Friday, March 29, 2024

పోలవరం గేట్లు తెరవాలి..

తప్పక చదవండి

రాను న్న వానకాలంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచకూడదని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్‌ చేసింది. నిరుడు వరదల వల్ల తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి డ్యామ్‌కు సంబంధించిన 48 గేట్లతోపాటు, రివర్స్‌ స్లూయిస్‌లను కూడా తెరిచే ఉంచాలని, తద్వారా సహజ ప్రవాహాలు కొనసాగేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సర్కారుకు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ మురళీధర్‌ శనివారం ఘాటైన లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయి వరకు నీరు నిల్వ చేయడం వల్ల తెలంగాణలో 954 ఎకరాలకుపైగా విస్తీర్ణం ముంపునకు గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. మారిన డ్యామ్‌ డిశ్చార్జి డిజైన్‌ వల్ల ఈ ముంపు మరింత పెరిగి స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతున్నదని తెలిపింది. నిరుడు భద్రాచలం వద్ద ఊహించిన దానికంటే భారీగా వరద రావడానికి ఇదే కారణమని పేర్కొన్నది.

బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల నదీ తీరాలతోపాటు స్థానికంగా 31 ప్రధాన, మధ్యస్థ వాగుల వెంబడి డ్రైనేజీ రద్దీ సమస్య కూడా తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. తద్వారా 60 గ్రామాలపై ప్రధాన నది వరద ప్రభావం పడి 40,446 ఎకరాల విస్తీర్ణం నీటమునుగుతుందని, 28,000 మంది నిరాశ్రయులవుతారని వివరించింది. ఇప్పటికే ఈ ముంపునకు సంబంధించిన అంశాలన్నింటినీ ఆధారాలతో కేంద్ర జలసంఘానికి వివరించామని గుర్తుచేసింది. తెలంగాణ వాదనలతో సీడబ్ల్యూసీ ఏకీభవిస్తూ ముంపుపై సంయుక్త సర్వే చేపట్టాలని ఆదేశించిన విషయాన్నీ ప్రస్తావించింది.

- Advertisement -

ఈ విషయమైన ఎన్ని లేఖలు రాసినప్పటికీ సంయుక్త సర్వే నిర్వహణకు ఏపీ, పీపీఏ చర్యలు చేపట్టకపోవడాన్ని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది. ముంపు నివారణ చర్యలు చేపట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులో నీరు నిల్వ చేయవద్దని డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఏపీ ఏమాత్రం పట్టించుకోకుండా నిరుడు వానకాలం ఆరంభానికి ముందే ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేసి డ్యామ్‌లో నీరు నిల్వ చేయడాన్ని ప్రారంభించిందని, అందుకే భద్రాచలంతోపాటు తెలంగాణలో భారీ ముంపు ఏర్పడిందని ఈఎన్సీ మురళీధర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు