- జీడిమెట్ల పరిశ్రమల కాలుష్యంతో హుస్సేన్ సాగర్ కలుషితం..
- నాలాల ద్వారా మూసి నది కూడా కలుషితమౌతున్న దౌర్భాగ్యం.. ..
- మూసినదిలో కలిసిన వ్యర్థాలతో రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలోనూ కాలుష్యం..
- జీడిమెట్ల కాలుష్య వ్యర్థాలు 200 కీ.మీ. దూరంలో ఉన్న కృష్ణా నదిలోకి..
- జీఓ నెం. 20 అమలు అయ్యేదెప్పుడు..? కాలుష్య పీడ విరగడ అయ్యేది ఎప్పుడు..?
- జీడిమెట్ల పరిశ్రమల కాలుష్యంపై రూ. 1000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి..
- ఎన్.జీ.టి.లో కేస్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త. పి.ఎల్.ఎన్. రావు..
హైదరాబాద్ మహానగరం అంటే ఇష్టపడని వారుండరు.. ఇక్కడి వాతావరణ పరిస్థితులు.. ప్రజల ఫ్రెండ్లీ నేచర్, విలువైన భూములు.. ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తుంది.. ఇంతవరకు బాగానే ఉంది.. ప్రస్తుత భాగ్యనగరం, పరిసర ప్రాంతాల పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తోంది.. భూగర్భ జలాలతో బాటు.. చుట్టూ వాతావరణాన్ని కలుషితం చేసే కాలుష్యం నిమిష నిమిషానికి విషంలా వ్యాపిస్తోంది.. దీనికి కారణం ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న కెమికల్ కంపెనీలు.. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో కాలుష్యం వెదజల్లే కెమికల్ కంపెనీలకు అనుమతులు లభించడం గగనం.. అందుకే కెమికల్ ఇండస్ట్రీలను స్థాపించేవారు తెలంగాణ వైపు చూస్తున్నారు.. ఇక్కడి ప్రభుత్వం అలాంటి వారికి సులువుగా పరిమిషన్లు ఇచ్చేస్తోంది.. ప్రజల ఆరోగ్యాల కంటే ప్రభుత్వ ప్రయోజనాలే ముఖ్యమని తలుస్తున్న ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి తీసుకుని వెళ్తోంది.. కొన్ని నియమ నిబంధనలు పరిశ్రమలకు ఏర్పాటు చేసి తూ తూ మంత్రంగా పని కానిచ్చేస్తున్నారు.. దీంతో నేల, నింగి, గాలి, నీరు కలుషితం అయిపోతున్నాయి.. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలను ఒక పద్దతిగా శుద్ధి చేయాల్సిన కంపెనీలు.. నిబంధనలను పట్టించుకోవడం లేదు.. కొందరు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా అవినీతి కాలుష్యంతో నిండిపోయి.. ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భాగ్యనగరం కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు..
హైదరాబాద్, జీడిమెంట్ల ఐడిఎ పరిధిలోని ఫార్మా కెమికల్ పరిశ్రమలలో చేపట్టిన ఉత్పత్తుల నుండి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం శుద్ధి చేయకుండా ప్రతి రోజు సుమారు 5 లక్షల లీటర్ల వ్యర్థాలు విడుదల చేయడం ద్వారా.. హుస్సేన్ సాగర్‌లోకి వెళ్ళి, మూసినది ద్వారా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అతి పెద్దదైన నీటి వనరు అయిన కృష్ణానదిలో కలుస్తూ కలుషితం అవుతున్నందున.. ఇప్పటికే అవుటర్ రింగు రోడ్డులోపల ఉన్న రెడ్ క్యాటగిరి పరిశ్రమలను తరలించాలని జీఓ నెంబరు 20 జారీ చేసినందున వెంటనే ఫార్మా పరిశ్రమలను తరలించాలని.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘించినందున రూ. 1000 కోట్లు నష్టపరిహారం వసూలు చేయాలని.. సిఎఫ్‌ఒ రిన్యూవల్ చేయవద్దని, ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ కాపాడాలని కోరుతూ..
సేవ్ హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ..
కాలుష్యం బారిన పడిన హుస్సేన్‌సార్ మూసినది, కృస్ణానదిని కాపాడండి :
హైదరాబాద్ నగరంలో 1975 లో జీడిమెట్ల పరిధిలో ఫేజ్ 1 నుండి ఫేజ్ 6లో డెవలప్ చేసిన 1200 ఎకరాలలో చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల కొరకు పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసినారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మూడువందలకు పైనే పరిశ్రమలు ఉన్నాయి.. అందులో సుమారు 50 వరకు కెమికల్, పార్మా పరిశ్రమలు ఉన్నాయి. వ్యర్థాలు శుద్ధి చేయకుండా నేరుగా నాలాల ద్వారా విడుదల చేయడంతో నాలాల నుండి వెళ్ళే వ్యర్థాలు హుస్సేన్ సాగర్‌లోకి వెళుతున్నాయి.
హుస్సేన్ సాగర్ పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం :
హైదరాబాద్ నగరానికి తలమానికం అయిన ప్రధాన సందర్శన ప్రాంతంలో ఒకటి హుస్సేన్ సాగర్.. ఏళ్ళ తరబడి అంటే సుమారు 30 సంవత్సరాలుగా జీడిమెట్ల పారిశ్రామక వాడ ప్రాంతంలో ఉన్న ఫార్మా కెమికల్ పరిశ్రమల నుండి నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలు నాలాల ద్వారా నిత్యం లక్షలాది లీటర్లు హుస్సేన్ సాగర్‌లోకి చేరడంతో అత్యంత కలుషితమైన నీటి వనరుగా మారింది.. దాంతో పరిసర ప్రాంతాలతో పాటు, సందర్శకులు తీవ్ర వాయు కాలుష్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు.
జీడిమెట్ల వ్యర్థాలతో మూసినది ద్వారా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ద్వారా నేరుగా కృష్ణా నదిలోకి :
జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో గల పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను, జెఇటిఎల్‌లో పూర్తిగా శుద్ధి చేయకుండా విడుదల చేసే వ్యర్థాలు, నాలాల ద్వారా హుస్సేన్ సాగర్‌లోకి చేరి అక్కడి నుండి వివిధ మార్గాల ద్వారా మూసినదిలో చేరడంతో.. మూసినది కాలువలలో ప్రవహించే ఉమ్మడి రంగారెడ్డి తూర్పుప్రాంతం నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా ద్వారా చివరికి గుంటూరు జిల్లా సరిహద్దులో గల నాగార్జున సాగర్ నుండి, పులిచింతల ప్రాజెక్టుకు వెళ్ళే ప్రధాన కాలువ వాడపల్లి దగ్గర సుమారు 200 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో.. వ్యర్థాల తీవ్రత అక్కడి వరకు వెళ్ళే వరకు తగ్గినా చివరకు కృష్ణా జలాలలో కూడా కలుస్తున్నాయి.
రెడ్ క్యాటగిరి పరిశ్రమలు అవుటర్ రంగు రోడ్డు లోపలినున్న వాటిని తరలించాలని
జీఓ 20 జారీచేసి 10 సంవత్సరాలు గడిచినా చర్యలు శూన్యం..
హుస్సేన్ సాగర్ నుండి మూసి నదిలోకి ఎస్‌టిపి, జెఇటిఎల్ ఉన్నా
కాగితాలకే పరిమితం, ఆశించిన ప్రయోజనాలు లేవు :
హుస్సేన్ సాగర్‌లోకి చేరిన జీడిమెట్ల పారిశ్రామిక వాడ ప్రాంతంలోని పరిశ్రమల వ్యర్థాలు నేరుగా హుస్సేన్ సాగర్‌లోకి వచ్చిన తరువాత నాలాల ద్వారా అంబర్‌పేట సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ కు చేరడంతో పాటు, మరో కాలువ ద్వారా నాగోలు ద్వారా మూసినదిలోకి కలవడం జరుగుతుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గల జీడిమెట్ల ఏఫ్యూలెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కు పరిశ్రమల నుండి వ్యర్థాలను శుద్ధి కొరకు పంపిస్తున్నా.. అక్కడ పూర్తి స్థాయిలో శుద్ధి చేయకుండానే నేరుగా రాత్రి వేళల్లో నాలాలోకి వదులుతూ చేతులు దుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో వ్యర్థాల శుద్ధి కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం నియంత్రించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. దాంతో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గల పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు హుస్సేన్ సాగర్ నుండి నాలాల ద్వారా మూసినదిలోకి చేరుతున్నాయి.
ఫార్మా కెమికల్ పరిశ్రమలలో జరిగే ప్రమాదాలతో భయం గుప్పెట్లో ప్రజలు :
జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో గత దశాబ్ద కాలంగా పరిశ్రమల చట్టు ప్రక్కల జనవాసాలు ఉండడంతో.. తరచూ ఫార్మా కెమికల్ పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడల్లా స్థానిక ప్రజలు తీవ్ర భయందోళనలకు గురి అవుతూ భయం భయంతో జీవిస్తున్నారు. అయినా వాటి నివారణకు చర్యలు చేపట్టడంలో మాత్రం వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం.. సంఘటన జరిగినప్పుడు మీడియాతో పాటు అధికారులు హడావుడి చేయడం తప్ప ప్రమాదాల నివారణ మాత్రం జరగడం లేదు. కావున జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫార్మా కెమికల్ పరిశ్రమను తప్పనిసరిగా వెంటనే తరలించాల్సిన అవసరం ఉంది.
అనుమతులులేని వ్యర్థాల నిల్వల కెమికల్ మాఫియా..
ఎవరికి సంబంధం లేదన్నట్లు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు :
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సుమారు 100కు పైగా పరిశ్రమల నుండి వెలువడే సాల్వెంట్స్‌ను సేకరించి నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసే గోదాములు ఉన్నాయి. ఇది ఒక మాఫియాగా మారి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కెమికల్ వ్యర్థాలను అడ్డదారిలో తరలించడానికి సాల్వెంట్స్ సేకరించి, అనుమతులు లేకుండా బై ప్రాడక్ట్స్ చేసే పరిశ్రమలకు విక్రయిస్తూ పారిశ్రామిక వాడలో తరచు ప్రమాదాలు జరుగడానికి కారణం అవుతున్నారు.. అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నందున ఒక రకమైన వాతావరణంతో జీడిమెట్ల ప్రాంతంతో పాటు హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారు.. కనుక వెంటనే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోదాంలను తొలగించి.. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను పూర్తి స్ధాయిలో శుద్ధి చేసి.. వెలవడే సాల్వెంట్స్‌ను సురక్షితంగా పూర్తి స్థాయి ప్రభత్వ అనుమతులతో బై ప్రాడక్ట్స్ చేసే పరిశ్రమలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫార్మా కెమికల్ పరిశ్రమలు నిబందనలు పాటించకుండా గత 30 సంవత్సరాలుగా వ్యర్థాల శుద్ధి చేయకుండా.. నాలాల ద్వారా వ్యర్థాలను విడుల చేస్తుండడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా కాలుష్య కాసారంగా మారింది. దాంతో పాటు మూసినది పరివాహక ప్రాంతంలో హైదరాబాద్ నుండి నల్లగొండ జిల్లా కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం జరిగే ప్రాంతాలలో ఎక్కడ కూడా ఫార్మా కెమికల్ పరిశ్రమలు లేవు. కేవలం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పరిశ్రమల నుండి మాత్రమే వెలువడే వ్యర్థాలలో హుస్సేన్ సాగర్‌తో పాటు, మూసినది ప్రవహిస్తున్న రంగారెడ్డి తూర్పు ప్రాంతం, నల్లగొండ జిల్లా పూర్తిగా విషతుల్యం అయ్యింది. దానికి కారణం కేవలం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల యాజమాన్యాలు అక్రమంగా వ్యర్థాలను బహిరంగంగా వదిలివేయడం వల్లనే ఈ రోజు హుస్సేన్ సాగర్‌తో పాటు మూసినది కాలుష్య కాసారాలుగా మారినవి.