Wednesday, May 22, 2024

ఆలయంలో అపశృతి..

తప్పక చదవండి
  • తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద దుర్ఘటన..
  • ఒక్కసారిగా కుప్పకూలిన ఏళ్ల నాటి రావి చెట్టు..
  • అటు మైకుల్లో మంత్రోచ్ఛారణలు..
    ఇటు మిన్నంటిన బాధితుల రోదనలు

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ముందు ఎన్నో ఏళ్లుగా నిటారుగా నిలబడి ఎంతో మంది భక్తులకు చల్లని నీడనిచ్చిన వృక్షం (రావి చెట్టు) ఒక్కసారిగా కూలిపోయి మృత్యుపాశమైంది. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.. చెట్టు విరిగిపోయి కూలడంతో పలువురు భక్తులు దానికింద చిక్కుకొని గాయపడగా.. వారిలో ఒకరు మృతి చెందారు. చెట్టుకొమ్మ నేరుగా తలపై పడటంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలిలో మృతుడి బంధువుల రోదనలు.. ఆలయం పరిసరాల్లోని మైకుల నుంచి వినిపిస్తున్న వేద మంత్రోచ్ఛారణల కంటే పెద్దగా వినిపించాయి. ఆ విషాద దృశ్యం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.

వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది చెట్టు కొమ్మలను పక్కకు తొలగించి, గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రావి చెట్టు వందల ఏళ్ల నాటిదని భక్తులు చెబుతున్నారు. యంత్రాల సాయంతో చెట్టు కొమ్మలను కోసి, అక్కడ నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని కడపకు చెందిన డాక్టర్‌ గుర్రప్ప (70)గా గుర్తించారు. గతంలో ఆయన స్విమ్స్‌లో డాక్టర్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నారు. తిరుపతి స్విమ్స్‌లో మెడిసిన్‌ చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చి ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వారం రోజులుగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో చెట్టు సమీపంలో భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు కూలితే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. గురువారం ఉదయం నుంచి తిరుపతిలో ఎండ ఎక్కువగా ఉంది. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద ఎత్తున గాలులు వీచాయి. దీంతో ఆలయం బయట ఉన్న ఈ భారీ చెట్టు కూలిపోయింది. వందల ఏళ్లుగా ఎన్నో గాలి వానలను తట్టుకొని నిలిచిన చెట్టు.. ఒక్కసారిగా కూలిపోవడం ఆలయ సిబ్బందిని ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాచెల్లిస్తామన్న టీటీడీ చైర్మన్ :
ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గాలివాన కారణంగా గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని రావిచెట్టు పడిపోయిందని టీటీడీ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్ప మృతి చెందారని వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఇది చాలా బాధకరమైన ఘటన. ఆ కుటుంబానికి జరిగిన లోటును భర్తీ చేయలేం. కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు, మరొకరికి తలకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. మరో ఇద్దరు భక్తులు గాయపడ్డారని వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

చంద్రగిరిలో కూలిన రెండు వృక్షాలు ముగ్గురికి గాయాలు :
అటు చంద్రగిరిలోనూ ఈదురు గాలులకు రెండు భారీ వృక్షాలు నేలకూలాయి. లైబ్రరీ, బాయ్స్ స్కూల్ దగ్గర భారీ వృక్షాలు కూలాయి. ఒకటి ఆటోపై, మరొకటి జ్యూస్ బండిపై పడ్డాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు