Wednesday, May 22, 2024

కాషాయ పార్టీ నినాదాలకే పరిమితం.. నిజాలు చెప్పదు

తప్పక చదవండి
  • కొందరు జై జవాన్… జై కిసాన్ అని ఒర్రుతారు
  • ఒర్రుడే తప్పా వాళ్లు కిసాన్ కు, జవాన్ కు చేసిందేమీ లేదు
  • నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ : “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయాలి. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారంపై ఆలోచన చేయాలి.” అని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. బుధవారం రోజున నిజామాబాద్ లో జరిగిన బీ ఆర్ ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.

కొన్ని రాజకీయ పార్టీలో నినాదాలు చెప్పాయే తప్పా ప్రజలకు నిజాలు చెప్పవని విమర్శించారు. కాషాయ కండువా కప్పుకున్న వాళ్లు జై జవాన్… జై కిసాన్ అని ఒర్రుతారని, డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లు ఒర్రుడే తప్పా వాళ్లు కిసాన్ కు, జవాన్ కు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అదే సీఎం కేసీఆర్ అమరులైన జవాన్లకు కుటుంబాలను ఆదుకున్నారని స్పష్టం చేశారు. నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ యేనని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని 65 లక్షల రైతులకు రూ. 65 వేల కోట్లును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. రైతులు బాగుంటేనే మనం బాగుంటామని, కాబట్టి సీఎం కేసీఆర్ మనకిచ్చిన బాధ్యతను సీరియస్ గా తీసుకొని నిర్వర్తించాలని సూచించారు.

- Advertisement -

కేవలం నినాదాలకే పరిమితమైన పార్టీలను వదిలిపెట్టి అందరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అంటే ఒక మహాసముద్రమని, నదులు, ఉప నదులు, పిల్లకాలువలు చివరికి వచ్చి సముద్రంలోనే కలవాలని, అంటే అన్ని పార్టీల వాళ్లు వచ్చి గులాబీ కండువా కప్పుకోవాలి తప్పా నిజామాబాద్ లో వేరే పరిస్థితిలేదని అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో పేదల గురించి ఆలోచించే ప్రభుత్వాలు లేవని, కేవలం ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పేద ప్రజల గురించి ఆలోచన చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని ఉట్టి ప్రవేశపెట్టరని, చాలా ఆలోచన చేసే ప్రవేశపెడుతారన్నారు. గర్భిణీ ఆడబిడ్డల కోసం కేసీఆర్ కిట్ పథకం తీసుకొచ్చారని, ఇప్పుడు 66 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని వివరించారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఏ పథకమైన అందకపోతే అధికారులను కలిసి పరిష్కరించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల కోసం ఎంత ఎక్కువ పని చేస్తే గులాబీ కండువాకు అంత ఎక్కువ గౌరవం పెరుగుతుందని స్పష్టం చేశారు. గులాబీ కండువా చూడగానే ప్రజల కళ్లు ఆనందంతో మెరవాలన్నారు. “మన నాయకుడు కేసీఆర్ బాటలో నడుద్దాం. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ ప్రజల కోసం ఏ కొత్త కార్యక్రమాన్ని తీసుకురావాలనే కేసీఆర్ ఆలోచిస్తారు. తెలంగాణ కోసం ఏ కొత్త సౌకర్యాన్ని తీసుకురావాలనే ఆలోచిస్తారు.” అని వ్యాఖ్యానించారు.

స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా అద్భుతంగా పనిచేస్తున్నారని కవిత ప్రశంసించారు. ఆయన చేస్తున్న మంచి పనులను చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరడానికి ముందుకొస్తున్నారని అన్నారు. మల్లేష్ అనే ఒక నాయకుడు పార్టీలో చేరితే బీజేపీ వాళ్లు జలఖ్ తిన్నారని తెలిపారు. “మల్లేష్ బీఆర్ఎస్ లో చేరితే వాట్సప్ ల్లో దుష్ర్పచారం చేశారు. ఇంత ఇచ్చారు… అంత ఇచ్చారు అని తప్పుడు ప్రచారం చేశారు. నాయకులంటే సంతలో గొర్రెల్లా కనిపిస్తున్నారా ? ఆ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో లేదు. ఈ విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి” అని సూచించారు.

ఇతర పార్టీల వాళ్లు సామాజిక మాధ్యమాల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాలు ఒక అబద్ధం చెబితే మనం 100 నిజాలు చెప్పి గట్టిగా కౌంటర్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డివిజన్ ల వారీగా సోషల్ మీడియా సెల్ ను ఏర్పాటు చేయాలని మార్గనిర్ధేశం చేశారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయాలని అన్నారు. అబద్దాలు చెప్పే వీ6 న్యూస్ ను చూడవద్దన్నారు. వెలుగు పత్రికలో పేరుకే వెలుగు అని పత్రిక మొత్తం చీకటే ఉంటుంది అని విమర్శించారు. ప్రజలకు, మనకు వ్యతిరేకంగా రాస్తున్నారు కాబట్టి వాటిని బహిష్కరించాల్సిందేనని, అధికారికంగానే పార్టీ బహిష్కరించింది కాబట్టి అదే పంథాను కింది స్థాయి వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అబద్దాలు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు