- 24 విలువలకు చిహ్నం..
- భారతీయ జీవన సంస్కృతికి, ధైర్యానికి నిలువుటద్దం..
( అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు.. )
మువ్వన్నెల జెండాను చూస్తుంటేనే గుండె నిండా దేశభక్తి ఉప్పొగుతుంది. మూడు రంగుల జెండా మధ్యలో ‘నీలం’ రంగుతో ఉన్న అశోకచక్రం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆ ‘ధర్మచక్రం’ నైతిక విలువలకు చిహ్నం. అందులోని 24 ఆకుల్లో ప్రతిదీ ఓ విలువను చాటుతుంది. వాటిని ఆచరించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. జాతీయ పతాకంలోని కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి ప్రతీక. మధ్యలోని ధర్మచక్రం మాత్రం పౌరులు 24గంటలు పాటించాల్సిన 24 నైతిక విలువలను సూచిస్తుంది. అశోకుడి స్తూపం నుంచి స్వీకరించిన ‘ధర్మచక్రం’తో కూడిన త్రివర్ణ పతాకాన్ని 1947 జులై 22న జాతీయ పతాకంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ చక్రంలోని ధర్మ స్ఫూర్తిపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్ అశోకచక్రంలోని అద్భుతమైన స్ఫూర్తినిచ్చే 24 నైతిక విలువలను ఒకసారి చూద్దాం..
ప్రేమ :
సృష్టిలోని ప్రతి జీవి, దేశం, దేవుడిపై ప్రేమతో ఉండాలి. ప్రేమకు అన్నింటినీ జయించే శక్తి ఉంటుంది.
ధైర్యం :
ఎంచుకున్న మార్గంలో ధైర్యంగా ముందుకెళ్లాలి. దీంతో ప్రతికూలతలను అవలీలగా జయించవచ్చు.
సహనం :
ప్రపంచాన్ని గెలిచే సహనం అలవర్చుకోవాలి. ఒక మొక్క నాటి అది ఫలాలనిచ్చే వరకు ఎలా నిరీక్షిస్తామో అలాగే ప్రతి విషయంలోనూ సహనం పాటిస్తే ఎలాంటి వివాదాలు మన దరికి రావు.
శాంతి :
కుటుంబం, సమాజంతో శాంతియుతంగా జీవించాలి. అత్యాశ, ద్వేషం, అసూయ, వంచన వంటి అవలక్షణాలు వదిలేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచితే శాంతి దానంతట అదే లభిస్తుంది.
కరుణ :
ఇతరుల బాధలపై సున్నితత్వం, భావోద్వేగానికి లోనై వారికి ఉపశమనం కలిగించడం, తోటి మనుషుల పట్ల కరుణతో ఉండాలి.
మంచి :
ఒక వ్యక్తి జీవితంలో ఎంత సంపాదించినా ఆయన గడించిన కీర్తి తన మంచితనంతోనే తెలుస్తుంది. అంటే వ్యక్తిగత, కుటుంబ, సమాజ, అలవాట్లు, ఆలోచనలు, చర్యలు ఉన్నతంగా ఉండాలి.
విశ్వాసం :
వ్యక్తులు, వ్యవస్థలపై విశ్వాసం ఉండాలి. ముఖ్యంగా మనపై మనకు ఆత్మవిశ్వాసం కచ్చితంగా అవసరం.
హుందాతనం :
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లు స్థితప్రజ్ఞతతో మసలుకుంటూ ఉండటమే హుందాతనం. మాట, నడక, ప్రవర్తన అన్నింటిలోనూ హుందాగా వ్యవహరించాలి.
సంయమనం :
ఏ విషయంలోనైనా సంయమనం పాటించాలి. ప్రస్తుత సమాజంలో సంయమనమే శాంతికి ప్రధాన ఆయుధం.
లాభాపేక్ష వద్దు :
ఇది చేస్తే నాకు ఏంటి? అన్న ధోరణిని వీడడానికి ప్రయత్నించాలి. దేశ వనరులు సద్వినియోగం చేసుకునే మనం వాటి సంరక్షణకు సైతం కృషి చేయాలి.
త్యాగనిరతి :
ఒకనాటి జాతీయ నాయకులు, అమరవీరుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్య్రం, స్వేచ్ఛా జీవనం. ప్రస్తుత సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
నిజాయతీ :
పౌరుడిగా, విద్యార్థిగా, ఉద్యోగిగా, రాజకీయ నాయకుడిగా.. మనకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించడంలో నిజాయతీగా ఉండాలి.
కచ్చితత్వం :
ఒకే మాటకు కట్టుబడి ఉండే కచ్చితత్వ స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి.
న్యాయం :
దైనందిన జీవితంలో న్యాయంగా బతకాలి. ఎదుటివారికి అన్యాయం చేయకుండా మనకు న్యాయంగా దక్కాల్సినవి మాత్రమే స్వీకరించాలి.
దయ :
సమస్త మానవులపై దయ కలిగి ఉండాలి. సాహసం, వీరత్వం కంటే దయా గుణమే కీలకం.
ఆహ్లాదం :
ప్రశాంతమైన మనసు మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి మనసును పొందడానికి ఆహ్లాదకర జీవనం సాగించాలి.
వినయం :
వ్యక్తి ఔన్నత్యాన్ని చాటేది, ప్రతి ఒక్కరిలోనూ ఉండాల్సిన ప్రధాన లక్షణమిది. ఈ సుగుణాన్ని అన్ని విషయాల్లోనూ అమలు చేయాలి.
ఆర్ధ్రత :
ఇతరుల సమస్యలకు చలించి సాయం చేసేందుకు ముందుకు రావాలి.
సానుభూతి :
ఎదుటి వారి భావాలను వారి కోణంలో అనుభూతి పొందడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ ఇతరుల మనోభావాలను గౌరవించాలి.
ఆధ్యాత్మిక జ్ఞానం :
మనిషి అంతరంగాన్ని శోధించి ఇంద్రియాలను నియంత్రించుకునే శక్తి పొందేలా ప్రయత్నించాలి.
దేవుడిపై నమ్మకం :
మనం విశ్వసించే భగవంతుడిపై నమ్మకంతో ఉంటూ.. చూపిన మార్గంలో పయనించాలి.
అత్యుత్తమ నైతికత :
నైతిక విలువలను ఎప్పుడూ ఆచరించాలి. కుటుంబ బాంధవ్యాలు, వ్యాపారం, వృత్తి… ఇలా ఏ రంగమైనా అందులో నీతిని అనుసరించాలి.
పరోపకారం :
ఆపదలో ఉన్నవారు, నిస్సాహాయులను ఆదుకునేలా తీర్మానించుకోవాలి. సేవానిరతితో ఉంటే లభించే సంతృప్తి వేరు.
ఆశ :
మనిషి ఆశాజీవి. ఏదైనా సాధించాలనే ఆశ కలిగి ఉండాలి. అదే సమయంలో దురాశ చేటు అనే విషయాన్ని సైతం గ్రహించాలి..
తప్పక చదవండి
-Advertisement-