Saturday, April 27, 2024

అమాయకులను కాటేస్తున్న నాగరాజు దేవు.. ( పార్ట్ – 2 )..

తప్పక చదవండి
  • హితమణి అనే కంపెనీ పేరుతో లోన్స్ ఇప్పిస్తామంటూ పలువురిని రోడ్డుపాలు చేసిన వైనం..
  • రెండు సంవత్సరాల నుంచి మరో కొత్త దుఖాణం తెరిచిన దుర్మార్గం..
  • ఫిన్ ఫైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నయా దందా..
  • ముంబైలోని మరో మోసగాడు రోనీ రోడ్రిసిస్ తో ములాఖత్..
  • ఏకంగా ఎఫ్.డీ.ఐ. ఫండింగ్ ఇప్పిస్తామని నమ్మిస్తూ అమాయకులకు వల..
  • సుమారు కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ముగ్గురు మోసగాళ్లు..
  • ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్న బాధితులు..

గొర్రె కసాయివాడిని నమ్ముతుందన్న సామెత అక్షరాలా వాస్తవం.. ఎవరైతే మాయ మాటలు చెబుతారో వారినే గుడ్డిగా ఫాలో అయిపోతారు.. ఇలాంటి వారినే మోసగాళ్లు టార్గెట్ చేసుకుంటారు.. వీరికి చట్టాలన్నా, కోర్టులన్నా, శిక్షలన్నా లెక్కేలేదు.. గొర్రెలు దొరికినంత కాలం కొస్తూనే ఉంటారు..

హైదరాబాద్ : దేవు నాగరాజు, దిలీష్మ దేవు గత పది సంవత్సరాలుగా ఫైనాన్స్ రంగంలో ఉంటూ.. హితమణి అనే కంపెనీ తోటి మార్కెట్ లోకి వెళ్లి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న లొసుగులు తెలుసుకుని, కొంతమంది ఏజెంట్లను నియమించుకుని వారికి అధిక కమిషన్లు ఆశజూపి, పర్సనల్ లోన్స్, హోం లోన్స్, మార్టిగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఇప్పిస్తామని చెబుతూ.. సిబిల్ తో ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయిస్తూ.. ఎంతోమంది కస్టమర్స్ దగ్గరనుంచి ప్రాసెసింగ్ ఫీజుల కింద కోట్ల రూపాయలు దండుకుని, అమాయకులకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేశారు.. ఇప్పుడు మళ్ళీ గత రెండు సంవత్సరాలనుంచి కొత్తగా ఫిన్ ఫైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త దుఖాణం తెరిచి, మార్కెట్ లో తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ముంబై లో రిజిస్టర్డ్ ఆఫీసు పెట్టి, హైదరాబాద్, బెంగుళూరు లో బ్రాంచి కార్యాలయాలు తెరచి, పెద్ద ఎత్తున తిరిగి లోన్లు ఇప్పాస్తామంటూ తమ దందాకు తెరలేపి, పెద్ద ఎత్తున కార్యాలయం ఏర్పాటు చేసుకుని.. ముంబై బేస్డ్ అయినటువంటి పీసీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్ అధినేత అయినటువంటి రోనీ రోడ్రిసిస్ తో చేతులు కలిపి, ఎఫ్.డీ.ఐ. ఫండింగ్ పేరుతో మోసానికి తెగబడ్డారు..

- Advertisement -

అసలెవరీ రోనీ రోడ్రిసిస్ ..?
ముంబై కేంద్రంగా పీసీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్ పేరుతో లోన్లు ఇప్పిస్తామని దుఖాణం తెరిచి, చాలా మంది అమాయకులను మోసం చేసినట్లు తెలుస్తోంది.. కాగా ఇతగాడి ప్రోద్బలంతో దేవు నాగరాజు, దేవు దిలీష్మలు ఫిన్ ఫైర్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, ఎఫ్.డీ.ఐ. ఫండింగ్ ఇప్పిస్తామని నమ్మిస్తూ కొంతమందిని తమ కంపెనీలో డైరెక్టర్స్ గా నియమించుకుని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, వైజాగ్, ముంబై పట్టణాలను టార్గెట్ చేసి, ఎవరికైతే తమ వ్యాపార అవసరాల నిమిత్తం పైకం అవసరం ఉంటుందో అలాంటి వారిని లోబరుచుకుని రూ. 5 నుంచి 1000 కోట్ల రూపాయలవరకు లోన్లు ఇప్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ.. ముంబై ఫిన్ ఫైర్ కార్యాలయంలో చాలా మందికి తాము లోన్లు ఇప్పించామని దొంగ డాక్యుమెంట్లు చూపిస్తూ.. వారిని నమ్మించి, బుట్టలోవేసుకుని ప్రాసెసింగ్ ఫీజ్ వసూలు చేస్తారు.. ఇక ఆ తరువాత నుంచి పీసీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్ చైర్మన్ రోనీ రోడ్రిసిస్ తన డ్రామా మొదలు పెడతాడు.. తానే ఎఫ్.డీ.ఐ. ఫండింగ్ చేస్తానని చెప్పుకుంటూ.. ఆయా ప్రాంతాల్లో ఉన్న లోన్స్ అవసరమున్న వారి కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు ఇన్స్పెక్షన్ పేరుతోటి గన్ మెన్లు, మోడల్స్ను వెంటబెట్టుకుని వెళ్లి నానా హంగామా సృష్టిస్తారు.. దానికి కావలసిన ఖర్చు మొత్తం వీరి దగ్గర నుంచే వసూసు చేస్తారు.. ఆ తర్వాత రోనీ రోడ్రిసిస్, దేవు నాగరాజులు ముంబై వెళ్ళిపోయి.. ఎఫ్.డీ.ఐ. ఫండింగ్ కి సంబంధించిన దొంగ శాంక్షన్ డాక్యుమెంట్లను సృష్టించి, ఎవరికైతే లోన్ అవసరం ఉన్నదో వారికి పంపించి ముందుగానే 5 శాతం ప్రాసెసింగ్ ఫీజుకింద ఇవ్వమని డిమాండ్ చేస్తారు.. వీరి మాటలు నమ్మి సుమారు కోటి రూపాయలనుంచి, 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు.. కొన్ని రోజులు గడిచాక అసలు స్వరూపం తెలుసుకుని, లోన్ ఇప్పించమని.. లేదా తాము చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజు తిరిగి చెల్లించామని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు తెగబడి.. మాకు బీజేపీ పార్టీలో ముఖ్యులకు సంబంధాలు ఉన్నాయని, అలాగే హైదరాబాద్ లో బీ.ఆర్.ఎస్. పార్టీ పెద్దలతో సంబంధాలున్నాయని చెబుతూ కాలయాపన చేస్తున్నారు.. వీరి ఉచ్చులో పడి, మోసపోయి, కోట్ల రూపాయలు చెల్లించుకుని రోడ్లమీదకు వచ్చి గగ్గోలు పెడుతున్న బాధితలు చాలామంది వున్నాడు.. కొసమెరుపు ఏమిటంటే, వీరు ఇలాంటి దోపిడీలు చేస్తూనే ఉన్నారు.. వీరిని కట్టడి చేసే వారు ఎవరు..? ఇలాంటి వారిని నమ్ముతూ అమాయకులు రోడ్లమీదకు రావలసిందేనా..? చివరికి ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా..? నిజంగా వారు చెప్పుకుంటున్నట్లు రాజకీయ పార్టీల ప్రముఖుల పాత్ర ఏదైనా ఉందా..? వారే వీరి వెనుక ఉండి కార్యక్రమం నడిపిస్తున్నారా..? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది..

అసలు ఈ దేవు నాగరాజు, దేవు దిలీష్మ ల చరిత్ర ఏమిటి..? ఇంత నిస్సిగ్గుగా సుళువుగా అమాయకులను ఎలా మోసం చేయగలుగుతున్నారు..? ఇంత చేస్తున్నా వీరిని కాపాడుతున్న పెద్దలు ఎవరు..? ఆ పెద్దలకు అందుతున్న వాటాలు ఏమిటి..? కాగా ముంబైలో చక్రం తిప్పుతున్న రోనీ రోడ్రిక్స్ చరిత్ర ఏమిటి..? ఏమాత్రం భయం, జంకు లేకుండా చట్టాలంటే గౌరవం లేకుండా ఇలాంటి దందాను ఎలా నడుపుతున్నాడు.. అసలు ఎఫ్.డీ.ఐ. ( ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ) అనేది ఎంతో క్లిష్టతరమైన ప్రక్రియ.. భారత ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థ అయిన ఆర్.బీ.ఐ. కి సంబంధం లేకుండా లోన్స్ శాంక్షన్ అవడమన్నది అసాధ్యం.. అలాండి వీరు భారత దేశంలో ఎఫ్.డీ.ఐ. కి తామే క్రియాశీలక ఏజెంట్లమని చెప్పుకుంటూ ఇంత భారీ ఎత్తున దోపిడీ పర్వానికి తెగబడటం గర్హనీయం.. వీరి చేతిలో మోసపోయిన వారి ని తక్షణమే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని బాధితులు కోరుతున్నారు.. మరిన్ని విస్తుపోయే వాస్తవాలతో మరో కథనంతో మీ ముందుకు రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’ .. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు