Saturday, July 27, 2024

దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం..

తప్పక చదవండి
  • విద్యార్థులతో కలిసి నాస్టా చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్..
  • శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన పథకం..
  • అల్పాహార పథకం ప్రారంభించిన తొలి రాష్ట్రం తమిళనాడు..
  • చిన్నారులకు ఆకలి బాధ లేకుండా చేయాలన్నదే ఉద్దేశ్యం..
  • ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం : స్టాలిన్..

చెన్నై : తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఈ పథకాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే అక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఆ మధ్యాహ్న భోజనం పథకంతో పాటుగా ఉదయం పూట అల్పాహారం కూడా అందించే విధంగా సీఎం స్టాలిన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఉదయం అల్పాహారం అందించే పథకాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు పాఠశాలల్లో తొలిసారిగా అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ పథకాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు.

చిన్నారులకు అందించే అల్పాహారాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆ తర్వాత పిల్లలకు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ను వడ్డించారు. అనంతరం ఆ పాఠశాలలోని చిన్నారులతో కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్ అల్పాహారం తిన్నారు. మరోవైపు చైన్నైలోని స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే ఈ పథకాన్ని స్టాలిన్ సర్కారు ప్రకటించింది. అలాగే ప్రయోగాత్మకంగా ఇప్పటికే 1545 పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్నారులు ఆకలి బాధలు లేకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతో పాటు.. వారిలో తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి రక్తహీనతను బాగా తగ్గించడం, పోషకాహార స్థితిని మెరుగుపర్చడం అలాగే పాఠశాలల్లో విద్యార్థుల హజరుశాతాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో డీఎంకే సర్కార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

- Advertisement -

ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ అల్పాహార పథకం విజయవంతమైంది. దీంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 31,008 ప్రభుత్వ పాఠశాలలకు ఈ పథకాన్ని విస్తరించారు. అయితే ఈ పాఠశాలలో మొత్తం 15,75,900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు వీరందరికీ ఈ అల్పాహార పథకం అందుబాటులోకి వచ్చేసింది. ఇదిలా ఉండగా వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులే ఉంటారు. వీళ్ల కుటుంబంలో ఉదయం పూట వండుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అల్పాహార పథకం ప్రారంభించడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు మేలు జరగనుంది. ఇకనుంచి విద్యార్థులు ఉదయం పూట పాఠశాలకు వచ్చినప్పుడు అక్కడే అల్పాహారం తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంపై చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే తమ పిల్లలకు పాఠశాలల్లోనే అల్పాహారం అందించడంపై విద్యార్థుల తల్లిందండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పథకం ద్వారా తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని డీఎంకే ప్రభుత్వం భావిస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు