Saturday, July 27, 2024

మిర్యాలగూడలో ఆసుపత్రులు, ల్యాబ్‌లపై దాడులు

తప్పక చదవండి
  • రెండు ఆసుపత్రులు సీజ్‌… మరో మూడు ఆసుపత్రులలో ల్యాబ్‌లు, ఐసియు సీజ్‌, షోకాస్‌ నోటీసులు…
  • ‘‘ఆ డాక్టర్ల’’పై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం..
  • డాక్టర్లు క్వాలిఫైడ్‌ వైద్య సిబ్బంది, రేట్లతో ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి…
  • ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు..
    మిర్యాలగూడ : అక్రమార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల వెలిసిన ప్రైవేటు ఆసుపత్రులపై గురువారం నల్లగొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కొండల్‌ రావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్‌ కాలనీలో గల సేఫ్‌, అనిత ఆసుపత్రులను, మరో మూడు ల్యాబ్‌ లను, సీజ్‌ చేశారు.ఇటీవల వైద్యం పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రజల నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించకుండా అనుమతులు తీసుకోకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారనీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందడంతో గురువారం ఆకస్మిక తనిఖీలను ప్రైవేటు ఆసుపత్రులలో చేపట్టారు. కనీస వసతులు లేకుండా, కొన్నిచోట్ల,అసలు డాక్టర్లే లేరని, డాక్టర్ల పేర్లు లేకుండా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులంటూ బోర్డులను ఏర్పాటు చేసుకొని వైద్యం నిర్వహిస్తున్న తీరు తనిఖీలలో వెలుగు చూసింది. ‘‘మా’’ ఆస్పత్రులలో 24 గంటలు వైద్య సదుపాయాలు ఉంటాయని, పెద్ద అక్షరాలతో బోర్డులపై చూపిస్తూ నామమాత్రం వైద్యంతో వేలాది రూపాయలు దండుకుంటున్నారని పలువురు ఆసుపత్రుల వద్ద ఆరోపించారు. సౌకర్యాలు ఏమీ లేకున్నప్పటికీ ఆసుపత్రిలో ఏకంగా ఐ సి యు ఏర్పాటు చేయడం గమనార్హం. ఐసీయూ ఏర్పాటు చేయాలంటే 24 గంటలు పని చేసే ఒక సర్జన్‌, అనస్తీసియా డాక్టర్‌, ప్రత్యేకత కలిగిన మరో డాక్టరు, క్వాలిఫైడ్‌ వైద్య సిబ్బంది ఉంటేనే ఐసీయూ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, కనీసం డాక్టర్‌ లేకుండా ప్రభుత్వ వైద్యుడుచే నవీన ఆసుపత్రిలో ఏకంగా ఐసీయూ ఏర్పాటు చేయటం, ఇరుకు గదిలో ల్యాబ్‌ ఏర్పాటు పై డిఎంఅండ్‌ హెచ్‌ఓ కొండల్‌ రావు తీవ్రంగా పరిగణించారు. వెంటనే ల్యాబ్‌, ఐసీయూ సీజ్‌ చేయించారు. రెండు వారాల వ్యవధిలో పూర్తి అనుమతులు, నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయకపోతే ఆస్పత్రిని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. నియమ నిబంధన విరుద్ధంగా నిర్వహిస్తున్న సాయి డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ను, షో కాజ్‌ నోటీసులను అందజేశారు.ఈ సందర్భంగా నల్గొండ డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండల్‌ రావు విలేకరులతో మాట్లాడుతూ అనుమతులు పొందిన తదుపరి ప్రైవేట్‌ ఆస్పత్రులు నడపాలని, ప్రభుత్వ నియమ నిబంధనలను ఆసుపత్రుల యజమాన్యం తూ.చ. తప్ప కుండా పాటించాలన్నారు. ఆసుపత్రులలో విధిగా డాక్టర్ల ల, విద్యా అర్హతలు, అనుభవం, క్వాలిఫైడ్‌ వైద్య సిబ్బంది పేర్లు వివరాలు వైద్య పరీక్షల రేట్ల పట్టిక తో కూడిన ప్లే బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా రోగి ఆసుపత్రికి వచ్చిన సమయంలో వివిధ పరీక్షల రేట్లను పరిశీలించి.. తక్కువ రేట్లు ఉన్న ఆసుపత్రిలో తమ వైద్య సేవలను పొందే అవకాశం ఉంటుందన్నారు. షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన ఆస్పత్రులలో 15 రోజులలో నియమ నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవ అందించకుంటే ఆయా ఆసుపత్రులను సీజ్‌ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు తాము విధులు నిర్వహించే ‘‘ఆస్పత్రి’’లో సమయం కంటే ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వచ్చి వైద్యం నిర్వహిస్తున్న తీరుపై డి.ఎం.హెచ్‌.ఓ కొండల్‌ రావు మాట్లాడుతూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ కేసా రవి, డిఈఎంఓ. రవిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు