Thursday, May 16, 2024

ఈనెల 30న పాలమూరు ప్రజాభేరి..

తప్పక చదవండి
  • పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి విశ్వ ప్రయత్నాలు..
  • హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ
  • మహిళా డిక్లరేషన్ ప్రకటనకు సర్వం సిద్ధం చేసిన పార్టీ వర్గాలు..

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యే పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభను.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతు డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్‌ సహా ఇప్పటికే పలు ప్రజాకర్షక ఎన్నికల హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌.. కొల్లాపూర్‌లో జరిగే సభ ద్వారా మహిళా డిక్లరేషన్‌ కు సిద్ధమవుతోంది. మహిళలకు ఏ పార్టీ ఇవ్వని విధంగా, గతంలో ఎప్పుడూ లేని హామీలను ప్రియాంక.. ప్రకటించనున్నారని నేతలు చెబుతున్నారు. ఇదే సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గురునాథ్‌ రెడ్డి సహా.. కీలక నేతలు కాంగ్రెస్‌ లో చేరనున్నారు. ఖమ్మంలో జరిగిన రాహల్‌గాంధీ సభ తర్వాత.. ఈనెల 30న నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా కాంగ్రెస్‌ తలపెట్టిన పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి హస్తం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ.. ఆ సభకు హాజరుకానుడటంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు, సీనియర్‌ నేతలతో సన్నాహాక సమావేశాన్ని మహబూబ్‌ నగర్‌లో నిర్వహించారు. కేసీఆర్‌ పాలన వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు.. కాంగ్రెస్‌ గెలిస్తే ఏం చేయబోతోందో ఆ సభ ద్వారా ప్రజలకు వివరించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్‌, ఆసరా పింఛన్ల పెంపు సహా ప్రజాకర్షక వాగ్దానాలను జనంపై కురిపించిన హస్తం పార్టీ.. కొల్లాపూర్‌లో మహిళా డిక్లరేషన్‌ ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయనుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా.. గతంలో ఎప్పుడు లేని విధంగా మహిళా డిక్లరేషన్‌ ఉండబోతోందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా కొల్లాపూర్‌ సభకు పెద్ద ఎత్తున మహిళలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి ఇప్పటికే జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సీనియర్‌ నేతలతో బాధ్యులను ప్రకటించిన పీసీసీ.. ప్రత్యేక బాధ్యులుగా మహిళా నాయకురాళ్లను నియమించనుంది. మహిళా డిక్లరేషన్‌ తో పాటు.. పలు ప్రజాకర్షక హామీలను కొల్లాపూర్‌ సభ ద్వారా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఆయన కుమారుడు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాధ్‌ రెడ్డి సహా వనపర్తి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో నేతలు ఆ సభ ద్వారా కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. కొత్తగా చేరుతున్న నేతలు, ఇన్నేళ్లు పార్టీకి సేవచేసిన నేతల మధ్య విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా కలసికట్టుగా శ్రమించి సభను విజయవంతం చేయాలని.. తద్వారా కాంగ్రెస్‌ బలాన్నిచాటాలని ఏఐసీసీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకరి కంటే ఎక్కువమంది ఆశావహులున్నారు. ఎన్నికల్లో టికెట్‌ దక్కుతుందన్న ఆశతో పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు కొత్తనేతల చేరికతో వారిలో గందరగోళం మొదలైంది. పాత వాళ్లకే టిక్కెట్లు ఇవ్వాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోనూ విభేదాల్ని పక్కనపెట్టి సభ విజయవంతంపై దృష్టి సారించేలా నాయకత్వం చర్యలు చేపట్టింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు