Tuesday, May 7, 2024

ఏ బిడ్డా ఇది జూపల్లి అడ్డా ..

తప్పక చదవండి
  • కొల్లాపూర్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జూపల్లి..
  • కొల్లాపూర్ అంటే జూపల్లి అని గుర్తొచ్చేలా బ్రాండ్ కైవసం..
  • స్థానిక ఎమ్మెల్యే తీరుకు నిరసనగా కారు దిగిన జూపల్లి..
  • జూపల్లి చేరికతో తెలంగాణ కాంగ్రేసులో అయోమయ పరిస్థితి..
  • పార్టీని నమ్ముకున్నోళ్లు ఎటు తేల్చుకోలేకపోతున్న వైనం..
  • జూపల్లి రాకతో కాంగ్రేసు ఆశావహులు పార్టీ మారే ఛాన్స్..
  • కొల్లాపూర్ లో శ్రీశైలం భూ నిర్వాసితుల 99జీవో..పెండింగ్..
  • పార్టీ మారిన నాయకులతో రసవత్తరంగా కొల్లాపూర్ రాజకీయం..

‘వాసు’ పొలిటికల్ కరస్పాండెంట్

కొల్లాపూర్ రాజకీయాల్లో ఎటు చూసినా సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా జూపల్లి కనబడుతున్నారు. రెండు దశాబ్దాలుగా కొల్లాపూర్ అంటే జూపల్లి.. జూపల్లి అంటే కొల్లాపూర్ అనేలా బ్రాండ్ ను కైవసం చేసుకున్న ఆయన స్థానిక ఎమ్మెల్యే తీరుకు నిరసనగా కారు దిగిపోయారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హర్షవర్ధన్ రెడ్డి.. ఈసారి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగడం పక్కా అయినప్పటికీ.. ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా నిలబబోతున్న జూపల్లి.. కాంగ్రేసు నుంచి బరిలోకి దిగుతారన్న చర్చ .. నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అయితే ఆయన చేరబోయే పార్టీలో.. ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితేంటన్న ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిది.? జూపల్లి కాంగ్రేసులో చేరితే ఇప్పటికే పార్టీని నమ్ముకున్న వారు మరో పార్టీ చూసుకుంటారా లేక జూపల్లితో సర్దుకుపోతారా అన్నది తేలాల్సివుంది. ఇవే..

- Advertisement -

ఇప్పుడు కొల్లాపూర్ రాజకీయాల్లో హీట్ ను పెంచుతున్నాయి. దాంతో.. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో అర్థం కాని పరిస్థితి.. కొల్లాపూర్‌లో నెలకొంది.

రాజకీయంగా దూకుడు పెంచిన జూపల్లి :
బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు తర్వాత.. జూపల్లి రాజకీయంగా దూకుడు పెంచారు. ఆయన దూకుడును చూసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాయి కూడా. అయినా జూపల్లి కాంగ్రేసులోకి వెళ్ళడానికె మొగ్గుచూపారు. ఈ మేరకు ఆయన 30 న ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రేసు పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. జూపల్లి కాంగ్రేసులో చేరిన తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి మధ్య ఇప్పటికే నెలకొన్న ఆధిపత్య పోరు.. ఇప్పుడు రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో.. కొల్లాపూర్ పై.. బీఆర్ఎస్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది.

కొల్లాపూర్ రాజకీయాలు డిఫరెంట్ :
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లోని రాజకీయాలు ఒకలా ఉంటే కొల్లాపూర్ నియోజకవర్గం రాజకీయాలు మరోలా ఉంటాయి. 1952లో ఏర్పడిన కొల్లాపూర్ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి . ఇందులో.. అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. రెండుసార్లు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. గతంలో.. ఐదు మండలాలున్న కొల్లాపూర్లో ఇప్పుడు కొత్తగా మరో రెండు మండలాలు వచ్చి చేరాయి. ఇప్పుడు.. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పానగల్, కోడేర్, వీపనగండ్ల, పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాలున్నాయి. వీటిలో.. నాలుగు మండలాలు నాగర్ కర్నూలు జిల్లాలోనూ.. మిగతా మూడు వనపర్తి జిల్లాలోనూ ఉంటాయి.

శ్రీశైలం భూ నిర్వాసితులకు సంబంధించిన 99జీవో..పెండింగ్ :
కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తంగా 2 లక్షల 50 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇందులో.. యాదవ, కురుమ, గౌడ, ఎస్సీ సామాజికవర్గాల ఓటర్లే అధికంగా ఉంటారు. కానీ.. ఇక్కడి అభ్యర్థుల గెలుపోటముల్లో మాత్రం వెలమ సామాజికవర్గం కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. దాంతో.. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది.. వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలే ఉన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండే కొల్లాపూర్ నియోజకవర్గం.. సోమశిల అందాలతో అందరినీ ఆకర్షించేలా ఉంటుంది. చారిత్రక కట్టడాలు, కవులు, కళాకారులకు.. ఈ నియోజకవర్గం పుట్టినిల్లులాంటిదని చెప్పొచ్చు. ప్రధానంగా.. కొల్లాపూర్ సెగ్మెంట్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న శ్రీశైలం భూ నిర్వాసితులకు సంబంధించిన 99జీవో.. ప్రతి ఎన్నికల్లో హామీగా నిలుస్తుంది. కానీ.. అది ఎవరూ అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి..

ఎవ్వరు వచ్చిన జూపల్లి సెంటర్ పాయింట్ :
కొల్లాపూర్ నియోజకవర్గానికి రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా సెంటర్ పాయింట్గా ఉన్నది మాత్రం జూపల్లి కృష్ణారావే అని చెప్పక తప్పదు. వరుసగా.. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జూపల్లి ఒకసారి స్వతంత్రంగా, రెండు సార్లు కాంగ్రెస్ నుంచి.. మరో రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు .

మారిన రాజకీయ పరిణామాలతో..:
అనూహ్య పరిస్థితులలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి కూడా కారెక్కేయడంతో.. గులాబీదళంలో గ్రూపు రాజకీయాలకు బీజం పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఒకే పార్టీలో ఉంటూనే.. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడంతో.. లోకల్ పాలిటిక్స్లో హీట్ పెరుగుతూ వచ్చింది. గత మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్సెస్ బిఆర్ఎస్ పార్టీగా కొల్లాపూర్ ఎన్నికలు జరిగాయి. కారు పార్టీలోనే ఉండి సొంతంగా 11 డివిజన్లలో జూపల్లి వర్గీయులు గెలవగా.. బీఆర్ఎస్ 9 డివిజన్లకే పరిమితమైంది. దాంతో.. నియోజకవర్గంలో కారు పార్టీ రాజకీయం రోడ్డున పడింది. దాన్ని చల్లార్చేందుకు.. స్వయంగా కేటీఆరే రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది.

ఇద్దరి మధ్యే టికెట్ పోరు..:
కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దాంతో.. ఆ పార్టీ టికెట్ కోసం ఇప్పటికే సీనియర్ నేత జగదీశ్వరరావు, యువనేత అభిలాష్ రావు పోటీపడుతున్నారు. టికెట్ తమకేనని.. ఇద్దరు నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే.. వీళ్లిద్దరి మధ్య టికెట్ పోరు హోరాహోరీగా సాగుతుంటే.. ఇప్పుడు జూపల్లి ఎపిసోడ్ కాంగ్రెస్ నేతలను మింగుడుపడని అంశంగా తయారయ్యింది. ఆయన గనక హస్తం పార్టీలో చేరితే.. కాంగ్రెస్ టికెట్ జూపల్లికే కన్ఫామ్ అవుతుంది. అదే జరిగితే.. తమ రాజకీయ భవిష్యత్ ఏమిటనే ఆందోళన జగదీశ్వర్ రావు, అభిలాష్ రావులో నెలకొంది. ఒకవేళ జూపల్లి గనక కాంగ్రెస్లో చేరి.. ఆయనకే టికెట్ ఇస్తే.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే చర్చ సాగుతోంది. అలా.. కాంగ్రెస్ని వీడిన నేత తీసుకోబోయే నిర్ణయం కూడా రానున్న ఎన్నికల్లో.. కొల్లాపూర్ ఎమ్మెల్యే గెలుపులో కీలకంగా మారనుందనే వాదన కూడా వినిపిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు