Monday, September 9, 2024
spot_img

అన్నం పెట్టే చేతులకు హత్కడీ..( దశాబ్ది ఉత్సవ వేళ తెలంగాణ రైతుకు బేడీలు.. )

తప్పక చదవండి
  • చేతులకు బేడీలతో భువనగిరి కోర్టుకు తరలించిన దుర్మార్గం..
  • భూములు కోల్పోతున్న రైతుల ఆందోళనపై సర్కార్ ఉక్కుపాదం..
  • కేసులు పెట్టి జైళ్లో తోసిన కేసీఆర్ ప్రభుత్వం..
  • ట్రిపుల్ ఆర్ బాధితులకు బీ.ఆర్.ఎస్. మార్క్ మర్యాద
  • మే 30 మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత..
  • అరెస్టు చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్..
  • ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎంపి కోమటిరెడ్డి..

( ప్రపంచంలో మోసపోవడమే తప్ప మోసం చేయడం తెలియని వాడు రైతు.. ఐదు వేళ్ళు కూడా నోటిలోకి వెళ్ళడానికి అలమటించే రైతన్న.. ఆ వేళ్లతోనే మట్టిని పిసికి.. మనందరికీ అన్నం పెడతాడు.. అలాంటి రైతన్న చేతులకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి,,? )

రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ.. దశ దిశలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ మరోమారు తెలంగాణ రైతుల చేతులకు బేడీలు పడ్డాయి. తమ భూములు ఇవ్వమని అడిగినందుకు అక్రమ కేసులు పెట్టడమే గాకుండా.. బేడీలు వేసి మరీ కోర్టుకు లాక్కెళ్లారు పోలీసులు.. రీజినల్‌ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతున్నరైతులు ఆందోళనకు దిగడంతో కేసులు నమోదు చేసిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టులో హాజరుపర్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలు వస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మే 30న భువనగిరి కలెక్టరేట్‌ ఎదుట రైతులు ఆందోళన చేశారు. వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసిన భువనగిరి రూరల్‌ పోలీసులు.. అదే రోజు రిమాండ్‌కు తరలించారు. అందులో భాగంగా రైతులకు బేడీలు వేసి భవనగిరి కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం వారికి సంకెళ్లు వేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

- Advertisement -

యాదాద్రి భువనగిరి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గత కొద్ది రోజులుగా రైతులు యాదాద్రి భువనగిరి జిల్లాలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు బాధితులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే మే 30న కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేసిన క్రమంలో పోలీసులు వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. నిరసనలో భాగంగా మంత్రి జగదీశ్​ రెడ్డి కాన్వాయ్​ని రైతులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అవుట్ పోస్ట్​ ను కాలబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ.. ఆరుగురు రైతులపై ఐపీసీ 147, 148, 341, 427, 436, 353, 120 బీ(రెడ్ విత్) 149 ఐపీసీ సెక్షన్​ 3 (పీడీపీపీ యాక్ట్) కింద కేసులు​ పెట్టారు.

కేసులు నమోదైన వారిలో గడ్డమీది మల్లేశ్​, పల్లెర్ల యాదగిరి, అవిశెట్టి నిఖిల్, మల్లెబోయిన బాలును మే 30న రాత్రి అరెస్ట్​ చేశారు. బీజేపీ నాయకుడు​ గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్​ లీడర్​ తంగెళ్లపల్లి రవికుమార్​ పరారీలో ఉన్నట్లు చూపారు. రిమాండ్​కు తరలించిన నలుగురు భువనగిరి సబ్​జైలులో ఉండగా బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లు ములాఖత్​కు ప్రయత్నించారు. దీంతో ఆ నలుగురిని నల్లగొండ జైలుకు మార్చారు. కోర్టు నలుగురికి 14 రోజుల రిమాండ్ విధించించగా.. మంగళవారంతో గడువు ముగిసింది. బెయిల్ కూడా మంజూరైంది. వారిని భువనగిరి కోర్టు హాజరు పర్చేందుకు బేడీలతో తీసుకువచ్చారు. దారుణం ఏమిటంటే ఇద్దరేసి రైతులకు కలిపి బేడీలు వేసి కోర్టుకు తీసుకు రావడం గమనార్హం.

ఇకపోతే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మునుగోడు, భువనగిరి, ఆలేరు సెగ్మెంట్ల పరిధిలోని ఐదు మండలాలకు ఈ రీజినల్ రింగ్ రోడ్ ఎఫెక్ట్ ఉంటుంది. యాదాద్రి అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భూముల రేట్లు బాగా పెరిగాయి.. ప్రభుత్వం ఎకరాకు కేవలం ఐదారు లక్షలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఒక్క రాయగిరికి చెందిన రైతుల భూమే ఎక్కువగా పోతుంది. దీంతో ఆందోళనకు గురైన రైతులు అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది పోలీసులను తీసుకొని వచ్చిన అధికారులు రైతులను అరెస్టు చేసి వారి భూముల్లో సర్వేలు చేశారు. వాస్తవానికి పాత అలైన్ మెంట్ ప్రకారం భూసేకరణ చేస్తే.. తమ భూమి కాకుండా రాజకీయ నాయకులది, ప్రజా ప్రతినిధుల జాగా పోతుందని, కావాలనే మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. పాత అలైన్ మెంట్ ప్రకారం చేస్తే తమకు ఎలాంటి నష్టం వాటిళ్లదని అంటున్నారు.

హైదరాబాద్–విజయవాడ రహదారి విస్తరణలో భాగంగా తమ భూములను సర్కారు తీసుకొని పరిహారం అందించిందని, ఆ డబ్బులతో బస్వాపురం రిజర్వార్ పరిసరాల్లో కొనుక్కున్నామని, అప్పటి వరకు ఆ రిజర్వాయర్ ఊసే లేదని రైతులు అంటున్నారు. తర్వాత అక్కడ రిజర్వాయర్ ప్రతిపాదనలో మరో సారి భూములు లాక్కొని యాదాద్రి సమీపంలో కేటాయించిందంటున్నారు. తర్వాత టెంపుల్ సిటీ విస్తరణ పేరుతో మరోమారు భూముల లాక్కుందని, తామంతా పేద రైతులమని ఎవరికి రెండు మూడు ఎకరాలకు మించి భూమి లేదని ఆవేదన చెందుతున్నారు. మరో మారు తమ భూములను లాక్కుంటే ఎలా బతకాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు..

అన్నదాత చేతులకు బేడీలు వెయ్యడం అమానుషం : కోమటిరెడ్డి వెంకట రెడ్డి..
రైతులకు బేడీలు వేయడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం భూసేకరణ పేరుతో దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు తీసుకోకుండా రైతుల భూములను గుంజుకుంటున్నారు. దీనిపై రైతులు శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నా అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. రాయగిరి రైతులకు బేడీలు వేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి అన్నారు.. రైతుల కోసమే పని చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా. రైతులపై కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేయడం మంచి పద్దతి కాదని సూచించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లా.. రాయగిరి ట్రిబుల్‌ ఆర్‌ రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. రైతులపై కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతోందన్న బాధతో భువనగిరి, రాయగిరి, ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారని వెల్లడిరచారు. శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయినా, కొందర్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు