Wednesday, May 1, 2024

డైనమిక్ అధికారులకు పోస్టింగులు దక్కేనా..?

తప్పక చదవండి
  • పోలీసు పోస్టింగుల్లో ఎమ్మెల్యేల జోక్యం ఏంటీ.. ?
  • అడిగినంత ముడుపులు ముట్టజెప్పితేనే అనుకున్నచోట పోస్టింగ్
  • సీఐ పోస్టుకు రూ. 20 లక్షలు, ఏసీపీ పోస్టుకు రూ. 30 లక్షల పైమాటే
  • అంగూటి నాయకుల కనుసన్నల్లోనే పోలీసు బెర్తుల ఖరార్
  • నిజాయితీపరులకి దక్కని పోస్టింగ్ లు..
  • నేతల చేష్టలతో బ్రష్టుపట్టిన పోలీసు వ్యవస్థ
  • రాజకీయ పైరవీ లేకుండా ఐపీఎస్, ఐజీలు, అడిషనల్ డీజీలకు దక్కని ఛాన్స్
  • నేతల ఆశీస్సులు లేక డైనమిక్ పోలీసు అధికారులంతా లూప్ లైన్లలోనే

(కొత్త శ్రీనివాస రావు, స్పెషల్ ఆపరేషన్స్ టీం ఇంచార్జ్)

టోపిపై ఉన్న మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీసు అంటూ పోలీసు స్టోరీ సినిమాలో సాయి కుమార్ గర్వంగా చెప్పినా డైలాగ్, నేడు బ్రష్టుపట్టిన రాజకీయ నేతల చేష్టలతో మసకబారుతోంది. ఓ అనామకుడు రాజకీయ నాయకుడు కావోచ్చేమో కానీ, అదే రాజకీయ నాయకుడు పోలీసు మాత్రం ఎప్పటికీ కాలేడు. పోలీసు నౌకరీ ఊపిరీగా, గుండెనిండా ధైర్యంతో మహోన్నతమైన శక్తితో, వ్యవస్థే వ్యక్తిగా జీవిస్తూ, కఠోర దీక్షతో రేయింబవళ్లు కష్టపడి నీతి, నిజాయితీగా కొలువులు పొందిన ఎస్సై నుంచి ఐపీఎస్ ల వరకు, నేడు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. నచ్చిన చోట పోస్టింగ్ పొందేందుకు నేతల మెప్పు పొంది, వారు అడిగినంత డబ్బలు ఇస్తేనే వారు కోరుకున్న చోట పోస్టింగులు వస్తున్నాయి. ఇక రాజకీయ నాయకుల అండదండలు లేని వారికి పోస్టింగులు రాక, అనేకమంది అధికారులు మనోవేదనకు గురవుతున్నారు.

- Advertisement -

హైదరాబాద్ : 76 ఏళ్ల స్వాంతత్ర్య భారతావనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.. కానీ పోలీసు వ్యవస్థపై ఎటువంటి జోక్యం చేసుకోలేదు. వారికి పూర్తి స్వేచ్చను అందించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది ఏళ్ల కాలంలో అనామకులను అందలం ఎక్కించి నిజాయితీ పరులను పక్కన పెట్టి వారితో చేయరాని పనులు చేయిస్తుండటంతో ప్రభుత్వం అపవాదు మూటగట్టుకొందని బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రభుత్వాలు ఈ విష సంస్కృతికి ఒడికట్టలేదని, పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని అధికారులను బసవన్నలాగా ఆడిస్తున్నాయంటూ పదవీ విరమణ పొంది పేరు బయటకు చెప్పని ఓ ఐపిఎస్ అధికారి పేర్కొనటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను పెట్టారో ఏమోగానీ, సీఐ మొదలు కొని డీసీపీల వరకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తరం ఉంటేనే పోస్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏరియాను బట్టి పోస్టింగ్ కు రూ. 20 లక్షల నుంచి రూ 30 లక్షల వరకు ముందుగానే సమర్పిస్తేనే పోస్టు రిజర్వ్ చేయబడుతోంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. ఓ ఎమ్మెల్యే మూడు నుంచి ఐదు వరకు సిపారసు లెటర్స్ ఇస్తే, అందులో ఎవరైతే ఎక్కువ ముడుపులు ముట్టచెప్తారో వారికి అనుకున్న పోస్టింగ్ వరిస్తోంది.. అసలు ఎమ్మెల్యే ఉత్తరం లేకపోతే పోస్టింగ్ దక్కటమే కష్టంగా మారింది. మహానగరంలో ట్రై కమిషనరేట్లలో నేతలు కలగజేసుకొనేవారు కాదు. ముఖ్యంగా గతంలో ఇన్ స్పెక్టర్ నియమాకాల్లో ఆయా పోలీసు కమిషనరేట్ల కమిషనర్ల స్థాయిలో నిర్ణయం తీసుకునే అధికారం ఉండేది. ఏసీపీలు, డీసీపీలు కమిషనర్ల నియామకం శాంతిభద్రతల ప్రాధాన్యం మేరకే పోస్టింగులు ఇచ్చేవారు. భారీ మొత్తంలో సొమ్ము ముట్టచెప్పి పోస్టింగులు పొందిన అధికారులు, పోస్టింగ్ ల్లోకి వచ్చి రాగానే పెట్టిన సొమ్ముకు రెట్టింపు రాబట్టడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బహిరంగంగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి 41 ఏళ్ల కొలువులో కొనసాగాల్సిన అధికారి, ఐదేళ్ల పదవిలో ఎలగబెట్టే రాజకీయ నాయకుడికి గులాంగిరి చేయద్దని ప్రజలు కోరకుకుంటున్నారు.. వారి మనోభావాలను తాకట్టు పెట్టరాదంటూ మేధావులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటన్నంటిపై ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

లూప్ లైన్లలో డైనమిక్ పోలీసు అధికారులు :
సీఐ నుంచి అదనపు డీజీపీ స్థాయి వరకు డైనమిక్ పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. కానీ వారికి ఏ రాజకీయ నాయకుడి ఆశీస్సులు లేకపోవడంతో, ప్రజల కోసం పనిచేద్దామనుకునే అవకాశం వారికి దక్కడం లేదు. ఫలితంగా వారికి లూప్ లైన్లు, పోలీసుశాఖతో సంబంధం లేని పోస్టింగులు దక్కుతున్నాయి. దీంతో ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసు వ్యవస్థపై నమ్మకం కలగడం లేదు. ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ లుగా సెలక్ట్ అయ్యి, ప్రజలకు సేవ చేద్దామనుకునే అధికారులకు రాజకీయ నేతలు అందించే సిపారసు లెటర్లు గండంగా మారుతున్నాయి. వారికి ఏ రాజకీయ నాయకుడి ఆశీస్సులు లేకపోవడంతో, వారంతా ఎంతో వెనకబడిపోతున్నారు. ఫలితంగా సమాజానికి అందాల్సిన పోలీసు ఫలాలు అందడం లేదు. ఇలా అనేకమంది సీఐలు, ఏసీపీలు, ఎస్పీలు, అదనపు డీజీపీలు మనోవేధనకు గురవుతున్నారు. కేవలం పోలీసుశాఖలో డైనమిక్ ఆఫీసర్ల మార్గదర్శకంలో ఎన్నో ప్రభుత్వాలు, నిలబడ్డాయనే విషయాన్ని ఈ సంధర్బంగా గుర్తుచేస్తున్నారు. వారి మార్గదర్శకాలను పాటించని ప్రభుత్వాలు సైతం కూలిపోయాయనే సంధర్బాలను రిటైర్ట్ పోలీసు అధికారులు గుర్తుచేస్తున్నారు. ఇఫ్పటికైనా సీఎం కేసీఆర్ ఆలోచించి, కుల, మతాలకు, తనవారు అనే తారతమ్యం లేకుండా డైనమిక్ పోలీసు అధికారులకు సరైన అవకాశం కల్పిస్తారా..? లేదా అనేదానిపై అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు