- పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు సిద్దం..
- నా పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు సహకారం
- అనేక భావజాలాలకి పుట్టినిల్లు ఖమ్మం జిల్లా
- మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా అంటే అనేక భావజాలాలకు పుట్టినిల్లు లాంటిది. నేతలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు సిద్దంగా ఉన్నారని భట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీకి మేలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే రాహుల్ బీఆర్ఎస్ ను బీజేపీ బీ టీమ్ గా పేర్కొన్నారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీకి మేలు చేస్తుందన్నారు.
పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి హాజరైన అఖిలేష్ యాదవ్ ను హైదరాబాద్ కు కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడారన్నారు. బీజేపీయేతర ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇందుకు అఖిలేష్ యాదవ్ ను హైదరాబాద్ కు పిలిపించుకొని మాట్లాడడమే నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. మోడీ సర్కార్ మేలు కోసమే అఖిలేష్ యాదవ్ తో కేసీఆర్ భేటీ అయ్యారని ఆయన విమర్శించారు. బీజేపీతో ఎప్పుడూ కలవకుండా ఉన్న పార్టీ కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అదనంగా ఒక్క ఎకరానికి కూడ నీరివ్వలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీరిచ్చామని తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తే ఇందిరా, రాజీవ్ సాగర్ ల నుండి నీరు లభ్యమయ్యేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. రీ డిజైన్ అంటూ రూ. 25 వేల కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచి ఒక్క చుక్కనీరివ్వలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. జన గర్జన సభకు వచ్చే వాహనాలు అడ్డుకునే ప్రయత్నం చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడ సభకు భారీగా జనం వచ్చారన్నారు. తమ సభకు అనుమతి ఉన్నా కుట్రపూరితంగా అడ్డుకొనే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నేతలపై భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. తన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు సహకరించారన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల స్పూర్తి తన పాదయాత్రకు దిక్సూచిగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ నియంత ధోరణితో పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు.