Monday, May 20, 2024

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు..

తప్పక చదవండి
  • ఫలితాలు ప్రకటించొద్దంటూ ఆదేశాలు..
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి..
  • తదుపరి విచారణ ఆగస్టు 17 వాయిదా..

తెలంగాణలో పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జీఓ నెంబర్ 57, 58ని ప్రిలిమ్స్ పరీక్షలు అయిన తరువాత తెరమీదికి తీసుకువచ్చిందని పోలీస్ జాబ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 17వరకు రిక్రూట్మెంట్ సంబంధించి ఎలాంటి ఫలితాలు విడుదల చేయొద్దని బోర్డును ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది. మరోవైపు ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుది అంకానికి చేరింది. వారంరోజుల్లోపే అభ్యర్థుల తుది ఎంపికల జాబితా వెల్లడించడానికి పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. ఎస్సైల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్ మార్కుల్ని నిర్ణయిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా, మహిళలు, పురుషులు, ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్ పాయింట్లు… ఇలా దాదాపు 180కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్ మార్కులు నిర్ణయించాల్సి ఉన్నందున కూలంకషంగా పరిశీలిస్తున్నారు.

ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెల రెండో వారంలో జాబితా వెలువడే అవకాశముంది. అయితే… మొదట ఎస్సైలుగా ఎంపికైన 579, ఏఎస్సైలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను వెల్లడించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తుది రాతపరీక్షలో ఎంపికైన 97,175 మందిలో పలువురు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాశారు. తొలుత ఎస్సై విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్‌లాగ్‌లను నివారించవచ్చనేది నియామక మండలి ఆలోచన. ఎస్సైగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్ పోస్టును వదులుకుంటామని అండర్ టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాతే నియామక పత్రాలు :
తుది ఎంపిక జాబితాలో పేరున్నా… అప్పుడే ఉద్యోగపత్రం అందుకునే అవకాశం ఉండదు. ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన నేపథ్యం, నేరచరిత్ర, ప్రవర్తన… తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను జిల్లాలవారీగా స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) చేపట్టనుంది. క్రిమినల్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) డేటాను విశ్లేషించడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పరిశీలనపైనా ఎస్‌బీ దృష్టి సారించనుంది. విజేతల తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో పర్యటించి అక్కడి ఠాణాల్లో ఏమైనా కేసులున్నాయా…? అని పరిశీలించిన తర్వాత మండలికి నివేదిక పంపనున్నారు. ఆ నివేదికలో క్లీన్ చిట్ లభిస్తేనే ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు