- ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలు..
- ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై విచారణ..
- షార్ట్ షార్క్యూట్ వల్లే ప్రమాదమన్న అధికారులు..
- సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు..
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం తనిఖీలు ముగిశాయి. శనివారం బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ బృందం.. మంటల్లో కాలిపోయిన బోగీలను పరిశీలించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. ఎస్ 4 బోగీలోని బాత్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే మంటలు చెలరేగి వుంటాయని అధికారులు భావిస్తున్నారు. కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య శుక్రవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 7 బోగీల వరకు కాలిబూడిదయ్యాయి. అధికారులు, ప్రయాణీకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటా, ప్రయాణీకుల నిర్లక్ష్యమా, విద్రోహ కోణమా అంటూ పెద్ద చర్చ జరుగుతోంది. పగటిపూట మంటలు వ్యాపించడం, ప్రయాణీకులు, అధికారులు అప్రమత్తంగా వుండటంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. అదే రాత్రి సమయంలో ప్రమాదం జరిగివుంటే దానిని ఊహించడానికే భయంగా వుంది.
కాగా.. హౌరా – సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. లోకోపైలట్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ జీఆర్‌పీ స్టేషన్‌లో కేసు నమోదైంది. అగ్నిప్రమాదం జరిగిందని కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత సెక్షన్లు మారుస్తామని అధికారులు చెబుతున్నారు.