నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం కోసం గత ప్రభుత్వాలు మిగులు భూములను గుర్తించి, వారు సాగుచేసుకుని జీవిస్తారని సదుద్దేశ్యంతో 3, 5 ఎకరాల చొప్పున పంపిణీ చేసింది.. అలా పంపిణీ చేసిన భూములు క్రయ విక్రయాలు చెల్లవు.. కానీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భూములకు రెక్కలు రావడంతో రియల్టర్ల చూపు నిరు పేదల అధీనంలో వున్న భూములపై పడిరది.. దీంతో అధికార పార్టీ ముసుగులో దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్ సూత్ర, పాత్రదారునిగా నయానో, భయానో బెదిరించి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, రెవెన్యూ అధికారుల అండదండలతో షెడ్లను నిర్మించి విక్రయాలు సాగిస్తున్నట్లు బహిరంగ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..
- జోరుగా సాగుతున్న రియల్ దందా..
- సర్వే నెంబర్ : 224 గల్లంతు..
- షెడ్లు నిర్మించి బాజాప్తాగా విక్రయాలు..
- అక్రమ షెడ్లకు విద్యుత్ సౌకర్యం..
- అధికార పార్టీ కౌన్సిలర్ సూత్ర, పాత్రదారి..
- అక్రమార్కులకు అండగా నిలుస్తున్న రెవెన్యూ అధికారులు..
మేడ్చల్, మల్కాజ్ గిరి : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కీసర మండలం, చీర్యాల గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 224 లో వున్న సుమారు 5 ఎకరాల భూమి గల్లంతైంది.. ఈ రియల్ మాఫియా ప్రభుత్వ భూమిని తెగనమ్ముతూ ఆ భూమిలో 80, 120, 180 గజాల చొప్పున విక్రయించి, షెడ్డు నిర్మించి అందజేస్తే రూ.. 15 లక్షల నుండి 20 లక్షల వరకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నారని ఈ ప్రాంత ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.. దమ్మాయి గూడా మున్సిపాలిటీలో కౌన్సిలర్, అధికార పార్టీని అడ్డం పెట్టుకుని రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులను తన కనుసన్నలలోనే శాసిస్తున్నాడని ఈ ప్రాంతంలో జోరుగా ప్రచారం సాగుతోంది.. అన్ని సక్రమంగా ఉంటేనే విద్యుత్ మీటర్లు జారీ చేయని విద్యుత్ శాఖ అధికారులు అక్రమార్కులు విదిల్చే కాసులకు కక్కుర్తి పడి నోటరీతో విక్రయించిన షెడ్లకు మీటర్లు ఎలా మంజూరు చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ నిమిత్తం ఉచిత విద్యుత్తు 24 గంటలు ఇస్తుంటే అధికార పార్టీని అడ్డం పెట్టుకుని వ్యవసాయానికి కేటాయించిన విద్యుత్ ను చోరీ చేసి, షెడ్లకు ఉపయోగించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.. పలు మార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథులు లేరని వారు ఆక్షేపిస్తున్నారు.. కోట్లు విలువజేసే అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ అధికారులు కిమ్మనకపోవడం వారి అవినీతి, ఆక్రమాలకు అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి రియల్ మాఫియా కబంధహస్తాల్లో చిక్కి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని కాపాడి, దానిలో ఉన్న అక్రమ షెడ్లను కూల్చివేతలు జరిపి, రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..