Sunday, June 23, 2024

బీజేపీలోనే కొనసాగుతా

తప్పక చదవండి
  • కేసీఆర్‌కు ఓటు వేయొద్దు.. బీజేపీయే గెలుస్తుంది
  • ఇంటింటికి, వాడవాడకు బీజేపీని తీసుకు వెళ్తా
  • కేసీఆర్‌ అబద్ధపు ప్రచారాలు చేయవద్దని హితవు
  • ముదిరాజ్‌లకు ఆస్తులు, అంతస్తులు లేకున్నా ఆత్మగౌరవముంది
  • కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన లేదని అర్థమైంది
  • సంచలనంగా ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు

జమ్మికుంట రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు, చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్‌పై గత 15రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా రాజేందర్‌ బీజేపీ పార్టీని వీడుతారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశం అనంతరం ఈటల రాజేందర్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కొంత అసహనం, అసంతృప్తితో మాట్లాడడం, నాగర్‌ కర్నూల్‌ నడ్డా సభకు హాజరు కాక పోవడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. కాగా, మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో ఈ పార్టీ గెలుస్తుంది.. ఆ పార్టీ గెలుస్తుందని అంటున్నారని.. కానీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఎక్కువగా గెలుస్తోందని ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలో ఇంటింటికి, వాడవాడకు బీజేపీని తీసుకు వెళ్తామన్నారు. బీజేపీపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రజల ఆశీర్వాదంతో కమలం పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కు డిపాజిట్‌ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈసారి కేసీఆర్‌ కు ఓటువేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ఇప్పటికైనా భూమి మీదకు రావాలని, మీడియాను, పేపర్‌ ను దగ్గర పెట్టుకొని అబద్ధపు ప్రచారాలు చేయవద్దని సూచించారు. కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన లేదని సామాన్య ప్రజలకు కూడా అర్థమైందన్నారు. అందుకే ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలని నిర్ణయానికి వచ్చారన్నారు. తనకు పోలీసుల రక్షణ కంటే ప్రజల రక్షణే ఉందన్నారు. ధరణి వచ్చాక పేదల భూములు మాయమవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ కు ధరణి డబ్బుల పంటను పండిరచిందన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ధరణి వచ్చాక బ్రోకర్లు బాగా పెరిగిపోయారని, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలపై దౌర్జన్యం పెరుగుతోందన్నారు.
ఈటల రాజేందర్‌ గత 2021లో నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ పార్టీలో చేరి ఉప ఎన్నికలో హుజురాబాద్‌ నియోజక వర్గం నుండి అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2మార్లు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ శాసన సభ పక్షనేతగా 10యేళ్ళ పాటు వ్యవహరించారు. టిఆర్‌ఎస్‌ పార్టీలో ఆకస్మికంగా తలెత్తిన రాజకీయ విభేదాల కారణంగా సిఎం కెసిఆర్‌ ఆగ్రహానికి గురయ్యారు. అదే సమయంలో రాజేందర్‌ నిరుపేదలకు కేటాయించిన, ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు కబ్జ్జా చేశారని, బెదిరించి, భయ పెట్టి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశాడని ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్‌ ఈటలను మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేసిన మీదట కేసులు నమోదయ్యాయి. అవమానంగా భావించిన ఈటల రాజేందర్‌ టీిఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పి బిజెపి పార్టీలో చేరి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బిజెపి పార్టీ నుండి సిఎం అభ్యర్థి అవుతారని, రాష్ట్ర అధ్యక్ష పదవీ వర్తిస్తుందని రాజేందర్‌ వర్గం మొదటి నుండి భావిస్తోంది. బిజెపి పార్టీలో ప్రాధాన్యంతో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవీ దక్కలేదని కొంత కాలంగా ఈటల అనుచరులు, అభిమానులు బిజెపి పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ బీజేపీ పార్టీలోని అసంతృప్తి లీడర్లతో కలిసి పార్టీ హైకమాండ్‌ను కలిశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్‌ తగ్గు తోందని, బిజెపి నుండి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఈటల అభిమానులు, అనుచరులు రాజేందర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్న నేపథ్యంలో ఈటల రాజేందర్‌ ఏర్పాటు చేయనున్న మీడియా సమావేశం ప్రాధాన్యం సంత రించుకుంది. బీజేపీ పార్టీలోనే కొనసాగుతారా, లేక కాంగ్రెస్‌ గడప తొక్కుతారా అంటూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరిగే ప్రచారానికి ఈటల రాజేందర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పికె రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మీదట తాను భవిష్యత్తులో బిజెపి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు