Tuesday, September 10, 2024
spot_img

ఇంటింటికీ బీజేపీ

తప్పక చదవండి
  • ఒక్కరోజే 35లక్షల కుటుంబాలతో మమేకం..
  • సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌
  • అబద్ధం చెప్పే నీకు ఆధ్యాత్మికత ఇంకెక్కడిది?
  • దేవాలయాలకు కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటికీ బీజేపీ పేరుతో భారీ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. నేడు ఒక్కరోజే 35లక్షల కుటుంబాలను బీజేపీ నేతలు కలవనున్నారు. మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారీ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరూ రేపు ప్రజల్లోనే ఉండనున్నారు. ఒక్కో బూత్‌ అధ్యక్షులు కనీసం వంద మంది కుటుంబాలను కలిసేలా కార్యాచరణ చేసుకున్నారు. రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం అవ్వనున్నారు బీజేపీ నాయకులు. నరేంద్రమోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్‌ కాలనీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటించనున్నారు. అంబర్‌ పేట, గోల్నాకాలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ డివిజన్‌ లో డా. లక్ష్మణ్‌, హుజురాబాద్‌ లో ఈటెల రాజేందర్‌ పాల్గొననున్నారు. వారి వారి నియోజకవర్గాలలో జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలవాలని నిశ్చయించారు.
ఈ కార్యక్రమంతో బీజేపీ లీడర్స్‌ నుంచి కిందిస్థాయి కార్యకర్తలవరకు అందరిలోనూ జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. మరి ఈ కార్యక్రమం తెలంగాణ బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్‌ మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా సీఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భయంకర హిందువునని ప్రగల్బాలు పలుకుతూ.. అబద్ధాలు చెబుతావంటూ సీఎంపై మండిపడ్డారు. ‘హిందూ గాళ్ళు, బొందు గాళ్ళు అంటూ దుర్భాషలు.. భయంకర హిందువుని నేనంటూ ప్రగల్భాలు.. యాదాద్రేమో మీకు పెట్టుబడి.. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రాద్రి, జోగులాంబ ఆలయాలకు నిధుల కేటాయింపేమో మొక్కుబడి.. కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు. భారతీయ సనాతన ధర్మాన్ని పక్కన పెడతావు…ఈ ధర్మాన్ని తిట్టేవాన్ని తలపైకెత్తుకుంటావు. ఆత్మ సాక్షిగా కూడా అబద్ధమే చెప్పే నీకు ఆధ్యాత్మికత ఇంకెక్కడిది ?’ అంటూ సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ పరోక్షంగా విమర్శలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు