- నాలాల ఆధునీకరణ పనులతో వరదలకు చెక్
- అధికారులతో వర్షాలపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి తలసాని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి లతో కలిసి ఉఊఓఅ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. మూడు షిఫ్టులలో వివిధ శాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వాతావరణ శాఖ అందించే సమాచారం మేరకు జిహెచ్‌ఎంసి పరిధిలోని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి కమిషనర్ రోనాల్డ్ రోస్, జియా ఉద్దిన్ లతో కలిసి విూడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దూరదృష్టితోనే నగరంలోని అనేక ప్రాంతాలలో వరద ముంపు సమస్య తొలగిపోయిందని పేర్కొన్నారు. నగరంలోని నాలాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమం క్రింద 36 నాలాల అభివృద్ధి పనులు చేపట్టగా, 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 6 పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. గత సంవత్సరం వరకు బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదనీటి వలన నాలా వెంట ఉన్న బ్రాహ్మణ వాడి, శ్యాం లాల్ బిల్డింగ్ తదితర కాలనీలు వరదనీటితో మునిగిపోయి ప్రజలు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు. ఆ కార్యక్రమం క్రింద బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టిన ఫలితంగా ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు ఏర్పడలేదని చెప్పారు. ప్రారంభంలో ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వచ్చాయని, కానీ వాటి ఫలితాలు నేడు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్ మెంట్స్ విభాగం దేశంలో ఎక్కడా లేదని, ఆ శాఖ ద్వారా కూడా ప్రజలకు వివిధ అత్యవసర సేవలు అందించాబడుతున్నాయని అన్నారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే పిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్షేత్రస్థాయి లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న అధికారులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. ప్రజలు అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ (040`21111111, 9000113667) కు కాల్ చేయాలని కోరారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లలో ఇన్ ప్లో, ఔట్ ప్లో పై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. మరో 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి కోరారు.
తప్పక చదవండి
-Advertisement-