Thursday, September 12, 2024
spot_img

వసతిగృహ విద్యార్థుల ఆవేధన పట్టే దెవరికి?

తప్పక చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వున్న సంక్షేమ హాస్టల్‌ లలో విద్య ను అభ్యసిస్తూ వున్న విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే కథనాలు వినవస్తున్నాయి.విద్యా సంవత్సరం ప్రారంభ మయి నెల అవుతూ ఉంది. గడిచిన ఏడు కొన్ని మరణాల వల్ల విద్యార్థులు బయ కంపితులు అవుతూ వున్నారు. పౌష్టికాహార లోపం.. రక్తహీనత, సమస్యలుక్షేత్రస్థాయిలో కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆశ్రమ పాఠశాలల పరిస్తితి. వాటిల్లో మొత్తం లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే వసతి గృహాలతో విద్యార్థు లు సతమతమవుతున్నారు. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ, కస్తూర్భా పాఠశాలల వసతి గృహాల పరిస్థితి మరీ అధ్వానం గా మారింది. అపరిశుభ్రమైన పరిసరాలతో సీజన్‌లో అంటు వ్యాధులు, విష జ్వరాలు చుట్టుముట్టి తరచుగా అనారోగ్య బారిన పడుతున్నారు. ఈ యేడు కూడా వనపర్తి జిల్లా లో వారం క్రితం కలుషిత ఆహారం తినడంతో ఎంతో మంది కస్తూర్బా పాఠశాల ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.దీనినిబట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. వసతి గృహాలకు వెళ్లాలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలను వసతిగృహాలకు పంపేందుకు వెనుకాడుతున్నారు. ఏ చిన్న జ్వరం, జలుబుతో అస్వస్థతకు గురైన ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బం ది విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.అన్ని జిల్లాలలో వందలాది ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. ఇందులో లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు స్థానికంగా ఉండక పోవడంతో కొన్నిచోట్ల విద్యార్థులే హాస్టల్‌లను నిర్వహించుకుంటూ చదువులు కొనసాగిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే వసతిగృహాలు కొనసాగుతున్నాయి. అలాగే సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపుగా అన్ని వసతి గృహాలలో పడక మంచాలు లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే కునుకు తీయాల్సి వస్తుంది. పలు వసతి గృహాలకు ప్రహరీలు, కంచె లేకపోవడంతో పందులు, కుక్కలు పరిసరాల్లో స్వైర విహారం చేస్తూ కనిపిస్తున్నాయి.ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా.. విద్యార్థులకు మందుగోలిని ఇచ్చే నాథు డే కరువవుతున్నాడు. ఇప్పటికీ వసతి గృహాలలో వైద్య సిబ్బందిని నియమించనే లేదనీ తెలుస్తోంది. దీంతో వసతిగృహాల వార్డెన్‌లే తెలిసీ తెలియని వైద్యాన్ని చేస్తున్నారు. వార్డెన్‌ ఇచ్చిందే మందు గోలిగా మారింది. సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి విషమించడంతో విద్యార్థులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆసుపత్రికి తరలించినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం పట్ల వసతిగృహాల్లో నిండు నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఏఒక్క వసతి గృహాంలో అర్హులైన వైద్య సిబ్బందిని నియమించిన దాఖలాలు కనిపించడం లేదు. నెలనెలా వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రాణాంతక వ్యాధుల భారిన పడి విద్యార్థులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏఒక్క వసతిగృహంలో జనరేటర్‌, ఇన్వెటర్‌ బ్యాటరీ సౌకర్యం లేకపోవడంతో రాత్రిళ్లు కరెంట్‌ కోతలతో విద్యుత్‌ సమస్యలు తలెత్తి దోమల బెడదతో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులు దోమకాటుతో అనారోగ్యం భారిన పడుతున్నారు. టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, అంటు వ్యాధులు చుట్టు ము డుతున్నాయి. ముఖ్యంగా బాలికల వసతి గృహాలలో చెప్పుకోలేని ఇబ్బందులతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఏదైనా ఆపదొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ప్రాణాలు పోతున్నా.. అధికారులకు పట్టింపే లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారుల తీరు మారిందంటున్నారు. గత ఏడాది ఆరుగురు పిల్లలు మృతి పట్ల అధి కారుల నిర్లక్ష్యం ఉందని తల్లిదండ్రులు ఆరోపించారు. సకాలంలో వైద్యాన్ని అందించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు..పెట్టిందే తినాలంటూ బెదిరింపులకు గురి చేస్తూ వసతి గృహాల్లో అధికారుల ఇష్టారాజ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించి న మెనూ ప్రకారం కాకుండా పెట్టిందే తినాలంటూ విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉడికీ ఉడకని అన్నం, పప్పునీళ్ల చారును తి నేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. ఒకవేళ ఆకలిని తట్టుకోలేక ఎంతో కొంత తిన్నా.. తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. కొంతమంది విద్యార్థుల్లో నిద్రలేమి సమస్యతో చదువులపై దృష్టి సారించడం లేదు. గోడలపై మెనూ కనిపిస్తున్నా.. అది ఎక్కడా అమలు కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించక పోవడంతోనే వి ద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. అసలే గిరిజన విద్యార్థులను రక్తహీనత సమస్య వెంటాడుతోంది. దీనికి తోడు నాణ్యమైన భోజనాన్ని అందించకపోవడంతో భయంకర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కొందరు వసతిగృహాల అధికారులు నిత్యావసర సరుకుల సరఫరా కాంట్రాక్టర్ల తో కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేల విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై నిరంతరంగా నిఘా సారించకపోవడంతోనే విద్యార్థులకు సరైన వసతులు అందడం లేదని తెలుస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యావకాశాలు అందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పోయిన సంవత్సరం వరంగల్‌ జిల్లా వర్ధన్న పేట గిరిజన వసతి గృహం లో బల్లి పడిన ఆహారం తిని 36 మంది విద్యార్థులు ఆనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందారు. గత సంవత్సరం కామా రెడ్డి జిల్లా బీర్కూర్‌ లోని బి.సి హాస్టల్‌ లో అయిదవ తరగతి విద్యార్థి సాయి రాజ్‌ పాము కాటు తో మరణించడం అందరినీ కలచి వేసింది.సమీప అడవుల నుండి తలుపు సందు గుండా కట్ల పాము లోపలికి వచ్చి కాటు వేసిందని తెలుస్తూ ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను ఆయా జిల్లాల పాలనాధికారులు తనికీలు చేసి సమస్యలు పరిష్కరించాలని, ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వసతి గృహం లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని మనవి.
` కామిడి సతీష్‌ రెడ్డి 9848445134

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు