Wednesday, October 16, 2024
spot_img

ప్రమాద స్థలిలో ప్రధాని..

తప్పక చదవండి
  • సహాయక ఏర్పాట్లపై సమీక్ష..
  • ప్రాథమిక నివేదిక అందించిన అధికారులు..
  • కటక్ ఫకీర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోడీ..
  • మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు..
  • మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని..
  • ఈ మార్గంలో కచక్ వ్యవస్థ లేకపోవడమే కొంప ముంచింది..
  • మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో..
  • రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి..
  • బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్
    06782262286కు ఫోన్‌ చేయాలని తెలిపిన అధికారులు..

బాలాసోర్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఒడిశా లో కనీవినీ ఎరుగని మహా విషాదం చోటుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలిని శనివారంనాడు సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్రం మంత్రులు, రైల్వే అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా జరుగుతున్న సహాయక ఏర్పాట్లను పర్వవేక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. అనంతరం కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించేందుకు ప్రధాని వెళ్లారు. శుక్రవారంనాడు బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది దుర్మరణం పాలయ్యారు, 900 మందికి పైగా గాయపడ్డారు.

కాగా, సిగ్నలింగ్ సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది. రైలు నంబర్ 12841కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇచ్చారు. కానీ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి, అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పిందని ప్రాథమిక నివేదిక పేర్కొంది. దీనివల్ల కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, 300 పైగా చేరవచ్చని తెలుస్తోంది.. రైలు ప్రమాద బాధితులను ప్రధాని మోడీ పరామర్శించారు. కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

రైళ్ల ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ 2022 లో కవచ్ అనే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనేది ఒక ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. అలాగే ఈ కవచ్ వ్యవస్థ ద్వారా రైళ్లు వెనక్కి నడుస్తాయి. అందువల్ల ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా అవి ఎట్టి పరిస్థితుల్లో ఢీకొనలేవు. ఈ కవచ్ వ్యవస్థను దశలవారీగా దేశవ్యాప్తంగా రైల్వే శాఖ అమల్లోకి తెస్తోంది. అయితే ఇప్పుడు ఆ రూట్‌లో కవచ్ వ్యవస్థ అందుబాటులో ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంఘటన జరిగిన మార్గంలో కవచ్ వ్యవస్థ అందుబాటులో లేదని భారతీయ రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు. 2022 మార్చి 22 న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కవచ్ టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్‌’ భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆ సమయంలో అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. వికారాబాద్​ జిల్లా నవాబ్​పేట్​ మండలం లింగంపల్లి- వికారాబాద్‌ సెక్షన్‌లోని గుల్లగూడ- చిటిగిడ్డ రైల్వే స్టేషన్ల మధ్య కవచ్‌ పనితీరును అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. రైల్వే మంత్రి స్వయంగా ఎదురెదురుగా వచ్చే రైళ్లలో ఒకదాంట్లో కూర్చొని కవచ్ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-హౌరా వంటి రద్దీ మార్గాల్లో 2వేల కిలోమీటర్ల మేర కవచ్‌ వ్యవస్థను విస్తరిస్తామని రైల్వేమంత్రి వెల్లడించారు. “ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినపుడు కవచ్​ టెక్నాలజీ ద్వారా దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. ఈ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్​గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు.. ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ కవచ్ వ్యవస్థ గుర్తించి రైళ్లను ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ హెచ్చరిస్తుంది.

రైలు ప్రమాదం జరిగిన తీరు..
బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద జూన్ 2వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అయితే అదే ట్రాక్ పై 120 కిలో మీటర్ల వేగంతో వస్తున్న షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు ఒక్కసారిగా బోల్తాపడ్డాయి. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో బోగీలు ఎగిరిపడ్డాయి. అందులోని ప్రయాణికులు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది.

ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం : ప్రధాని మోడీ
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం.. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం.. క్షతగాత్రులు ధైర్యంగా ఉండండి.. అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం.. రైలు ప్రమాదం చాలా దురదృష్టం.. ఇది చాలా తీవ్రమైన ఘటన.. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు