Sunday, May 19, 2024

ఈనెల 8న ఉదయం 9 గంటలకే మోదీ ‘‘విజయ సంకల్ప సభ’’

తప్పక చదవండి
  • 15 లక్షల జన సమీకరణతో ఓరుగల్లును పోరుగల్లుగా మారుద్దాం..
  • కాంగ్రెస్ అనే కిరాణ దుకాణంలో కాస్ట్ లీ మెటీరియల్ చేరింది..
  • కేసీఆర్ దగ్గర కావాల్సినంత డబ్బుంది… ఆ పార్టీని కొనేందుకు సిద్ధమయ్యారు..
  • కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడుంది? దుబ్బాక నుండి టీచర్ ఎమ్మెల్సీ
    ఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే దక్కలే..
  • ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభ పాదయాత్ర ముగింపు సభనా?
    జాయినింగ్స్ సభనా? చెప్పుకోలేని దుస్థితి..
  • బీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయే..
  • బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్లమెంట్ లోపల,
    బయటా కలిసే పనిచేస్తున్నాయి..
  • కాంగ్రెస్ – బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్..


ఈనెల 8న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’ అని నామకరణం చేశారు. ఆరోజు ఉదయం 9 గంటలకే మోదీ హన్మకొండ సభకు విచ్చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. దాదాపు 15 లక్షల జన సమీకరణే లక్ష్యంగా బహిరంగ సభను నిర్వహించి ఓరుగల్లును పోరుగల్లుగా మార్చి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు. కనివీనీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రధాన బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఎస్వీ కన్వెన్షన్ హాలులో ‘‘సన్నాహక సమావేశం’’ జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి క్రిష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే… కాంగ్రెస్ పార్టీ గతంలో రాహుల్ గాంధీతో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభకు లక్షల మంది జనాన్నీ సమీకరించిందట. రాష్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీయే అంత జనాన్ని తీసుకొస్తే… బీఆర్ఎస్ కు అసలు సిసలైన బీజేపీ నిర్వహించబోయే అందునా ప్రధాని నరేంద్రమోదీ హాజరుకాబోయే బహిరంగ సభకు ఇంకెన్ని లక్షల మంది జనాన్ని సమీకరించాలో ఆలోచించండి. 15 లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేసి ఓరుగల్లును పోరగల్లుగా మార్చి చరిత్ర సృష్టిద్దాం. కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిది. కేసీఆర్ ద్రుష్టిలో ఆ పార్టీ అంటేనే షాపింగ్ మాల్ లాంటింది. ఇప్పుడు ఆ పార్టీలో మరో కాస్ట్ లీ మెటీరియల్ వచ్చి చేరింది. కేసీఆర్ దగ్గర డబ్బులకు కొదవలేదు. ఎంత డబ్బైనా పెట్టి కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు.

- Advertisement -

బీజేపీకి త్యాగాల చరిత్ర ఉంది. కార్యకర్తలెందరో జైలు పాలయ్యారు. సామ జగన్మోహన్ రెడ్డి వంటి వారు ప్రాణాలనే త్యాగం చేసిన చరిత్ర ఓరుగల్లుకు ఉంది. ఇంతటి పవిత్రమైన గడ్డకు ప్రపంచమే ‘‘ది బాస్ ’’ అంటూ కీర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్న నేపథ్యంలో ఆయనకు కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికి చరిత్ర సృష్టిద్దాం.. అలాంటి మోదీ తెలంగాణలో బీజేపీ కార్యకర్తల పోరాటాలను భేష్ అన్నారు. నన్ను భుజం తట్టి భేష్ అన్న సంగతిని మీరంతా చూశారు. నన్ను అనడమంటే అది నా గొప్ప కాదు.. మీ అందరి పోరాటాలే కారణం. ఇయాళ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే. దుబ్బాక నుండి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పై పోటీ చేసి గెలిచింది బీజేపీయే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహా తోకపార్టీలన్ని కలిసి పోటీ చేసినా 48 స్థానాల్లో జెండా ఎగరేసిన పార్టీ బీజేపీయే. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. రెండు స్థానాలకే పరిమితమైంది. దుబ్బాకసహా మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదు… మరి కాంగ్రెస్ యాడుంది? ఆ పార్టీని జాకీ పెట్టి లేపాలని చూస్తున్నరు. అందుకే బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్-కాంగ్రెస్ లు పార్లమెంట్ లోపల, బయట కలిసే పనిచేస్తున్నయ్. ఒంటరిగా బీజేపీని ఓడించడం చేతగాకే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తూ తమను అప్రదిష్టపాల్జేస్తున్నాయి. బీఆర్ఎస్ గడీల పాలనను అంతమొందించి రామరాజ్య స్థాపనే బీజేపీ ఏకైక లక్ష్యం. అందుకోసం పేదల పక్షాన పోరాడుతున్నం. ప్రజలు సైతం బీజేపీనే ఆదరిస్తున్నారు. బీజేపీకే అధికారం ఇవ్వాలని భావిస్తున్నారు. నిన్నగాక మొన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టులోనూ బీజేపీకే మొగ్గు రావడమే ఇందుకు నిదర్శనం.

కేసీఆర్ కు మాత్రం ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడా అభివ్రుద్ది గురించి మాట్లాడటం లేదు. వరంగల్ అభివ్రుద్ధి కోసం స్మార్ట్ సిటీ పథకం కింద రూ.196 కోట్లు కేంద్రం కేటాయిస్తే రాష్ట్రం వాటా మాత్రం విడుదల చేయడం లేదు. కేంద్రం తెలంగాణ అభివ్రుద్దికి కట్టుబడి ఉన్నా కేసీఆర్ మాత్రం సహకరించడం లేదు. అభివ్రుద్ధి జరిగితే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందేమోననే భయంతోనే సహకరించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో జరిగే అభివ్రుద్ధి పనుల్లో పాల్గొనేందుకు హన్మకొండకు వస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో సభ పేరుతో నెల రోజుల నుండి అష్టకష్టాలు పడుతూ చెమటోడుస్తోంది. ఆ పార్టీ నిర్వహించేది పాదయాత్ర ముగింపు సభనా? జాయిన్సింగ్స్ సభనో అర్ధం కానట్లుగా ఉంది. ఎవరికి వారే గొడవలతో నిమగ్నమయ్యారు. ఓరుగల్లులో 8న జరగబోయే మోదీ సభకు మరో 5 రోజులే సమయముంది. మోదీని చూసేందుకు ప్రపంచమంతా తహతహలాడుతోంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని కనివినీ ఎరగని రీతిలో జనాన్ని సమీకరించి చరిత్ర స్రుష్టిద్దాం. జన సమీకరణ విషయంలో ఎవరెంత కష్టపడ్డారనే అంశంపై పార్టీ ప్రత్యేక ద్రుష్టి సారించింది. ప్రజలను సమీకరించలేని వాడు నా దృష్టిలో లీడర్ కానే కాదు.. సభ సక్సెస్ కోసం కష్టపడిన నాయకులకు పార్టీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇవ్వబోతోంది అన్నారు..

కాగా అంతకుముందు హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శనం చేసుకున్నారు బండి సంజయ్ కుమార్. మంగళ వాయిద్యాలతో బండి సంజయ్ కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ పూజారులు.. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బండి సంజయ్.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు