గవర్నర్ కు విన్నవించిన ద్రావిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు..
హైదరాబాద్, నటి కరాటే కళ్యాణి సభ్యత్వమును మా అసోసియేషన్ సస్పెన్షన్ లో పెట్టడం అన్యాయమని గవర్నర్ కు విన్నవించారు ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు. ఖమ్మం పట్టణం లకారం చెరువులో శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో రాజకీయ నాయకుల శిలా విగ్రహం పెట్టడం సరైనది కాదని ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం తెలిపిందన్నారు. దీనిపై మా అసోసియేషన్ ఆమెకు షోకాస్ నోటీసు జారీచేసి, ఆమె సభ్యత్వాన్ని సస్పెన్షన్ లో పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఈ విషయంపై తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్రాజన్ కు వినతిపత్రాన్నిఅందజేశామన్నారు. స్వర్గీయ ఎన్.టి.రామారావు మహానటుడుగా, మంచి రాజకీయ నాయకుడిగా అందరి మన్నలను పొందారని అటువంటి మహానటుని శిలా విగ్రహాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాఎవరూ ఆక్షేపించలేదన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయడం తగదని కరాటే కళ్యాణి అన్నారే తప్ప ఎవరిని విమర్శించలేదన్నారు. గతంలో సినీ నటులు పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్ ఎన్ని విమర్శలు చేసినా, మోహన్ బాబు షూటింగ్ సమయంలో సహనటులపై చేయి చేసుకున్నా, దూషించినా, ఎన్టీ రామారావుని కించపరుస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తీసినా.. ఎటువంటి చర్యలు తీసుకోని మా అసోసియేషన్ బడుగు, బలహీణ వర్గాలకు చెందిన కరాటే కళ్యాణికి మాత్రమే నోటీసులు జారీ చేయటం విచారకరమన్నారు. ఆమెను మా అసోసియేషన్ సభ్యత్వాన్ని సస్పెన్షన్ లో ఉంచటం అన్యాయమన్నారు. అంతే కాకుండా కొంత మంది సంఘ విద్రోహులు కరాటే కళ్యాణి నటించే సినిమాల సన్నివేశాలను జుగుప్సాకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం అవివేకమన్నారు. ఆమెకు ఫోన్లు చేసి దుర్భాషలాడుతున్న వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోనందున గవర్నర్ కలగజేసుకొని చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరామన్నారు. మా అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్నిపునరుద్ధరించటానికి సహాయం చేయాలని కృష్ణారావు విజ్ఞప్తి చేసారు.