- సిగ్గులేకుండా మా ఘనతేనంటూ గొప్పలు చెప్పుకుంటారా?
- కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణ వ్యయమంతా కేంద్రానిదే..
- ఆమోదం పొంది 7 నెలలైనా ఇంతవరకు పనులెందుకు కేటాయించలేదు?
- వెంటనే పనులు చేపట్టాలంటూ బీజేపీ ఆందోళనలు చేసిన మాట నిజం కాదా?
- 80 శాతం వాటా ఇస్తానంటూ అంగీకరించి మాట తప్పింది మీరు కాదా?
- తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పండి..
- వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయండి..
- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ధ్వజం..
హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ ఓబీ) నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనతగా చెప్పుకుంటూ బీఆర్ఎస్ నేతలు సీఎంకు పాలాభిషేకం చేస్తూ సంబురాలు చేసుకోవడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆర్వోబీ కేంద్రం ఆమోదం తెలిపి 7 నెలలైనా ఇంతవరకు ఎందుకు టెండర్ పనులను ఖరారు చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం 126 కోట్ల 74 లక్షల రూపాయలను కేంద్రమే చెల్లించేందుకు అంగీకరించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆర్వోబీ నిర్మాణ పనులను ప్రారంభించి తొందరగా పూర్తి చేయాలని అనేకమార్లు తాను ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవం కాదా? జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేసింది నిజం కాదా? అని అన్నారు. ‘‘ఇదిగో…ఆధారాలు.. ఆర్వోబీ నిర్మాణం, నిధుల కేటాయింపుతోపాటు తొందరగా పనులు పూర్తి చేయాలంటూ నేను ప్రభుత్వానికి, అధికారులకు రాసిన లేఖలివిగో…’’అంటూ కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖ అధికారులకు రాసిన లేఖలను, ప్రత్యుత్తరాలను మీడియాకు విడుదల చేశారు. ‘’ఆర్వోబీ నిర్మాణానికయ్యే ఖర్చులో 80 శాతం వాటా చెల్లించడానికి తొలుత అంగీకరించింది మీరే. ఆ తరువాత మాట తప్పింది మీరే. కేంద్రమే నిర్మాణ వ్యయం మొత్తాన్ని భరించేందుకు సిద్ధమై ఆమోదం తెలిపినా పనులను ప్రారంభించకుండా జాప్యం చేసింది మీరే. తిరిగి కేంద్రం వల్లే జాప్యమవుతోందంటూ కేంద్రంపై నిందలేస్తారా?’’ అంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. సొమ్ము కేంద్రానిదైతే… సోకు బీఆర్ఎస్ నేతలదే… అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ పాలాభిషేకాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ఆర్వోబీ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యానికి తామే కారణమంటూ ముక్కు నేలకు రాసి కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు వెంటనే పనులు తొలగించాలని కోరారు.