Tuesday, May 7, 2024

సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వండి.. ప్లీజ్.!

తప్పక చదవండి
  • పెండింగ్ మిల్లర్లను దేపురిస్తున్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు..
  • మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని మిల్లుతో సహా 59 మిల్లర్లకు నోటీసులు..
  • 2021-22 రబీ సీజన్ గడువు ముగిసినా, సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వని తిరుమలగిరి మిల్లర్స్.. దాని విలువ 49 కోట్లు
  • జిల్లా అధ్యక్షుని ఒక్క మిల్లు నుండే రావాల్సిన సి.ఎం.ఆర్ బకాయి 19 కోట్ల 91 లక్షలు..
  • పంట పండించిన రైతు కంటనీరు.. నయాపైసా పెట్టుబడి లేకుండానే కోట్లకు పడగలెత్తిన మిల్లర్లు.!
  • తెలంగాణ ‘కస్టమ్ రైస్ మిల్లింగ్’ పాలసీ.. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది.!

పెరుమాళ్ల నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి..

హైదరాబాద్, 14 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ ‘కస్టమ్ రైస్ మిల్లింగ్’ (సి.ఎం.ఆర్) పాలసీ కొంతమంది డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు కల్పతరువుగా మారింది. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు రైస్ మిల్లర్ల పాలిట వరమైంది. సి.ఎం.ఆర్ ప్రక్రియలో తీవ్రమైన నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. నెలలు గడుస్తున్న మిల్లింగ్ రైస్ గోదాములకు చేరడం లేదు. దీని ఫలితంగా ప్రభుత్వ ఖజానా పై తీవ్రమైన భారం పడుతుంది. కానీ రైస్ మిల్లుల అక్రమ దందా మాత్రం రోజుకురోజు జోరు అందుకుంటుంది.

- Advertisement -

సి.ఎం.ఆర్ అక్రమ వ్యాపారంతో కొంతమంది మిల్లర్లు కోట్లకు పడగలెత్తారు. ఒక సీజన్ పూర్తి అయిపోయి, మరో సీజన్ వచ్చేసరికి కూడా మిల్లర్లు సంబంధిత సి.ఎం.ఆర్ బియ్యాన్ని మాత్రం ఎఫ్.సి.ఐ, సివిల్ సప్లయ్ శాఖలకు అప్పగించకుండా యదేచ్చగా బ్లాక్ దందా నిర్వహిస్తున్నారు. 2021-22 రబీ సీజన్ కు చెందిన సి.ఎం.ఆర్ గడువు మే 31 నాటికి ముగిసింది. గడువు ముగిసినా, సూర్యాపేట ఒక్క జిల్లాలోనే పలువురు మిల్లర్ల వద్ద ఇంకా 88 కోట్ల 53 లక్షల 75 వేల విలువైన సి.ఎం.ఆర్ బియ్యం బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లా అధికారులు మిల్లర్లపై కొరడా ఝులిపించి బియ్యం రికవరీ చేసే పరిస్థితులు లేకపోవడం, మిల్లర్ల తరపున రాజకీయ నాయకులు ఒకాలత్ పుచ్చుకోవడంతో అధికారులు చేసేది ఏమీ లేక డిఫాల్ట్ మిల్లర్లనే దేపురించే (బ్రతిమాలుకోవడం) దుస్థితి ఏర్పడింది. సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వండి.. ప్లీజ్.! అన్న చందంగా ఇక్కడ వ్యవహారం నడుస్తోంది.

జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్ల అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి చెందిన మిల్లులే డిఫాల్ట్ జాబితాలో ఉన్నాయంటేనే ఇక్కడ ఆదర్శం తలకిందులైందని అర్థమవుతోంది. జిల్లాలో 2021-22 రబీ సీజన్ సి.ఎం.ఆర్ బియ్యం బకాయి ఖరీదు సుమారు 88 కోట్లు ఉండగా, అందులో కేవలం తిరుమలగిరి మండల కేంద్రంలోని నాలుగు మిల్లులోనే 49 కోట్ల 27 లక్షల ఖరీదు చేసే సీ.ఎం.ఆర్ ఇక్కడే దాగి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన ఇమ్మడి సోమ నర్సయ్యది సొంత మండలం తిరుమలగిరి కావడం గమనార్హం. ఈ జిల్లాలో ఉన్న కొంతమంది మిల్లర్లు ఒకరిని మించి మరొకరు డిఫాల్ట్ జాబితాలో ఎక్కేందుకు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. తిరుమలగిరి మిల్లర్ల సంగతి ఈ విధంగా ఉంటే, కోదాడ ప్రాంతానికి చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (కొమరబండ) అనే ఒక్క రైస్ మిల్లర్ వద్దనే 2021-22 రబీ సీజన్ బకాయి బియ్యం ఖరీదు సుమారు 26 కోట్ల 77 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రజాధనం దోచుకొని.. దాచుకోండి..!
అధికారంలో ఉన్న మాకు ఆర్థిక వనరులు సమకూర్చండి.!!

ప్రజాధనం దోచుకుని.. దాచుకోండి.! అధికారంలో ఉన్న మాకు ఆర్థిక వనరులు సమకూర్చండి.! అన్న రీతిలో అధికార పార్టీ నాయకులు కొంతమంది డిఫాల్ట్ మిల్లర్లను తెర వెనుకనుండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సి.ఎం.ఆర్ పాలసీ, జీవో నెంబర్ 23 ప్రకారం పరిశీలిస్తే సంబంధిత ఆయా జిల్లాల మిల్లర్స్ అసోసియేషన్లు కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. జిల్లా అసోసియేషన్ల అధ్యక్షులను ప్రభుత్వ పాలసీలో కీలకం చేశారు. ఆయా జిల్లాల్లో ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయించాలన్న, సి.ఎం.ఆర్ రికవరీలో జాప్యం జరిగినా సంబంధిత ఎం.ఓ.యు ప్రకారం జిల్లా అసోసియేషన్ పూర్తి బాధ్యత వహించవల్సి ఉంటుంది. సూర్యాపేట జిల్లా విషయంలో ఏకంగా జిల్లా మిల్లర్స్ సంఘం అధ్యక్షుని మిల్లునే అధికారులు డిఫాల్ట్ జాబితాలో చేర్చడం గమనించదగిన విషయం.

నోటీసులు ఇచ్చేది వీళ్లే.. సన్మానాలు చేసేది వీళ్లే..!
జిల్లాలో ఉండబడిన 74 మిల్లులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇతర మిల్లులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులకు తాను ఇన్స్పిరేషన్ గా ఉండాల్సింది పోయి, తిరుమలగిరిలో తాను నడుపుతున్న సంతోష్ రైస్ ఇండస్ట్రీస్ అనే ఒక్క మిల్లులోనే 2021- 22 రబీ సీజన్ సి.ఎం.ఆర్ నేటికీ సివిల్ సప్లయ్ శాఖకు అప్పగించకుండా డిఫాల్ట్ జాబితాలో చేరిపోయినట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడువు దాటిన సదరు మిల్లర్ 25 శాతం అదనంగా సి.ఎం.ఆర్ బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం పరిశీలిస్తే సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు ఇమ్మడి సోమ నర్సయ్యకు చెందిన ఒక్క సంతోష్ రైస్ ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్ సివిల్ సప్లయ్ రికార్డుల మేరకు 177 ఎ.సి.కేల బియ్యం బకాయి ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఒక్కో ఎ.సి.కె. విలువ గరిష్టంగా సుమారు 9 లక్షలు ఉంటుంది. దీనికి అదనంగా 25% పెనాల్టీతో కలిపితే సదరు బియ్యం బకాయి విలువ 19 కోట్ల 91 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా.

ఇదిలా ఉండగా 2022-23 ఖరీఫ్ సీజన్ కు చెందిన సి.ఎం.ఆర్ అప్పగించడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని, రోజువారీగా టార్గెట్ విధిస్తూ సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ శాఖ జిల్లా మేనేజర్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని సొంత మిల్లులతో పాటు 59 మంది మిల్లర్లకు జూన్ 7వ తేదీన నోటీసులు జారీ చేశారు (సంబంధిత నోటీస్ లేఖ నెం. ఎమ్.కె.టి.జి/ఎమ్ 2/6349/ఖరీఫ్ 2022-23, తేదీ.07-06-2023). అయితే ఈ 59 రైస్ మిల్లుల్లో కేవలం 37 మంది మిల్లర్స్ మాత్రమే జీరో స్థాయిలో ఉన్నారు. ఇందులో జిల్లా అధ్యక్షునికి చెందిన సంతోష్ రైస్ ఇండస్ట్రీస్, రఘురామ్ రైస్ మిల్లుల తోపాటు, ఈయన కనుసన్నల్లో నడుస్తున్న శ్రీ లక్ష్మీ ట్రేడర్స్, హర్షిత రైస్ కార్పొరేషన్, శ్రీ సంతోషిమాత బిన్నీ రైస్ మిల్ ఇవన్నీ కూడా జీరోస్థాయి టాప్ లిస్టులో ఉన్నట్లు సదరు సివిల్ సప్లయ్ జారీ చేసిన నోటీసుల ప్రకారం స్పష్టమవుతోంది. ఈ మధ్యనే సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ ఇరువురు జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షున్ని సన్మానించి, ప్రశంసా పత్రం అందజేసిన విషయమై పలువురు మిల్లర్లు గుసగుసలాడుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు