Tuesday, September 10, 2024
spot_img

సాయం అడిగిన పాపానికి..

తప్పక చదవండి
  • భూమిని కాజేసిన దుర్మార్గులు..
  • సంచార జీవులపై అక్రమార్కుల దెబ్బ..
  • ఫోర్జరీ సంతకాలతో 16 ఎకరాల భూమి స్వాహా..
  • భూమి కోసం పోతే కొనసాగుతున్న దాడులు…
  • జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు..

పొట్ట చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ కాలం వెళ్ళదిస్తున్న సంచార జీవుల భూములపై అక్రమార్కులు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చిన వారి భూములకు పాస్‌ పుస్తకాలు కావాలని కొందరు వ్యక్తులను సాయం అడిగిన పాపానికి.. చివరికి ఆ భూమిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ అభాగ్యులకు పాస్‌ పుస్తకాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి చివరికి వారి భూములను అక్రమార్కులు స్వాహా కార్యానికి వడిగట్టారు. జరిగిన అన్యాయం ఆలస్యంగా తెలియడంతో సంబంధిత బాధితులు జరిగిన అన్యాయాన్ని స్థానికంగా ఉన్న అధికారులకు, గ్రామస్తులు చెప్పిన ప్రయోజనం లేకపోవడంతో.. చివరికి జిల్లా కలెక్టర్‌ ను సోమవారం ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే…

ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో పూసల వ్యాపారం చేసుకుంటూ పలు గ్రామాలు సంచరిస్తున్న 23 కుటుంబాల వారికి ప్రభుత్వం 1977లో 16 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. బీరోలు గ్రామ రెవెన్యూ పరిధిలోని 210 సర్వే నెంబర్లు 16.15 ఎకరాల భూమిపై వీరికి సర్వహక్కులు కల్పించింది. అయితే ఈ భూమిని సాగు చేసుకునే క్రమంలో కొంతమేరలో చెరువు నీరు ఉండడం, మరి కొంత భూమి సాగుకు యోగ్యంగా ఉండడంతో అడపాదడపా పంటలు సాగుచేస్తూ సంచార జీవితం గడుపుతూనే ఉన్నారు. అయితే భూమికి చెందిన వారసులకు కొత్త పాస్‌ పుస్తకాలు లేకపోవడంతో అట్టి భూములకు పాస్‌ పుస్తకాలు కావాలని గ్రామంలో ఉన్న తెలిసిన వ్యక్తిని ఆశ్రయించారు. ఈ క్రమంలోని గ్రామానికి చెందిన కెన్‌ పాండు, టి శేషగిరి తదితరులు బాధితుల భూమిపై నకిలీ డాక్యుమెంట్‌ తయారు చేసి భూములను స్వాధీనం చేసుకున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. 23 కుటుంబాల వారు ఎటువంటి సంతకాలు చేయనప్పటికీ పాత స్టాంప్ పేపర్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టి, అధికారులను తప్పుదోవ పట్టించి భూముల స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మా భూములను సాగు చేసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళితే దాడులకు సైతం పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై గ్రామ పెద్దలకు, అధికారులకు, మండల రెవెన్యూ అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో వారికి జరిగిన అన్యాయాన్ని విన్నవించుకునేందుకు జిల్లా కలెక్టర్‌ ను పసుపులేటి నారాయణ, బి రంగయ్య, పొదుల సత్యం, పొదిల కనకయ్య, పొదిల వెంకన్న, బండి రాంబాబు, పందిళ్ళ ఉప్పలయ్య, బి రమాదేవి కనకమ్మ తదితరులు ఆశ్రయించారు. బాధితుల నుండి ఫిర్యాదు సేకరించిన జిల్లా కలెక్టర్‌ విపి గౌతం తక్షణమే ఈ భూములపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని తాసిల్దార్‌ ను ఆదేశించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు