ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్ బ్యాగ్‌లో నిద్రమాత్రలు, లేఖను గుర్తించారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఆమెను పెద్దమ్మగుడి వద్ద ఎవరో డ్రాప్ చేశారని స్థానికులు చెబుతున్నారు. శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఇటీవల దిల్లీలో జాతీయ మహిళా కమిషన్, హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ఆతర్వాత తెలంగాణ భవన్ వద్ద ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం శేజల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ‘‘లైంగికంగా వేధించిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి. దిల్లీలో అధికార పార్టీ ఎంపీని కలిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో చిన్నయ్య వేధింపులపై ఆధారాలు లేవని ఎంపీ అంటున్నారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎప్పుడు చంపుతారోననే భయంతో బతుకుతున్నా. పెద్దమ్మగుడి వద్ద ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నా’’ అని శేజల్ లేఖలో పేర్కొన్నారు.