- ఉపాధ్యాయుల ఆలస్యంతో
ఆరుబయటే విద్యార్థుల ఎదురుచూపులు - కొన్ని బడులలో సబ్జెక్టు టీచర్లే లేరు..
- కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
కారేపల్లి : ఏజెన్సీ మండలమైన సింగరేణిలో కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు. దూర ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడంతో సమయపాలన పాటించక క్లాసులు సరిగా జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. కొన్ని పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులకు బోధించే ఉపాధ్యాయులు లేక, ఒక్కరే రెండు, మూడు సబ్జెక్టులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మండల పరిధిలోని మాణిక్యారం ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, ఒకరు మాత్రమే సమయానికి హాజరై మరొకరు ఆలస్యంగా వచ్చారు. మాణిక్యారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సైతం ఎనిమిది మంది ఉపాధ్యాయులకు గాను ఐదుగురు మాత్రమే సమయానికి హాజరయ్యారు. ఉపాధ్యాయులు సమయా నికి రాకపోవడంతో, పాఠశాల తలుపులు తీయక, విద్యార్థులు ఆరుబయటే వేచి ఉన్నారు. బాజుమ ల్లాయి గూడెం ఉన్నత పాఠశాలలో గణితం బోధించే ఉపాధ్యాయుడు సెలవు పెట్టడంతో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడే రెండు సబ్జెక్టులు బోధిస్తున్నాడు. అదే పాఠశాలలో తెలుగు, హిందీ భాషా బోధకులు లేక ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పాఠాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత హెచ్‌ఎం ను అడగగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.
కొరవడిన పర్యవేక్షణ..
విద్యాశాఖలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా సమయపాలన పాటిస్తున్నారని సంబంధిత పాఠశాలల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని విద్యావ్యవస్థ పై బుధవారం ఆదాబ్ విలేకరి పరిశీలన చేయగా రోజు చేసే ప్రతిజ్ఞ కూడా విద్యార్థులు తప్పుగా చదవడం గమనార్హం. దీంతో ఉపాధ్యాయులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, వారి బోధన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు కనీస సామర్థ్యాలు కూడా సాధించలేని పరిస్థితి ఏర్పడిరది. కావున సంబంధిత అధికారులు గిరి పుత్రుల చదువులపై దృష్టి సారించాలని కోరుకుందాం.