Tuesday, May 7, 2024

కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిల మొగ్గు?

తప్పక చదవండి
  • అవకాశాలు లేకపోలేదంటున్న కెవిపి
  • ఎపిలో పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్‌ యత్నాలు

దక్షిణాది రాష్టాల్రపై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ .. ఏపీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నతో విబేధించి తెలంగాణాలో రాజకీయ భవిష్యత్‌ వెతుక్కుంటున్న షర్మిలకు కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో స్థాపించిన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రతిపాధించింది. అయితే ఈ ప్రచారాన్ని షర్మిల తొలుత ఖండించినా .. కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. తాజాగా షర్మిల పార్టీ విలీనంపై వైఎస్‌ఆర్‌ ఆత్మగా పేరొందిన కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్‌ వాదిగా వైఎస్‌ఆర్‌ బిడ్డ షర్మిల పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. మరోవైపు అన్న జగన్‌ తో విబేధాల కారణంగా షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించారు. అయితే కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. తాను తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతానని షర్మిల చెప్పినప్పటికీ.. తమకు ఏపీలో షర్మిల అవసరం ఉందని కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ షర్మిలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడంలేదు. పార్టీలో సరైన నాయకులు లేకపోవడంతో ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్లాలని సమాలోచనలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేసి నాయకత్వ బాధ్యతలు తీసుకోవచ్చని భావిస్తే షర్మిల ఏపీకి వెళ్లాలని కాంగ్రెస్‌ అష్టానం సూచిస్తోంది. 2009 వరకు ఏపీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. అయితే వైఎస్‌ మరణం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ కనుమరుగైంది. దీంతో తిరిగి ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలని అధిష్టానం భావిస్తోంది. అందుకోసం షర్మిలకు ఏపీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తోంది. కాగా సీఎం జగన్‌తో కలహాల కారణంగా ఏపీని వీడి తెలంగాణలోనే రాజకీయం చేస్తానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఏటూ తేల్చుకోలేక పోతున్నారు. ఇప్పటికే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరుపుతున్నారు. అంతా కుదిరితే షర్మిలను వైఎస్‌ఆర్‌ వారసురాలిగా పులివెందుల నుంచి పోటీకి పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాంగ్రెస్‌తో షర్మిల చర్చలు సఫలమైతే జులై 8 వైఎస్‌ఆర్‌ జయంతి రోజున షర్మిల పార్టీని విలీనం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు