- తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీలు
- రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారిగా లోకేష్ కుమార్
- ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ముషారఫ్ అలీ
ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త కమిషనర్ ను నియమించింది. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లోకేశ్ కుమార్ ను బదలీ చేసింది ప్రభుత్వం… ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్ కు అప్పగించింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. సర్ఫరాజ్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వెయిటింగ్‌లో ఉన్న ముషారఫ్ అలీ ఫారుఖీని ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. పది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల అధికారుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. పర్యటనలో భాగంగా సీఎస్, డీజీపీ, ఇన్‌కం ట్యాక్స్, ఇతరశాఖలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అందులో భాగంగా.. సీనియర్ ఐఏఎస్ అధికారి లోకేశ్ కుమార్‌ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించింది. ఈసీ ఆదేశాల మేరకు ఆయన్ను ఎన్నికల విధుల్లోకి బదిలీ చేస్తూ.. జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్‌గా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రోస్‌కు బాధ్యతలు అప్పగించారు.