వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌కు చెందిన 20 ఏళ్ల యువతి నర్సింగ్ స్కూల్‌లో చదువుతున్నది. ముస్లిం క్లాస్‌మేట్ అయిన స్నేహితురాలి సోదరుడు యూసుఫ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మే 11న ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తల్లిదండ్రులు బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సహాయం కోరారు. దీంతో పోలీసులు చివరకు ఆ యువతిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ గత నెలలో ఆ యువతితో సహా మరి కొందరికి వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను చూపించారు. ఆ యువతులతో కలిసి ఆమె కూడా ఆ సినిమాను చూశారు. అయితే మే 15న ఆ యువతి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను యూసఫ్ ఖాన్ ట్రాప్ చేసి తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అతడికి నేర చరిత్ర ఉందని ఆరోపించారు.
మరోవైపు మే 30న తమ కుమార్తెకు మరో యువకుడితో పెళ్లి జరుగాల్సి ఉందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. పెళ్లి కోసం ఉంచిన రూ.70,000 నగదు, బంగారు నగలు కూడా ఆమె తన వెంట తీసుకెళ్లినట్లు ఆరోపించారు. తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని విమర్శించారు. కాగా, ఆ యువతి ఒక వీడియోను విడుదల చేసింది. తాను మేజర్ అని, తెలిసిన వ్యక్తిని ప్రేమించినట్లు అందులో పేర్కొంది.
అయితే తన కుమారుడ్ని ఇంటి నుంచి వెళ్లగొట్టానని, అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని యూసఫ్ ఖాన్ తండ్రి చెప్పాడు. విడిపోదామని తన సోదరుడు చెప్పినప్పటికీ స్నేహితురాలు బలవంతం చేసి పారిపోయేందుకు ప్రేరేపించిదని యూసఫ్ సోదరి ఆరోపించింది.