Friday, May 3, 2024

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం ఒక్కటే..

తప్పక చదవండి
  • మూడు పార్టీలూ ఒకేతాను ముక్కలే..
  • రైతు సమాజానికి గౌరవం కలిగించేలా కేంద్ర పథకాలు
  • మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడి..

వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడించారు.. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎరువుల రిటైల్‌ షాప్స్‌ నేటి నుంచి ప్రధాన మంత్రి కిసాన్‌ సేవా కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర సేవలు పీఎం కిసాన్‌ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకేచోట కల్పించేందుకు ఎరువుల రిటైల్‌ షాపులను ఈ కేంద్రాలుగా మారుస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మొదటి దశలో రేపు ఒక లక్షా 25వేల షాపులను ప్రారంభిస్తారని తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించారు.. సల్ఫర్‌ కోటెడ్‌ యూరియా నేటి నుండి అందుబాటులోకి వస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. భారత్‌ బ్రాండ్‌ పేరుతో నేటి నుండి ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. అన్నదాతలకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల రిటైల్‌ దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్‌ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ కేంద్రాలను రేపు ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ప్రారంభిస్తారన్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్దేశిత ధరలతో ఈ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదే విధంగా ఈ పీఎం కిసాన్‌ సేవా కేంద్రాల్లో భూసార పరీక్షలు, విత్తన పరీక్షలు నిర్వహిస్తారన్నారన్న కిషన్‌ రెడ్డి.. వ్యవసాయానికి కావాల్సిన పరికరాల అమ్మకాలు, కిరాయికి ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. 14వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధులను ప్రధాని రైతుల ఖాతాల్లో జమ చేస్తారని.. గురువారం రోజున 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో రూ. 17,500 కోట్లు ప్రధాని జమ చేస్తారని కిషన్‌ రెడ్డి పేర్కొన్నాయి. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులు జమకానున్నాయని ఆయన వెల్లడించారు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఎరువుల కొరత లేదని కిషన్‌ రెడ్డి తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎరువు’ నినాదంతో భారత్‌ బ్రాండ్‌ పేరుతో రేపటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌, బీ.ఆర్.ఎస్., మజ్లిస్‌ ఒక్కతాను ముక్కలేనన్న కిషన్‌ రెడ్డి.. గతంలో కలిసి పని చేశారని, భవిష్యత్‌లోనూ కలిసి పని చేస్తారని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీలన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా మూడు పార్టీలు అనేక సార్లు తెలంగాణను పరిపాలించాయన్నారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం దగ్గర ఉందన్నారు. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీనే సాధ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు