Sunday, October 13, 2024
spot_img

అవగాహనతోనే థైరాయిడ్‌ రుగ్మతలు దూరం

తప్పక చదవండి

25 మే ‘ప్రపంచ థైరాయిడ్‌ దినం’ సందర్భంగా

      25 మే 1965న ఏర్పడిన ‘యూరోపియన్‌ థైరాయిడ్‌ అసోసియేషన్’‌కు గుర్తుగా ప్రతి ఏటా 25 మే రోజున ‘ప్రపంచ థైరాయిడ్‌ దినం’ నిర్వహిస్తూ, థైరాయిడ్‌ రుగ్మతలకు గల కారణాలను, నివారణ మార్గాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించుట జరుగుతున్నది. 25 నుంచి 31 మే  వరకు ప్రతి ఏట ‘అంతర్జాతీయ థైరాయిడ్‌ అవగాహన వారం’ కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 25 మే 2008 నుండి ప్రారంభమైన ప్రపంచ థైరాయిడ్‌ దినం వేదికగా థైరాయిడ్‌ రుగ్మతలు, జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగాహన కోసం ప్రసార మాద్యమాలు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాద్యమ వేదికలు, సభలు, సమావేశాలు, చర్చలు, విద్యాలయాల్లో పోటీలు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

థైరాయిడ్‌ ప్రాధాన్యం:
సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న థైరాయిడ్ వినాళ‌ గ్రంథి మెడ కింది భాగంలో ఉంటుంది. ఎండోక్రైన్‌ వ్యవస్థలో భాగమైన థైరాయిడ్‌ గ్రంధిలో రెండు రెక్కల్లాంటి ఆకారాలను ‘లోబ్స్’ అని, వాటిని కలిపే కణజాలాన్ని ‘థైరాయిడ్‌ ఇస్తుమస్‌’ అని అంటారు. శరీరంలో జరిగే జీవక్రియలను నియంత్రించే టి4 (థైరాక్సిన్‌), టి3 (ట్రైఅయొడోథైరోనిన్‌), పెప్టైడ్‌ హార్మోన్ అనబడే‌ కాల్సిటోనిన్‌ హార్మోన్లను స్రవిస్తుంది. థైరాయిడ్‌ హార్మోన్లతో సక్రమ జీవ క్రియ రేటు, గుండె పనితనం, మహిళల్లో రుతు చక్ర నియంత్రణ, కండర/జీర్ణ క్రియ విధులు, మెదడు అభివృద్ధి, ఎముకల పటిష్టత, ప్రోటీన్‌ సంశ్లేషణం, పిల్లల శారీరక అభివృద్ధి లాంటి ముఖ్య విధులను నిర్వహిస్తాయి. మెదడు కింది భాగాన ఉన్న పిట్యుటరీ గ్లాండ్‌ స్రవించే ‘థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌, టియస్‌హెచ్‌ కారణంగా థైరాయిడ్‌ క్రియాశీలత ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

థైరాయిడ్‌ రుగ్మతలు:
థైరాయిడ్‌ హార్మోన్లు అవసరం కన్న అధికంగా లేదా తక్కువగా స్రవించడం వల్ల పలు రుగ్మతలు కలుగుతాయి. అయోడిన్‌ లోపంతో థైరాయిడ్‌ వాపు (థైరాయిడిటిస్‌), గాయిటర్‌ (థైరాయిడ్‌ ఎన్లార్జిమెఎట్‌), థైరాయిడ్‌ నోడ్లూల్స్, కాన్సరస్‌ ట్యూమర్‌, థైరాయిడ్‌ సర్జరీ, జెనెటిక్‌ ప్రీడిస్పొజిషన్‌, ఆటోఇమ్యున్‌ గ్రేవ్స్ డిసీజ్, కాంజెనిటల్‌ సమస్యలు, థైరాయిడ్‌ స్టార్మ్‌ లాంటివి థైరాయిడ్‌ రుగ్మతలకు కారణం అవుతాయి. థైరాయిడ్‌ గ్రంథి అతి చురుకుగా పని చేసినపుడు ‘హైపర్‌ థైరాయిడిజమ్‌’ రుగ్మత కలిగి చేమట పట్టడం, ఆందోళనలు, రుతుస్రావం తగ్గడం, ఆకలి పెరగడం లాంటి రోగ లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్‌ గ్రంథి చురుకుదనం అతిగా తగ్గితే ‘హైపోథైరాయిడిజమ్‌’ రుగ్మత కలిగి బరువు తగ్గడం, ఒత్తిడి పెరగడం, అతిగా రుతుస్రావం లాంటి వ్యాధి లక్షణాలు కలుగుతాయి.

ఇండియాలో థైరాయిడ్‌ రుగ్మతలు:
భారత దేశ జనాభాలో 42 మిలియన్ల ప్రజలు థైరాయిడ్‌ రుగ్మతలతో బాధ పడుతున్నారు. థైరాయిడ్‌ రుగ్మతల్లో హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌, గాయిటర్‌, థైరాయిడ్‌ కాన్సర్‌, థైరాయిడిటిస్‌ లాంటి రుగ్మతలు ముఖ్యమైనవి. థైరాయిడ్‌ రుగ్మత ఉందని తెలియని ప్రజలు కూడా అసంఖ్యాకంగా ఉండటం విచారకరం. ఉత్తర భారతంలో హైపో థైరాయిడిజమ్‌‌ రుగ్మత అధికంగా బయట పడుతున్నది. ప్రతి 8 ముందు మహిళల్లో ఒకరికి థైరాయిడ్ సమస్య టియస్‌హెచ్‌‌‌ ఉందని అంచనా. అయోడిన్ లోపం వల్ల గాయిటర్‌ వ్యాధి 200 మిలియన్‌ ప్రజల్లో ఉందని తేలింది. థైరాయిడ్ సంబంధ‌ వ్యాధి నిర్థారణకు టి3, టి4 మరియు టియస్‌హెచ్‌ హార్మోన్ల స్థాయిని నిర్థారిస్తారు. కాల్సిటోనిన్‌ స్థాయిని బట్టి థైరాయిడ్‌ కాన్సర్‌ను నిర్ణయిస్తారు. థైరాయిడ్‌ రుగ్మతలకు చికిత్సలుగా థైరాయిడ్‌ సర్జరీ, మెడికేషన్‌, రేడియోఆక్టివ్‌ అయోడిన్‌, రేడియోషన్‌, హార్మోన్‌ పిల్స్, రీకాంబినంట్‌ హూమన్‌ టియస్‌హెచ్‌ విధానాలను వాడతారు.

థైరాయిడ్‌ రుగ్మత నివారణ మార్గాలు:
థైరాయిడ్‌ సమస్యలకు విరుగుడుగా ప్రోటీన్‌, కాల్సియమ్‌, అయోడిన్‌, మెగ్నీసియం, సిలినియం, ఐరన్‌, విటమిన్ల ఆహారాన్ని తీసుకునేలా జీవనశైలిని మార్చుకోవాలి. అయోడిన్‌ లోపం ప్రధాన కారణంగా గుర్తించి థైరాయిడ్‌ సమస్యలకు పిల్లలు లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సముద్ర ఆహారం, పాల ఉత్పత్తులు, అయొడైజ్డ్ ఉప్పు లాంటివి థైరాయిడ్‌ గ్రంథికి ఆరోగ్యాన్ని సమకూర్చుతాయి. పోగ/ఆల్కహాల్‌ త్రాగడం మానుకోవడం, పోషకాహారం తోసుకోవడం, ఒత్తిడిని జయించడం, నిద్రకు తగిన సమయాన్నివ్వడం, ఉదయ భానుడి కిరణాలు సోకేలా చూసుకోవడం, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించడం, తరుచుగా పరీక్షలు చేయించుకోవడం లాంటి జాగ్రత్తలతో థైరాయిడ్‌ రుగ్మతలకు దూరంగా జీవించవచ్చు.
సులభంగా నివారించగల థైరాయిడ్‌ రుగ్మతల పట్ల లోతైన అవగాహన కలిగి, తరుచుగా పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్యకర థైరాయిడ్‌ వినాళ గ్రంథిని నిర్మించుకుందాం, ఆరోగ్యకర భారతాన్ని నిర్మించుకుందాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగరం – 9949700037

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు