- శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ నుంచి పిలుపు..
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్!
- దశాబ్ది ఉత్సవాల ముగింపు వేళ నిర్ణయం
- విమర్శలకు చెక్‌పెట్టే యోచనలో సీఎం కేసీఆర్
తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణం తీసుకున్న అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా శంకరమ్మకు ఇందులో అవకాశం కల్పించే అవకాశం ఉంది. గతంలో హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి శంకరమ్మ ఓడిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు.. టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన హైకమాండ్ సైదిరెడ్డికి చాన్స్ ఇచ్చింది. ఆయన విజయం సాదించారు. అయితే, తనకిచ్చిన హామీని నెరవేర్చడంలో జాప్యం జరగడంతో.. కేసీఆర్ ప్రభుత్వంపై శంకరమ్మ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రోజుకొక కార్యక్రమాన్ని ఎంపిక చేసి ఈ వేడుకలను నిర్వహించారు. అయితే, శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తుచేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో తొలి రోజు నుంచే కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. శ్రీకాంతచారి త్యాగం.. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని, ఆయన కుటుంబసభ్యులకు పదవులను ఇప్పించిందని.. అమరుల కుటుంబాలకు మాత్రం మేలు జరగలేదని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలకు చెక్ పెట్టేవిధంగా బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సరైన సందర్భాన్ని ఎంచుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.