Sunday, April 28, 2024

మహమ్మాయమ్మ ఆలయంలో అమంగళకర పరిస్థితులు

తప్పక చదవండి
  • ఇబ్రహీంపట్నం మంగళంపల్లి గ్రామంలో దీనస్థితికి చేరిన
    విశ్వకర్మల ఆరాధ్య దేవత స్వయంభూ ఆలయం.
  • నిత్య కైంకర్యాలు లేక మూలన పడేసినట్టుగా అక్కడి వీరబ్రహ్మేంద్రస్వామి,
    గాయత్రి మాత, విశ్వకర్మ భగవానుల ఉపాలయాలు.
  • మలమూత్ర విసర్జనలు కలుస్తున్న కోనేటి నీటిలో నిండా
    మునిగిన ఆంజనేయస్వామి ఆలయం.

( దశాబ్దాలుగా జీతాలు లేని తమను ఇకనైనా అధికారులు ఆదుకోవాలనంటున్న అక్కడి సఫాయిలు పోషమ్మ, గంగమ్మ. సరైన శౌచాలయాలు లేక ఇబ్బంది పడుతున్న భక్తులు. అమ్మవారికి అపర భక్తుడు గా మారిన అప్పటి నవాబు ఇబ్రహీం భాషా – అమ్మవారి పేరిట విలువైన భూములు ధారాదత్తం అవుతున్నాయి.. ).

ఇబ్రహీంపట్నం మంగళంపల్లి గ్రామంలో కబ్జాకు గురై 200 పైచిలుకు ఎకరాలు గల గుడి ఆస్తి కాస్త ఐదున్నర ఎకరాలకు పడిపోయిన వైనం. దేవాదాయ శాఖ మరియు రాష్ట్ర వ్యాప్త విశ్వకర్మల సహకారం తో ఆలయ అభివృద్ధి చేస్తామంటున్న స్థానికులు.

- Advertisement -

చరిత్ర:
“ముంబా దేవి నామంతో ముంబైలో”, “తమిళనాడు లోని కాంచీపురంలో” మరియు దేశంలోని పలు ప్రాంతాల్లో వెలిసాయి శ్రీ మహమ్మాయి దేవి ఆలయాలు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మంగళంపల్లిలో బావిలో వెలిసింది శ్రీ మహమ్మాయిదేవి. “కనుచూపుమేరను దాటే పచ్చదనం”, “అమ్మవారు వెలసిన బావికి అనుసంధానమైన నీటి సరస్సు”, స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రసాదించే ప్రకృతి అందాల ఒడిలో ఉంటుంది ఈ ఆలయం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒకప్పుడు 200 పైచిలుకు ఎకరాల భూమి ఉండేది. కానీ, దురదృష్టావశాత్తు, ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆలయ వ్యవహారాలు చూసుకునే అప్పటి పె(గ)ద్దలు తమ సొంత ప్రయోజనాలకై భూములను అమ్ముకున్నారన్న వదంతులు ఉన్నాయి. ఎండోమెంట్ శాఖ పుణ్యమా అని కనీసం ఇపుడు ఐదున్నర ఎకరాలు అమ్మవారి ఆలయం పేరిట ప్రభుత్వ ఆదీనంలో కబ్జాకు గురికాకుండా ఉండడం కాస్త ఊరటనిచ్చే విషయం. దేశం లోని ఆలయాల సంరక్షణ కొరకు దేవాదాయ శాఖ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ ఉదాహరణతో మనం అర్థం చేసుకోవచ్చు. అలా కానిపక్షాన, రౌడీలు రాజకీయులు కలిసి సుస్థిరమైన ఆలయ ఆస్తులను అస్థిర పరచడానికి ఎలాంటి వెనకడుగు వేయరు.

క్షమార్హం కాని ప్రస్తుత పరిస్థితులు :
ఇదిలా ఉంచితే, ఈ ఆలయం ధూప ద్వీప నైవేద్య పథకం క్రింద ఉన్నపటికీ, ఇక్కడ కనీస క్కైంకర్యాలు జరగకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, ఊడ్చేవరికి ఇరవై ఏండ్లుగా జీతాలు లేకపోవడం లాంటి పలు విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. .

తక్షణ చర్యలుగా అధికారులు చేపట్టాల్సిన పనులు :
1) గత 20 సంవత్సరాలుగా పోశమ్మ ముదిరాజ్ అనే మహిళ ఇక్కడి పారిశుద్ధ కార్యక్రమాలు మరియు ఆలయ ఇతర పనులు చూసుకుంటుంది. తనతో పాటు, చేతల గౌరమ్మ అనే గిరిజన మహిళ కూడా గత 5 సంవత్సరాలుగా ఈ పనులను చూసుకుంటుందని పోషమ్మ చెబుతున్నారు. కానీ వీరిద్దరికీ జీతాలు లేవని, అధికారులు సత్వరమే తమపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి జీతాలు లేనప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అడగగా, ఏనాడైనా అమ్మవారు కరునించక పోతుందా వారి కష్టాలు తీరక పోతాయా అని ఆ ఇద్దరు మహిళలు సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి వారు భక్తులు ఇచ్చే దక్షిణతో సరిపెట్టుకుంటున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.

2) అమ్మవారికి జరగాల్సిన పూజలు సరైనవిధంగా అస్సలు జరగడం లేదని, ఆషాఢ మాసం శుక్రవారం లాంటి పర్వదినాల్లో సైతం దాదాపు మధ్యాహ్న సమయంలో అలంకరణ మొదలు పెట్టారని, తూ తూ మంత్రం కంటే హీనంగా ఇక్కడ పూజాకార్యాలు జరుగుతున్నాయని, ఇది గ్రామానికి ఏమాత్రం కూడా మంచిది కాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, దీనిపై తగు చర్యలు తీసుకొని, గుడి ని శాస్త్రోక్తంగా నడపాలని విజ్ఞప్తి చేశారు.

3) ఆలయ ప్రాంగణం లో ఉన్న జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, వేద మాత గాయత్రి దేవి, సృష్టికర్త విశ్వకర్మ భగవానుల వారి కోవెలలు నిరాదరణకు గురైనట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నిత్య ధూప ద్వీప నైవేద్యాలు జరిగేలా దేవాదాయ శాఖ శ్రద్ధ తీసుకోవాలని విశ్వకర్మలు ప్రార్థిస్తున్నారు.

4) ఆలయానికి పక్కనే ఒక కోనేరు ఉన్నది. అమ్మవారి మూల విరాట్టు కింద ఉన్నటువంటి బావి లోని నీరు ఈ కోనేరు లోకి ప్రవహించి, అటు పక్కన ఉన్న చెరువులో కలిసిపోతాయి. కానీ, కనీస ప్రణాళిక మరియు ప్రకృతి యొక్క పరిరక్షణ లేకపోవడం వల్ల, ఈ కోనేరు లోని నీరు పాచిపట్టిపోయాయి. పైగా పక్కనే ఉన్న చెట్ల పొదల్లో జనాలు మరియు జంతువులు మల మూత్ర విసర్జన చేయడం వల్ల ఆ అశుధ్ధం కాస్త ఈ కోనేరులో కలిసాయి. ఫలితంగా ఆ కోనేటి దిగువన ఉన్న ఆంజనేయ స్వామి గుడి మురుకి మరుగులో మునిగిపోయింది. ఇది అరిష్టానికి సూచిక అని, అధికారులు వెంటనే ఈ గుండంను శుభ్రపరిచి, ఇక్కడ అంజన్నకు ధూప ద్వీప నైవేద్యాలు నిత్య కృతం చేసి, రానున్న రోజుల్లో మరలా ఇలాంటి అపశృతులు జరగకుండా ఆ చిన్న గుండం చుట్టూ ఉన్న ప్రహరీ గోడల ఎత్త్తు పెంచి, ఇతర తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతివారు ప్రాదేయపడుతున్నారు.

5) గుడికి వెనకాల ఉన్న శౌచాలయలు శుభ్రం గా లేకపోవడమే కాకుండా, చేరుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చుట్టూరా చెట్లు, పొదలు పేరుకుపోవడం తో ఎక్కడ నుండి ఏ పాము కానీ తెలు కానీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా కాకుండా, ఇక్కడ కనీస సౌకర్యాలు వెంటనే ఏర్పరచి, మరోవైపు ఆకతాయిల నుండి శాంతి భద్రతలకు భంగం కలగకుండా అధికారులు, ప్రభుత్వం మరియు పోలీస్ వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మత సామరస్యానికి ప్రతీక:
ఇబ్రహీం భాషా అనే యవన రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. బ్రహ్మంగారికి కడప నవాబు దాసోహమైనట్టుగా, ఇక్కడ మహమ్మాయమ్మ కు ఇతను దాసోహమైనారు. కాలక్రమేనా అమ్మవారి ఆలయానికి అనేక ఆస్తులు, భూములు నజరానా ప్రకటించారు. అతని హయాంలో ఆలయం అభివృద్ధి కి నోచుకుంది. అతను కట్టించిన ఎత్తైన ప్రహరీ గోడలు ముస్లిముల కోట మాదిరిగా ఉండడం మనం ఇపుడు చూడవచ్చు. అతని కోరిక మేరకు అమ్మవారి ఆలయానికి ఆమడ దూరం లో ఇతని మసీదు కట్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం దేవి జాతర అనంతరం ఇక్కడ మసీదులో ఉత్సవాలు జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. అతను పంచిన భుమ్ముల్లో కొన్ని అన్యాక్రాంతం అవ్వగా, కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆ లెక్క 200 పైచిలుకు ఎకరాలు ఉండేదని, ఇప్పుడు అది కాస్త కబ్జా రాయుల్ల కోరల్లో పడి 5.5 ఏకరాలకు పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

విశ్వకర్మల ఇలవేల్పు :
పార్వతీ దేవి అంశ..
శ్రీ మహమ్మాయిదేవి. దేశవ్యాప్తంగా ఉన్న ఈ తల్లి ఆలయాలు చాలా వరకు విశ్వకర్మల పరిరక్షణలో ఉండేవి. వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధించాలంటే మొదట ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ మహమ్మాయి దేవిని కొలిచేవారు. కానీ కాలక్రమేనా ఈ సంస్కృతి పక్కకు జరిగిపోవడం బాధ కలిగించే విషయంగా వీరు భావిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం, శ్రీ మహమ్మాయి దేవాలయాలు అన్యాక్రాంతం కావడం అని అన్నారు. దీనిని చక్క దిధ్దడానికై పూనుకున్నామని, అందులో భాగం గానే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలను ఏకం చేసి, ప్రభుత్వ యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి దిశగా నడిపించుకుంటామని స్థానిక విశ్వకర్మలు దీమా వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు