Monday, October 14, 2024
spot_img

మాన్‌సూన్‌ రెగట్టాలో ధరణి ` మల్లేష్‌, దీక్షితకు స్వర్ణాలు

తప్పక చదవండి

7 బంగారు, 6 రజతాలు, 3 కాంస్యాలు గెలిచిన తెలంగాణ సెయిలర్లు
హైదరాబాద్‌ : మాన్‌సూన్‌ రెగట్టా జాతీయ ర్యాంకింగ్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ చివరి రేసుల్లో అద్భుతంగా పోరాడిన తెలంగాణకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ధరణి లావేటి, దీక్షిత కొమరవెల్లి బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. అండర్‌ 19 ఇంటర్నేషనల్‌ క్లాస్‌ మిక్స్‌డ్‌ విభాగంలో ధరణి లావేటి- మల్లేష్‌ వడ్ల జంట ఆదివారం జరిగిన చివరి రేసులో నేరుగా విజయం సాధించి స్వర్ణం సాధించింది. అండర్‌19 ఇంటర్నేషనల్‌ 420 క్లాస్‌ మిక్స్‌డ్‌ విభాగంలో జాతీయ ఛాంపియన్లుగా నిలిచింది. ఇక, అండర్‌-15 ఆప్టిమిస్ట్‌ బాలికల విభాగంలో దీక్షిత కొమరవెల్లికి గట్టి పోటీ ఎదురైనప్పటికీ చివరి రేసులో 5వ స్థానం సాధించిన ఆమె సమీప ప్రత్యర్థిపై ఒక్క పాయింట్‌ తేడాతో గెలిచింది. దాంతో, సికింద్రాబాద్‌ క్లబ్‌ రెగట్టా తర్వాత ఈ జాతీయ ర్యాంకింగ్‌ ఈవెంట్‌లో మరో స్వర్ణం సాధించింది. బాలుర విభాగంలో శనివారమే స్వర్ణం ఖాయం చేసుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాతం 12వ రేసులో మరో స్పష్టమైన విజయంతో తన విజయాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఎన్‌బిఎస్‌సి గోవాకు చెందిన శరణ్య జాదవ్‌, అజయ్‌ గజ్జి వరుసగా రజతం, కాంస్యం సాధించారు. పోటీల తర్వాత మాట్లాడిన దీక్షిత ముంబై జరగబోయే తదుపరి నేషనల్స్‌ లో గెలవాలని ప్రణాళిక రచిస్తున్నానని, అందుకోసం వారంలో ప్రాక్టీస్‌ ప్రారంభిస్తానని చెప్పింది. దీక్షిత, ధరణి ఈ స్థాయి ప్రదర్శనను కొనసాగిస్తే జాతీయ జట్టులో ఇద్దరికీ స్థానం ఖాయమే అనొచ్చు. ఇక ఈ టోర్నీలో అన్ని విభాగాల్లో కలిపి తెలంగాణ సెయిలర్లు ఏడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచారు. దీనిపై తెలంగాణ సెయిలింగ్‌ సంఘం అద్యక్షుడు డాడీ భోటే సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సెయిలర్లు చాలా నెలల పాటు కష్టపడి ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించారన్నారు. అంతకుముందు సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌, వీఎస్‌ఎమ్‌ ఆర్టి సారిన్‌ చివరి రేసును జెండా ఊపి ప్రారంభించారు. యువ నావికులతో విలువైన సమయాన్ని వెచ్చించారు. కఠోర శ్రమ, నిబద్ధత, పట్టుదల మాత్రమే పతకాలు గెలుచుకునే ప్రదర్శనలకు దారితీస్తాయంటూ ఆమె వారిని ప్రోత్సహించారు. సంజీవయ్య పార్క్‌ నెక్లెస్‌ రోడ్‌లోని యాచ్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రాంగణంలో బహుమతి ప్రదానోత్సవానికి ఆమెతోపాటు ఏవీఎస్‌ఎమ్‌, వీఎస్‌ఎమ్‌ పర్సనల్‌ ఇండియన్‌ నేవీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
మాన్‌సూన్‌ రెగట్టా 2023 తుది ఫలితాలు.. అండర్‌ 19 ఇంటర్నేషనల్‌ క్లాస్‌ 1. ధరణి లావేటి-వడ్ల మల్లేష్‌ (తెలంగాణ/ఎన్‌బీఎస్‌సీ గోవా) 17 పాయింట్లు 2. నాన్సీ రాయ్‌ – అనిరాజ్‌ సెంధవ్‌ (మధ్యప్రదేశ్‌) 20 పాయింట్లు 3. విద్యాన్షి మిశ్రా – మనీష్‌ శర్మ (మధ్యప్రదేశ్‌) 33 పాయింట్లు
అండర్‌ 15 ఆప్టిమిస్ట్‌ క్లాస్‌ బాలురు..1. ఏకలవ్య బాతం (మధ్యప్రదేశ్‌) 16 పాయింట్లు 2. శరణ్య యాదవ్‌ (ఎన్‌బీఎస్‌సీ గోవా) 29 పాయింట్లు 3. అజయ్‌ గజ్జి (ఎన్‌బీఎస్‌సీ గోవా) 47 పాయింట్లు
అండర్‌ 15 ఆప్టిమిస్ట్‌ క్లాస్‌ బాలికలు..1. దీక్షిత కొమరవెల్లి (తెలంగాణ) 57 పాయింట్లు 2. షగున్‌ రaా (మధ్యప్రదేశ్‌) 58 పాయింట్లు 3. ఆర్తి వర్మ (సీఈఎస్‌సీ మహారాష్ట్ర) 156 పాయింట్లు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు