వేసవి కాలం ముగుస్తుండటంతో మామిడి సీజన్ కూడా ముగియనున్నది. ఈ ఏడాది కూడా పలు రకాల మామిడి పండ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే వినూత్నంగా ఏర్పాటు చేసిన మామిడి పండ్లు తినే పోటీ ఎంతో ఆకట్టుకున్నది. ఎక్కువ సంఖ్యలో మామిడి పండ్లు తిని బహుమతి గెలుచుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మామిడి పండ్లు తినే ఈ వింత పోటీ బీహార్‌లో జరిగింది. రాజధాని పాట్నాలో రాష్ట్ర స్థాయి మామిడి పండుగను నిర్వహించారు. జ్ఞాన్‌భవన్‌లో ఈ నెల 18 వరకు జరిగిన ఈ వేడుకలో వివిధ రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు.
కాగా, మామిడి పండుగ సందర్భంగా పలు కార్యక్రమాలతోపాటు పోటీలు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా పశ్చిమ చంపారన్‌లోని బెట్టియా ప్రాంతంలో మామిడి పండ్లు తినే పోటీ జరిగింది. ‘ఆమ్ ఖావో ఇనామ్ పావో’ అనే పేరుతో దీనిని నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన వారు ఈ పోటీలో పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో మామిడి పండ్లు తిని బహుమతిని గెలుచుకునేందుకు వారంతా పోటీ పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కూడా ఇటీవల మామిడి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. అత్యంత ఖరీదైన మామిడి రకం ఎంతో ఆకట్టుకున్నది. మియాజాకి మామిడి రకం ధర ఏకంగా కిలో రూ.2.75 లక్షలు పలికింది. మామిడి ప్రదర్శనకు వచ్చిన వారు ఇది చూసి నోరెళ్లబెట్టారు.