Wednesday, April 24, 2024

రాబందుల చేతిలో రామసముద్రం కుంట

తప్పక చదవండి
  • కుంటను కనుమరుగు చేస్తున్న వరీటెక్స్ విరాట్….
  • స్థానిక కార్పొరేటర్ కనుసనల్లోనే రామసముద్రం కుంట రాక్షసుల పాలు….
  • వరీటెక్స్ విరాట్ లో కార్పొరేటర్ వాటా ఎంత?
  • అవినీతికి కేరాఫ్ గా మారుతున్న రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు….
  • పక్క ప్రణాళికతోనే కుంటలు, చెరువులలో నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేస్తున్న వైనం…
  • వరిటెక్స్ నిర్మాణ సంస్థకు కొమ్ముకాస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులు….
  • ముఖ్యమంత్రి ఆశయానికి గండి కొడుతున్న అధికారులపై కొరవడిన ప్రభుత్వ నిఘా…. ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ప్రజలకు సేవచేస్తూ ప్రజల ఆస్తులను పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన వారే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆశయాన్ని విస్మరిస్తూ.. బడా బిల్డర్లు తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు కుంటలను కనుమరుగు చేస్తుంటే అడ్డుకోవాల్సిన స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిదే వారికి అందడంతల అందిస్తుండడం చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోక తప్పదు. ప్రభుత్వ ఆశయాలు ఎంత గొప్ప వైనప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు ఎంగిలి మెతుకులకు ఆశ పడుతున్నన్ని రోజులు అవి అమలుకు నోచుకోవడం అసాధ్యం. రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి నియోజక వర్గం పరిధి, మదినగూడ డివిజన్ లోని రామసముద్రం కుంటను కనుమరుగు చేసేందుకు అధికార పార్టీ స్థానిక కార్పొరేటర్ తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వరీ టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థతో చేసుకున్న లోపాయి కారీ ఒప్పందాన్ని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే..

హైదరాబాద్, 01 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ మధిన గూడా శివారులో ఉన్న రామసముద్రం కుంటపై కన్నేసిన వరిటెక్స్ నిర్మాణ సంస్థ దొడ్డి దారిన అనుమతులు పొంది, యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు తెరలేపింది.. కుంటను కబ్జా చేయుటకు కుయుక్తులు పన్నిన వరిటెక్స్.. రామ సముద్రం కుంటను పూడ్చి సుమారు రెండు ఎకరాల భూమిని దర్జాగా కబ్జా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. స్థానిక కార్పొరేటర్ కనుసన్నల్లోనే ఈ భారీ భూ కబ్జా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వరి టెక్స్ విరాట్ కబ్జా విషయంలో అధికార పార్టీ కార్పొరేటర్ కు భారీగా ముడుపులు ముట్టాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. కుంటను పూడ్చి దర్జాగా కబ్జా చేస్తున్న నిర్మాణ సంస్థకు కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు వరిటేక్స్ నిర్మాణ సంస్థ కు ఎన్.ఓ.సి. జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థకు సంబంధించి సర్వే నెంబర్ 197లో ఉన్న భూమి కంటే అదనంగా మూడెకరాల భూమి ఎక్కడ నుండి వచ్చింది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.. పక్కనే ఉన్న ఓ భూమి యాజమానుల సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసినట్లు తెలుస్తోంది.. వరి టెక్స్ నిర్మాణ సంస్థ కు కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి అటు వైపు కన్నెత్తి చూడక పోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది.. రాబందుల చేతిలో రామ సముద్రం కుంట కనుమరుగు చేస్తుంటే.. నిర్మాణ అనుమతులు ఎలా వచ్చాయనే విషయంపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు బట్ట బయలు అవుతాయి.. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి రామసముద్రం కుంటను కబ్జాచేస్తున్న వరి టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అనుమతులు రద్దు చేసి, కబ్జాకు పాల్పడిన వ్యక్తుల పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థకు సంబంధించి సర్వే నెంబర్ 197 లో లేని భూమి ఎలా వచ్చింది..? రెట్టిఫికేషన్ డాక్యుమెంట్ వెనుక మతలబేంటి..? రెడ్ మిక్స్ ప్లాంటుకు అనుమతులు ఉన్నాయా..? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఉన్నాయా..? స్థానిక అధికార పార్టీ కార్పొరేటర్ కు ముట్టిన ముడుపులు ఎంత..? గూగుల్ మ్యాప్ ల్యాటి ట్యూడ్, అటి ట్యూడ్ ఏ12 నుండి ఏ 20 వరకు హెచ్.ఎం.డి.ఏ. లేక్ మ్యాప్ ఏమి చెపుతుంది..? అన్న విషయాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతి పై అస్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు