Monday, April 29, 2024

తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న ఆంధ్రా నేత.. !

తప్పక చదవండి
  • ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పేరుతో అరాచకం..
  • కేసీఆర్ అండదండలతోనే రెచ్చిపోతున్న వైనం..
  • సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్..
  • డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు..
  • కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు..
  • 2016 లో డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకూ పూర్తి చేయని ప్రాజెక్టు..
  • దాదాపు 12 వందలమంది అమాయకుల జీవితాలను
    రక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కి లేదా..?
  • తోట చంద్రశేఖర్ అక్రమాలను అరికట్టి తెలంగాణ
    ప్రజలకు కేసీఆర్ న్యాయం చేయాలి..
  • రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, హఫీజ్ పేటలో సర్వే నెంబర్ 78 పార్ట్ లో
    సవేరా కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ అరాచకాలు..

( బీ.ఆర్.ఎస్. పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.. నాపై ఈగ వాలినా మా అధినేత కేసీఆర్ కన్నెర్రజేస్తాడు.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. అనే ధైర్యంతో విర్రవీగి పోతున్న ఏపీ కి చెందిన నేత తోట చంద్రశేఖర్ మనోగతం ఇది.. సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో నడుపుతున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న తోట చంద్రశేఖర్ ఆగడాలను అరికట్టే నాధుడు లేకపోవడం శోచనీయం.. ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటూ తెలంగాణ ప్రజల సంపదను దోచుకుంటున్న తోట చంద్రశేఖర్.. తనను నిలువరించేవారు లేరంటూ రొమ్ము విరుచుకు తిరుగుతున్నాడు.. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నాడు.. తన పార్టీ బీ.ఆర్.ఎస్. కి ఆంద్రప్రదేశ్ లో ఇంచార్జిగా బాధ్యతలు వహిస్తున్న తోట చంద్రశేఖర్ పై చర్యలు తీసుకుని ప్రజల తరఫున నిలబడతారా..? లేక అనుయాయుడికి వత్తాసు పలికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా..? అన్నది తేలాల్సి ఉంది.. ఒకవేళ అదే జరిగితే తోట చంద్రశేఖర్ అక్రమార్జనలో ఆయనకు కూడా భాగ్యస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రజా బాంధవుడిగా తనకు తాను ఆవిష్కరించుకున్న బీ.ఆర్.ఎస్. అధినేత ప్రజా కంటకుడిగా చరిత్రలో మిగిలిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి.. పైగా ఈ వ్యవహారంపై బాధితుల నుండి ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలకు పూనుకోవడానికి జీ.హెచ్.ఎం.సి. అధికారులు ధైర్యం చేయలేకపోతుండటం గమనార్హం..)

హైదరాబాద్, 15 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఒక సామాన్యుడు కన్న కష్టాలు పడి.. దాచుకున్న సొమ్ముతో ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకుంటే.. ఆగమేఘాలమీద అక్కడ వాలిపోయే, స్థానిక అధికార పార్టీకి చెందిన కుహనా నాయకులు, అవినీతికి పరాకాష్టగా మారిన కొందరు అధికారులు.. నానా రకాల కారణాలు చూపుతూ.. అతను చెమటోడ్చి కట్టుకున్న గూడును చెదరగొడతారు.. అదే ఒక పెద్ద తలకాయ నిబంధనలకు విరుద్ధంగా భారీ కట్టడాలు నిర్మించుకున్నా వారి జోలికి పోవడానికి జంకుతారు.. దీనికి కారణాలు అనేకానేకం ఉన్నా బలైపోయేది పేదవాడు మాత్రమే.. ఇదే కాకుండా కన్నీళ్లతో కడుపు నింపుకుని ఒక పేరొందిన కన్ స్ట్రక్షన్ కంపెనీని నమ్మి అక్కడ ప్లాట్లు కొనుక్కుంటే.. అక్కడా మోసపోయి తమ దీన స్థితిని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక.. నరకయాతన పడుతున్న సంఘటనలు ఎన్నో ప్రతిరోజూ చూస్తున్నాం.. దీనికి కారణాలు వెదికితే.. అధికార పార్టీ అవినీతి, నాయకుల ధనదాహం, కొందరు అధికారుల అవినీతి భాగోతాలు వెలుగు చూస్తాయి.. అలాంటి పరిస్థితే ఇప్పుడు బీ.ఆర్.ఎస్. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి తోట చంద్రశేఖర్, తన సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో నడుపుతున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో లక్షలు వెచ్చించి ప్లాట్లు కొన్న అమాయకులకు ఎదురైంది..

- Advertisement -

లక్షలు పోసి తాము ఆదిత్యలో కొనుగోలు చేసిన ఫ్లాట్స్ అమ్ముకోవాలనుకుంటే కుదరని విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి.. సంస్థ యాజమాన్యం కొందరు అధికారులను మభ్యపెట్టి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ చేస్తారు. అదే కస్టమర్లు తమ ప్లేట్స్ అమ్ముకోవాలంటే మాత్రం సవాలక్ష తిప్పలు పడాలి. చివరకు నోటరీయే గతి అవుతోంది.. తోట చంద్రశేఖర్ కనుసన్నల్లో నడుస్తున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్ లో కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.. 2016లో డబ్బులు వసూలు చేసిన యాజమాన్యం ఇప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. టైటిల్ క్లియర్ లేని ఈ ప్లేట్స్ పై ఏవిధంగా పోరాడాలో అర్థం కావడం లేదు కస్టమర్స్ కి.. దాదాపు 600 మంది ఇప్పటికే పూర్తి డబ్భులు చెల్లించారు.. ఇంకో 600 మంది పాక్షికంగా చెల్లించిన వారిలో ఉన్నారు.. వీరి భవిష్యత్తు ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు..

డబ్బుల పేరుతో ఆరాచకం :
ఫ్లాట్ బుక్ చేసుకునే ముందు డబ్బులు ఎలా ఇవ్వాలో రాయించుకుంటారు.. ఆ ప్రకారంగా ఇవ్వకపోతే.. నెల నెలకు 3 రూపాయల వడ్డీ ఇవ్వాలంటారు. వడ్డీకి మళ్లీ వడ్డీ వేసి ఇచ్చిన సొమ్ముకంటే ఎక్కువ రాబడతారు. లేకపోతే, ఫ్లాట్ ఇవ్వమని బెదిరిస్తారని కస్టమర్స్ వాపోతున్నారు. బౌన్సర్స్ ని పెట్టిమరీ దమ్కీ ఇస్తుంటారని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పమంటే.. మొదట నెల, 6 నెలలు అంటూ చెప్పి.. తీరా సమయం పూర్తి కాగానే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారని అంటున్నారు కస్టమర్స్.. ఏ అధికారి వద్దకు వెళ్లినా ఎందుకు కొనుగోలు చేశారని ఎదురు ప్రశ్నించే వారే తప్ప.. చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు 2020 వరకు ముగిశాయి. మళ్లీ రెన్యువల్ కి అప్లై చేసుకున్నా.. అధికారులు ఇచ్చే ధైర్యం. చేయడం లేదు. ఒకవైపు ఫ్లాట్ ఓనర్స్ ని మోసం చేయడాన్ని చూస్తూ… టైటిల్ వివాదం ఉండటంతో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. కానీ, అక్రమంగా జరుగుతున్న కన్ స్ట్రక్షన్ ని మాత్రం ఆపలేకపోతున్నారు.. 2016 లో అనుమతులు ఇచ్చినా.. అప్పటికీ ఇప్పటికీ చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కొత్త మున్సిపల్ చట్టం అమల్లో ఉంది. అన్ని అనుమతులు ఉన్నా మళ్లీ అమ్ముకునేందుకు వీలు లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు బాధితులు. ఈ దాగుడు మూతల వ్యవహారంలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు దగాకు గురవుతున్నారు. నిర్మాణం, అమ్మకం, కమీషన్ బేసిక్ పై ఈ తంతు కొనసాగుతోంది. వాళ్ళు ఆదిత్య పేరు ఎక్కడా లేకుండా కొత్త కొత్త పేర్లతో క్యాపిటల్ హైట్స్, పార్చున్ హైట్స్ అంటూ చెప్పుకుని అమ్మేస్తున్నారు.

ఏదిఏమైనా దగాపడ్డ తెలంగాణ అమాయకులకు న్యాయం చేయాలని.. తాము కట్టిన డబ్భులు తిరిగి ఇప్పించాలని బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఆదిత్య యాజమాన్యాన్ని కలిసి అడుగుదామంటే వారి చుట్టూ బౌన్సర్లని పెట్టుకుని వారి దరిదాపులకు కూడా రానివ్వడంలేదని బాధితులు వాపోతున్నారు.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టి, తరతమ బేధాలు చూపకుండా న్యాయం చేయాలని కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు