Friday, May 3, 2024

ఆత్మగౌరవానికే అగౌరవం..

తప్పక చదవండి
  • దళితులకు రూ. 10 లక్షలు.. బీసీలకు లక్ష రూపాయలా ..?
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకీ వివక్ష..
  • రూ.10 ని కూడా కళ్ళకు అద్దుకుని తీసుకునేటోళ్లు..
  • బీసీలు కోటికి మించి ఉన్న ఈ రాష్ట్రంలో
    మీకు వివక్ష ఎలా చూపాలనిపిస్తుంది..?

( రాష్ట్రం తెచ్చుకుంది మీరు అప్పులు చేసి పథకాలు పంచుతారని కాదు.. గౌరవంగా బ్రతకడానికి.. మీకు చేతనయితే గౌరవమైన బ్రతుకులను బ్రతకనీయండి.. : అశేష బీసీ ప్రజానీకం..)

ఎనుకటికి ఓ పెద్దాయిన దర్వాజాకు కోడి కట్టి, గుంజకు మేకను గట్టి ఫంక్షన్ చేస్తున్నానని సుట్టాలను, పక్కాలను అందర్నీ పేరు పేరున ఇంటికెళ్లి మరీ పిలిసిండట తీరా వొతే గుంజకు కట్టిన మేక గుంజకే ఉందట.. దర్వాజకు కట్టిన కోడి దర్వాజాకే ఏలాడుతుందట.. ఈ చోద్యం చూసిన పెద్దోళ్లు నోరెళ్ళబెట్టి ఇందేందే పెద్దన్నతిందురావే అని ఇంటికి రమ్మంటివి.. ఈడ నేమో ఏమీ కాకపాయె.. ఏందే ఇందంతా అన్ని నోరు తెరిసి అడిగిళ్లట.. దీనికి సుట్ట నోట్లో పెట్టుకుని ఆ పెద్దమనిషి కూర మంచిగా వండటానికి ఓ పెద్ద పటేలును పిలుపిస్తున్ననే ఆయన ఆచ్చుడే మీకు కడుపునిండా తిండి పెట్టుడే ఉండున్రి అన్నడట.. గట్లుంది తెలంగాణ సర్కారు ఇస్తున్న దళితులకు రూ. 10 లక్షలు, బీసీలకు లక్ష రూపాయల కథ..

- Advertisement -

హైదరాబాద్, కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పేరుతో.. తెలంగాణలో వెనుకబడిన వర్గాల్లోని కుల వృత్తులు, చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ. లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడానికి వీలుగా అధికారులు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత కేబినేట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ వెనుకబడిన వర్గాల కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

ప్రభుత్వం దృష్టిలో వెనుకబడ్డ వాళ్ళు అంటే ఎవరు..?
అవును ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. నిజానికి వెనుకబడ్డ తరగతులను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించింది. ప్రభుత్వం దృష్టిలో వెనుకబడ్డ వాళ్ళు అంటే ఎవరు..? ఒక కమ్యూనిటీలో ధనవంతులు ఉన్నారు. పూట గడవని నిస్సహాయ స్థితిలోని నిరుపేదలు ఉన్నారు. ప్రభుత్వం లబ్ది పేరుతో ఓట్ల రాజకీయం చేస్తోంది.. దళిత బందులో పెట్టని రిస్ట్రిక్షన్స్ బీసీలకు ఇచ్చే లక్ష రూపాయల్లో ఎందుకు పెట్టింది..? దళితులకు ప్రకటించిన పథకాలను, ఇస్తున్న రాయితీలను ఎవరూ.. ఎక్కడా.. ఏ సందర్భంలోనూ తప్పుపట్టడం లేదు. వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడమని మాత్రమే చెబుతున్నాం. దళితులకు రూ. 10 లక్షలు ఇస్తానని ముందుకొచ్చిన ప్రభుత్వం.. బీసీలకు మాత్రం లక్ష రూపాయలు ఇస్తానని రూ. 9 లక్షలు ఎందుకు కోత పెట్టింది..? ఇస్తున్న లక్షకు కొందరు మాత్రమే అర్హులను ఎందుకు ముందుగా ప్రకటించింది.

ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మాలి..? ఎలా నమ్మాలి..?
కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నఈ రాష్ట్ర ప్రభుత్వం.. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వలేని స్థితిలో ఉన్న ఈ సర్కారు మాటలు ఎందుకు నమ్మాలి..? ఎలా నమ్మాలి..? ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులాల మతాల మధ్యన చిచ్చు పెడుతూ నయా నాటకానికి ఎందుకు తెరలేపిందో అర్ధం చేసుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ప్రభుత్వం భావిస్తే పెద్దలు పప్పులో కాలేసినట్టే. అధికారం ఇచ్చామనే సాకుతో ఇష్టానుసారంగా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ పోతూ.. పంచిపెడుతున్న ప్రజాధనం లెక్కలు కనీసం ప్రజలకయినా చెబుతారా..? ప్రతి పక్షాలది ఓర్చుకోలేని గుణమని ప్రచారం చేస్తున్న మీరు.. తెస్తున్న అప్పుల తాలుకు నిధులను పంచిపెడుతున్న తీరు తెన్నులను ప్రజలకు ఎందుకు వివరించరు..?

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది పథకాలు పంచుతారని కాదు :
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వమని ఎవ్వరు ప్రభుత్వానికి మొరపెట్టుకోలే. ప్రభుత్వమే ఆశ పెటింది.. లక్షలాది మంది ప్రజలను నిరాశలో ముంచింది. దళిత బందు పెట్టి దళితులకు రూ. 10 లక్షలు ఇవ్వమని ఎవ్వరు అడగలే.. ప్రభుత్వమే ఇస్తామని కమిట్ అయ్యింది.. ఇవ్వడంలో దశలు, దిశలంటూ మెలిక పెట్టింది. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనమే చేసుకోవచ్చని పనిగట్టుకొని ప్రచారం చేస్తిరి.. గెలిచిన తరువాత ప్రభుత్వం మీ చేతికి వచ్చిన తరువాత అమాంతంగా చేతులెత్తేస్తిరి.
గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ముఖ్యమంత్రి గారు ఇదేనా మీరు కలలుగన్ననిజమయిన బంగారు తెలంగాణ..? మీరు సాధించిన విజయం నిజమయితే నరకాసురుడు అంతం అయినప్పుడు ప్రజలు దీపావళి జరుపుకున్నట్లు తెలంగాణ 10 ఏండ్ల ఉత్సవాలను ప్రజలు దీపావళి కంటే ఘనంగా ప్రతి ఇంటా జరుపుకునేవారు.. తెలంగాణ రాష్ట్ర సాధనకు మీరే పేటెంట్ అని గొప్పలు చెప్పుకుని తిరిగే మీరు సాధించిన విజయం నిజంగా నిజమయితే ఆర్టీసీ కార్మికులు ఎందుకు అలో లక్ష్మణా అంటూ రోదిస్తారు. ఉద్యోగాలు కావాలని.. అన్యాయం జరిగిందని.. నిరుద్యోగులు ఎందుకు రోడ్డెక్కుతారు. రైతన్నలు ఎందుకు పురుగుల మందును ప్రసాదంగా భావిస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నిరుపేదలు ఎందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతారు. రేషన్ దుకాణాల్లో తినడానికి మంచి బియ్యం ఇయ్యండయ్యా అని ఎందుకు చేతులు చాచి అడుగుతారు. వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయమని కాటికి కాలుచాచిన వృద్దులు కలెక్టర్ కార్యాలయాల మెట్లు ఎందుకు ఎక్కుతారు. తెలంగాణ తెచ్చుకుంది.. మీ ప్రభుత్వం చూపే జాలి చూపులకోసం.. ఇచ్చే పథకాల కోసం కాదు.. తెలంగాణ ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు గౌరవంగా బ్రతకడానికి పోరాటం చేసి మరీ తెలంగాణ సాధించుకున్నారు. మా ఆత్మగౌరవాన్ని చంపకండి సార్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు