Sunday, October 13, 2024
spot_img

ఇది మునుపటి తెలంగాణ కాదు : కేసీఆర్

తప్పక చదవండి
  • కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది..
  • సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం..
  • రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి లోటు రాకుండా
    చూడాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్..

దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ డిమాండు తదితర పరిస్థితులపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటికి లోటు రానీయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి లభ్యతా వివరాలను సీఎంకు ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరించారు. రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, చుక్క చుక్క ఒడిసిపట్టి, ప్రజలకు నీటిని అందించాలని సీఎం అధికారులకు సూచించారు. అదే సందర్భంలో ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పటికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ, మిడ్ మానేర్ ను నింపాలని అన్నారు. అక్కడి నుంచి లోయర్ మానేర్ డ్యాంకు సగం నీళ్ళను, పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్ళను ఎత్తిపోయాలన్నారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అదే సందర్భంలో ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, తదితర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకునే పరిస్థితులున్నాయని, అటువంటి పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా “కంటిన్ జెన్సీ ప్లాన్” సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రతి రోజు మినిట్ టు మినిట్ రిపోర్టును సీఎం కార్యాలయానికి ప్రతి రోజు ఉదయాన్నే అందజేయాలని, ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి వ్యవసాయం, తాగునీరు, సాగునీరు పంపిణీకి సంబంధించి వస్తున్న రిపోర్టులను అనుసరించి సీఎం కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, అప్రమత్తం చేస్తుందనీ, తద్వారా ఎటువంటి సమస్య తలెత్తకుండా సమన్వయం చేస్తామని సీఎం తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉన్నది. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు టెస్టింగ్ టైం” అని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.

“ఇది మునుపటి తెలంగాణ కాదు.. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంక్షోభ సమయంలనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. మీ పరిజ్ఞానాన్ని అంతా పెట్టి ప్రజల కోసం పనిచేయాలి. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలి. ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి” అని సీఎం స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు