- అధికారుల సహకారం, ప్రజా ప్రతినిధి అండతోనే అక్రమ నిర్మాణాలు
- కబ్జా స్థలాన్ని సందర్శించిన అధికారులు వెనుతిరగడంలో మతలబు ఏంటి?
- ప్రభుత్వ స్థలం కబ్జాలో స్థానిక ఎమ్మెల్యేకు సైతం వాటాలున్నాయంటూ ఆరోపణలు
- బీఆర్‌ఎస్ నాయకుడి కబ్జాల పర్వంతో గంగ పాలవుతున్న పార్టీ పరువు
- కబ్జాదారుడికి పరోక్ష సహకారం అందిస్తున్న డిపిఓ సురేష్ మోహన్
- ప్రభుత్వ స్థలం పరిరక్షణకు తహసిల్దార్ దశరథ్ తీసుకున్న చర్యలు శూన్యం
- గ్రామ కార్యదర్శి పై పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ
- ఎమ్మెల్యే అనుచరుడైతే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా?
- రెండుసార్లు కూల్చినా ఆగని అక్రమ నిర్మాణాలు
రాజు తల్చుకుంటే దెబ్బలు కొదవుండదు.. అధికార పార్టీ నాయకులు తలుచుకుంటే జరగని పని అంటూ ఉండదు… అదే బీఆర్‌ఎస్ నాయకులు తలుచుకుంటే ప్రభుత్వ స్థలాలే ఉండవు… అనే విధంగా తయారయ్యింది ప్రస్తుత ప్రభుత్వంలోని వ్యవస్థ… బంగారు తెలంగాణలో ప్రభుత్వ భూములు కనుమరుగు చేసేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు కంకణం కట్టుకున్నారు… గ్రామ కార్యదర్శి, స్థానిక తహసిల్దార్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల సహకారంతో పటేల్ గూడలోని ప్రభుత్వ స్థలాన్ని కైంకర్యం చేయడంలో బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ సఫలీకృతుడు అవ్వడంలో స్థానిక ఎమ్మెల్యే పాత్రి కీలకంగా ఉండడం శోచనీయం…
హైదరాబాద్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం హాయంలో ప్రభుత్వ స్థలాలు కనుమరుగయ్య ప్రమాదం పొంచి ఉంది అనడంలో సందేహం లేదు.. .అందుకు సాక్ష్యమే పటేల్ గూడా సర్వే నెంబర్ 12 లో జరుగుతున్న ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారం.. పఠాన్ చెరువు నియోజకవర్గం, అమీన్ పూర్ మండల పరిధిలోని, పటేల్ గూడా గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 12లో అధికార పార్టీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు చంద్రశేఖర్ చేస్తున్న అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలపడంతో.. ఆయన కబ్జాకాండ నిర్విఘ్నంగా కొనసాగుతుంది.. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను అధికారులు గతంలో రెండుసార్లు కూల్చినప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యే అండతోనే బరితెగించి తిరిగి నిర్మిస్తున్నట్లు స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీ.ఆర్.ఎస్. నాయకుడై ఉండి, ఎమ్మెల్యే అనుచరుడిగా కొనసాగితే ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టినా.. అధికారులు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తారా? అంటూ స్థానికులు చర్చించుకోవడం చూస్తుంటే ఎమ్మెల్యే అండతోనే కబ్జాల పరంపర కొనసాగుతుందని స్పష్టమవు తుంది. రెవెన్యూ అధికారులతో పాటు పంచాయతీరాజ్ అధికారు లకు సైతం సర్వేనెంబర్ 12 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న కబ్జాలలో వాటాలు ఉన్నాయంటూ స్థానికంగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారులు కబ్జా స్థలాన్ని సందర్శించి హడావుడి చేసి, వెను తిరగడం చూస్తుంటే.. స్థానికంగా వెలువెత్తుతున్న ఆరోపణకు బలం చేకూరుతోంది.. బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ కబ్జా వ్యవహారం ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారడంతో పాటు, పార్టీ పరువు సైతం గంగపాలవుతుందని కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తుండడం… రానున్న ఎన్నికల్లో సైతం అమీన్ పూర్ మండలంలో జరుగుతున్న భూకబ్జాల వ్యవహారమే ప్రధాన అంశంగా మారినట్లు స్పష్టమవు తుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకుల కబ్జాల వ్యవహారం, అమీన్ పూర్ మండలంలో పార్టీకి తీరని నష్టం చేస్తాయంటూ.. ఇప్పటికైనా పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీ పుట్టి మునగక తప్పదు అంటూ సీనియర్ నాయకులు బహిరంగంగా చర్చించుకోవడం ఈ ప్రాంతంలోని అధికార పార్టీ నాయకుల కబ్జాల పరంపరను తెలియజేస్తుంది. ఓ వైపు అధికార పార్టీ నాయకుల కబ్జాల పరంపర కొనసాగుతూ ఉంటే.. వాటిని నియంత్రించి విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన డిపిఓ సురేష్ మోహన్ సైతం ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే తప్పేంటి.. అంటుండడం కబ్జాదారులతో వీరికి ఉన్న సత్సంబంధాన్ని తెలియజేస్తుంది. అమీన్ పూర్ మండలంలోని పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చిన రెవెన్యూ అధికారులకి బీ.ఆర్.ఎస్. నాయకులు పటేల్ గూడా సర్వేనెంబర్ 12లో నిర్మిస్తున్న భవనాలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ ప్రభుత్వంలో పేదలకు ఓ న్యాయం బీఆర్‌ఎస్ బడా నాయకులకి మరో న్యాయమా..? అంటూ అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సర్వేనెంబర్ 12 ప్రభుత్వ స్థలంలో బహిరంగంగానే కబ్జాదారులు నిర్మాణాలు చేపడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన తహసీల్దార్ దశరథ్.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చూస్తుంటే.. అంతా ఆయనకు తెలిసే జరుగుతుందని స్పష్టం అవుతుంది. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ, కబ్జాదారుల కొమ్ముకాస్తున్న గ్రామ కార్యదర్శి పై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కబ్జా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి కబ్జాదారులకు అండగా నిలుస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి.. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు… అమీన్ పూర్ మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై, కబ్జాదారులకి సహకరిస్తున్న అధికారుల వ్యవహారాలపై మరిన్ని కథనాలు మీ ముందుకి తేనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్’ ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..
తప్పక చదవండి
-Advertisement-