అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు చిన్నారులపై ఓ మహిళా ఉద్యోగిని దారుణానికి పాల్పడింది. అనాథ పిల్లలైన ఆ ఇద్దరి జట్టు పట్టుకొని చితక్కొట్టింది. మంచంపై ఎత్తేసి హింసించింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగు చూసింది. అనాథలైన 6 సంవత్సరాల లోపు చిన్నారులకు కాంకేర్ జిల్లాలోని అడాప్షన్ సెంటర్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే అక్కడ పని చేసే ప్రోగ్రాం మేనేజర్ సీమా ద్వివేది మాత్రం పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఓ ఇద్దరు చిన్నారులను మానసికంగా హింసించింది. ఆ పిల్లల జుట్టు పట్టుకుని చితక్కొట్టింది. అనంతరం వారిని మంచంపై ఎత్తేసింది. ఈ దారుణ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పిల్లలపై దాడి చేసిన సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు ఉద్యోగులు కూడా ద్వివేదిని అడ్డుకోలేదు.
మొత్తానికి ఈ వీడియో బయటకు రావడంతో కాంకేర్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక శుక్లా సీరియస్‌గా స్పందించారు. అడాప్షన్ సెంటర్ ప్రోగ్రాం మేనేజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. గతంలో ఆ సెంటర్ ఉద్యోగులు సీమ ద్వివేది ప్రవర్తన బాగాలేదని, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.