Wednesday, June 19, 2024

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సాధించిందేమిటి ?

తప్పక చదవండి

( తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యెత్తున నిర్వహిస్తున్న సందర్భంగా…..)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీరు, నియామకాలు, నిధుల కోసం జరిగింది.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస లకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు చిన్న చూపు చూడటం జరిగింది.ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను పట్టించుకోకుండా సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, వంటావార్పు, రైలు రోకో, బతుకమ్మ లాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమ కాంక్షను వ్యక్తం చేశారు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలలో సాధించినదేమిటి ?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరం లో అడుగిడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకలను 20 రోజుల పాటు పండుగ వాతావరణం లో నిర్వహించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కమిటీలను ఏర్పాటు చేశారు.
సాధించిన విజయాలు:-
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాష, యాస కు చిన్న చూపు చూడటం జరిగింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస లకు పట్టాభిషేకం కట్టడం జరిగింది.సినిమాలలో విలన్ లకు, పని మనుషులకు మాత్రమే వాడిన భాష,యాస ఇప్పుడు హీరో, హీరోయిన్ లకు ఉపయోగిస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు చిన్న చూపు చూడటం జరిగింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలోని పాఠ్య పుస్తకాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు స్థానం కల్పించారు.తెలంగాణ కవుల, రచయితల రచనలకు పుస్తకాలలో అవకాశం కల్పించబడటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి పండుగకు ప్రభుత్వం సెలవు దినం గా ప్రకటించింది.తెలంగాణ ఏర్పడితే కరెంట్ కోతలు, నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతారని ఏవేవో భయ పెట్టడం జరిగింది.వారి అంచనాలను తారు మారు చేస్తూ 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ,మిషీన్ కాకతీయ తో నీటి సమస్యలు పరిష్కరించుకోవడమే కాకుండా తెలంగాణ లోని 33 జిల్లాలలో అన్ని గ్రామాల్లో చెరువులు, బావులు నీళ్ళతో నిండి పంట పొలాలు పచ్చగా నిగనిగలాడుతూ కన్పిస్తున్నాయి.తెలంగాణ కోసం పాటలను పాడి తెలంగాణ పై ప్రజలకు జాగృతం చేసిన కళాకారులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు, ప్రముఖ కవి, గాయకులు రసమయి బాలకృష్ణ సారధిగా 526 మంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారధిని ఏర్పాటు చేసి ఉద్యోగాలను కల్పించారు.పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కే.జి నుండి పి.జి.ఉచిత విద్యలో భాగంగా గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ బడులు శిథిలావస్థకు చేరుకున్న వాటికి నూతన భవనాలు నిర్మించారు.ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించడం వలన ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసి కన్పిస్తున్నాయి.ప్రభుత్వ పాఠశాలలలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్య,నోటు పుస్తకాలు, ఉచితంగా యూనిఫాంల పంపిణీ, ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షితులవుతున్నారు.వితంతు పెన్షన్, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ సౌకర్యం గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ కిట్టు, రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలకు, బ్రాహ్మణులకు, రెడ్డిలకు, వైశ్యులకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి భూములను, ఆర్థిక సహాయం అందిస్తున్నారు.ఈ విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నారు.ప్రయివేట్ సెక్టార్ లలో ఐ.టి., కంప్యూటర్ రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది.కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పర్మినెంట్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు సీనియారిటీ ప్రకారం పూర్తి కాలం వేతనం ( పర్మినెంట్ ) చేశారు.

- Advertisement -

దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న పరిష్కారం కాని సమస్యలు:-
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎన్నెన్నో కలలు కన్న వారికి నిరాశ, నిస్పృహలు మిగిలాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ముఖ్య నినాదం నియామకాలు. నిరుద్యోగ యువత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే ఎంతో ఆనంద పడ్డారు.నిరుద్యోగులందరికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కోటి ఆశలతో ఎదురు చూశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు చేయడానికి గ్రూప్ 1, గ్రూప్ 11, గ్రూప్ 111, గ్రూప్ 4 జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, గురుకుల పాఠశాలల టీచర్లు, లెక్చరర్స్, అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసు కానిస్టేబుల్, ఎస్.ఐ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.కొన్ని నియమాల కోసం పరీక్షలను నిర్వహించింది.గ్రూప్1, అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ ఇంకా కొన్ని పరీక్షల పేపర్లు లీకు కావడం తో పరీక్షలన్ని రద్దు చేసింది.తెలంగాణ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన, జరుగబోయే పరీక్షలు అన్ని రద్దు చేయడంతో సంవత్సరాల తరబడి వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ లలో కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలు గురైయ్యారు.డాక్టర్లు, నర్సులు, పోలీసు కానిస్టేబుల్, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా దానికి వేరే బోర్డులు ఉండడం వల్ల కొన్ని ఉద్యోగాలు భర్తీ కాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి చివరి దశలో ఉన్నాయి.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పరీక్షలలో అవకతవకలు జరగకుండా ప్రతిభ కలిగిన వారిని ఉద్యోగాలలో భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

పరిష్కారం కాని ఉపాధ్యాయ సమస్యలు:- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఎంతో ముందు ఉండి పోరాడిన ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.ఉపాధ్యాయుల పదోన్నతులు లేక ఎనిమిది సంవత్సరాలు, బదిలీలు లేక ఐదు సంవత్సరాలు గడిచినా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కోసం నోటిఫికేషన్ జారీ చేసిన అందులో అనేక మందికి అన్యాయం జరుగుతుందని అనేక మంది ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కు వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు.ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు లో ఉన్న స్టే ను వెకెట్ చేపించి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేయాలని వేలమంది ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవనా? అన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించడం సులభమేనని అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడం ఉద్యోగ, ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ లో భాగంగా 317 జీ.వో తీసుకొని వచ్చి జూనియర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మారుమూల ప్రాంతాలకు కేటాయించడం వలన తమ స్థానికతను కోల్పోతున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్పౌష్ కేసులకు, యూనియన్ నాయకులకు కేటాయించిన స్పెషల్ పాయింట్లు తీసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కు కొంత మంది ఉపాధ్యాయులు ఆశ్రయించడం జరిగింది.ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు జటిల సమస్యగా మార్చడం వఊ12,13 సంవత్సరాల నుండి ఒకే దగ్గర పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు జరిగితే నూతన నియామకాలు జరుగుతాయని కొన్ని వేల మంది బి.ఇడి.,డి.ఇడి,పండిత శిక్షణ పూర్తి చేసిన వేలమంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా పదోన్నతులు లేని భాషోపాధ్యాయులు:-
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ పాఠశాలలలో బోధిస్తున్న భాష పండితులకు 26,27 సంవత్సరాల నుండి పదోన్నతులు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో, పోరాటం లో భాష పండితులు తమ కవితల ద్వారా,పాటల ద్వారా, వివిధ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రత్యేక తెలంగాణ అవసరం ను, ఆవశ్యకత గట్టిగా చాటి చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న భాష పండితుల సమస్య పరిష్కారం కాలేదు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో భాష పండితుల ఉన్నతీకరణ సమస్య పరిష్కారం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయతీ పాఠశాలలలో ఉన్నత పాఠశాలలలో బోధిస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటున్న భాష పండితులు శ్రమ దోపిడి కి, వెట్టి చాకిరి కి గురౌతున్నారు.ఉన్నత పాఠశాల లలో కేవలం స్కూల్ అసిస్టెంట్ లు ఉండాలని ఉన్నా తెలుగు, హిందీ తప్ప మిగతా సబ్జెక్టు లు బోధించడానికి స్కూల్ అసిస్టెంట్ లు ఉన్నారు.2017 డిసెంబర్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోని భాష పండితులకు ఉన్నతీకరణ లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను తొలగించి త్వరలో పదోన్నతులు చేస్తామని మనదేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సాక్షిగా ప్రపంచ తెలుగు ప్రతినిధుల ముందు హామీ ఇచ్చారని కానీ ఐదు సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోలేదని భాష పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు, హిందీ, ఉర్దూ మిగతా దేశీయ భాషలను బోధించే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీ.వో 2.3., 11.12., 17.18 ఈ విధంగా మూడు, నాలుగు సార్లు జీ.వోలను తెచ్చిన ప్రాథమిక పాఠశాలలలో బోధిస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులు పదోన్నతుల్లో తమకు వాటా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కు వెళ్ళి స్టే తీసుకొని వచ్చారని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రుల కోరిక మేరకు 10 వేల పోస్టులను ఎల్.ఎఫ్.ఎల్ పోస్టులను మంజూరు చేసింది.ఇప్పుడు ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులతో ఎలాంటి ఇబ్బందులు లేవు.తెలంగాణ విద్యాశాఖాధికారులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు లో కౌంటర్ దాఖలు చేసి స్టే ను వెకెట్ చేపించి భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వేలమంది భాష పండితులు కోరుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు భాష పండితులకు ఉన్నతీకరణ చేయడం న్యాయ మైన సమస్యగా ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలపడం జరిగింది.భాష పండితులుగా ఉద్యోగంలో చేరి భాష పండితులుగా పదవీ విరమణ చేయాల్సి వస్తుందని మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలో ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు తాము ఉద్యోగం లో చేరినప్పటి నుండి ఉద్యోగ విరమణ వరకు 3,4 పదోన్నతులు ఇవ్వాలని మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయతీ రాజ్ పాఠశాలల్లో బోధిస్తున్న భాష పండితులకు ఒక్క పదోన్నతి దక్కకపోవడం విచిత్రమైన విషయంగా అభివర్ణిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని శాసన మండలి సభ్యులు శ్రీమతి కవిత గారు,పల్లా రాజేశ్వరరెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇంకా అనేక మంది రాష్ట్ర మంత్రులు, శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు హామీ ఇచ్చిన భాష పండితులకు ఉన్నతీకరణ జరుగక పోవడం శోచనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు., తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తెలంగాణ విద్యా శాఖాధికారులు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి ఫ్రెండ్లీ ప్రభుత్వం గా
నామధేయాన్నా సార్థకత చేసుకోవాలని అనేక వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,
రాష్ట్ర కార్యదర్శి., తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, తెలంగాణ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు