు తెగబడి విచ్చలవిడిగా ఎన్.ఓ.సి. లు జారీ చేస్తుండటంతో వందలాది చెరువులు, కుంటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసి రెవెన్యూ, నీటిపారుదల, హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు పూర్తి స్థాయిలో ఉమ్మడి సర్వే నిర్వహించి వాస్తవాలు బట్టబయలు చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు