పోడు రైతుల గోసకు పరిష్కారమేది?
అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 నాటికి పోడు సేద్యం చేస్తున్న రైతులందరికీ పట్టా హక్కులు కల్పంచాల్సి వుండగా కొద్ది మందికి మాత్రమే తూతూ మంత్రంగా పట్టాలిచ్చి గత పాలకులు చేతులు దులుపుకొన్నారు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి KCR పోడు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం నాటికి పోడు సేద్యం చేసుకొంటున్న వారందరికీ పట్టాలిస్తామని హామీ యిచ్చాడు.ప్రతి ఎన్నికల సందర్భంగా పోడు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,త్వరలోనే పోడు సమస్యను పరిష్కరిస్తానని ప్రకటనలు చేశాడు.KCR పోడు రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకోక పోగా గత పాలకులను తలదన్నే విధంగా పోడు రైతులను ఇబ్బందులకు గురి చేశారు. ఫారెస్టువారిని ఉసిగొలిపి ఆదివాసీల పోడు భూములలో కందకాలు తవ్వటం, పంట బోర్లను, కరెంటు లైన్లను పీకేయటం, వారి పంటలను యంత్రాలతో ద్వంసం చేయటం, వారిని బలవంతంగా భూముల నుండి వెళ్ళగొట్టి ఆ భూములలో హరిత హారం మొక్కలు పెట్టించటం లాంటి విద్వంసకర చర్యలకు పాల్పడ్డారు.ఒకవైపు పట్టాలిస్తామంటూనే వేలాది ఎకరాల సాగు భూములను ఫారెస్టు వారు గుంజుకొన్నారు.జీవనాధారాన్ని కోల్పోయిన అనేకమంది ఆదివాసీ పోడురైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాల పరిధిలో పోడు రైతుల పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారింది. దీనిపై పోడు రైతులు, విప్లవ సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా ఇరకాటంలో పడిన రాష్ట్ర ప్రభుత్వం 2021 నవంబర్ 8 నుండి పోడు రైతుల నుండి ఆప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం పెట్టిన నెలరోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాపితంగా 2845గ్రామాల నుండి 4 లక్షల 14వేల 353 మంది పోడు రైతులు 12 లక్షల 46 వేల 846 ఎకరాల పోడు భూమిపై పట్టా హక్కుల కోసం అప్లికేషన్లు పెట్టుకొన్నారు.దరఖాస్తులు స్వీకరణ తర్వాత వాటిని మూలన పడేసి పోడు రైతులపై దమనకాండను యధావిధిగా కొనసాగించారు. దీనిపై ఇప్పటి దాకా తేల్చకుండా పరిస్థితి తీవ్ర రూపం దాల్చినప్పుడు చల్లబరచడానికి ఇదిగో ఇస్తాం అదిగో యిస్తాం అంటూ ముహూర్తాలు పెడుతూ సాగదీశారు. ఈసంవత్సరం ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా 11.50 లక్షలఎకరాలకు పోడు పట్టాలిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించాడు.ఆసందర్భంగా ఇకనుండి అడవి నరకబోమని లబ్ధిదారులు,ప్రజాప్రతినిధులు రాతపూర్వకంగా హామీ యివ్వాలనికూడా మాట్లాడాడు.అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఎప్పుడెప్పుడు అమలులోకి వస్తుందా పోడు రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తుండగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇప్పుడు ఎన్నికల కోసం ప్రకటిస్తున్న తాయిలాలలో భాగంగా జూన్ 24 నుండి 30 వరకు పోడు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.ఇప్పటిదాకా ఊరించి ఉసూరుమనిపించినట్లుగా అదికూడా 1లక్షా 55వేల 393 మందికి 4 లక్షల 90౩ ఎకరాల భూమికి మాత్రమే పట్టాలిస్తామని చెపుతున్నారు.దీని వలన అప్లికేషన్లు పెట్టుకొన్నవారిలో ఒక వంతు మందికి పట్టాలు లభిస్తే రెండొంతుల మందికి పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది.రాష్ట్ర ప్రభుత్వం పోడురైతుల నుండి పట్టాలకోసం దరఖాస్తులు తీసుకొన్న తర్వాత కూడా పోడు రైతులపై ఫారెస్టు వారి దాడులు ఆగలేదు.దరఖాస్తులు పెట్టుకొన్నవారి భూములలో కూడా కందకాలు తవ్వి,పైర్ల విద్వంసానికి పాల్పడ్డారు. ఇప్పుడు కొద్దిమందికి పట్టాలిచ్చిన తర్వాత మిగిలిన 8,46,000 ఎకరాలలో సేద్యం చేసుకొంటున్న పోడురైతుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనున్నది.పట్టాల ప్రక్రియ నడుస్తున్నందున కొంత వెనకాముందాడిన ఫారెస్ట్ అధికారులు ఇకనుండి వారిని భూముల దరిదాపులకు రానివ్వకుండా తరుముతారనటంలో సందేహం లేదు.పోడు జీవనాధారంగా బ్రతుకుతున్న వీరికి భరోసా ఇవ్వాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వానికుంది.కాని వీరిని ఏనాడు పట్టించుకొన్న పాపాన పోలేదు.అప్పుడప్పుడు ఊరడింపు మాటలు తప్ప ఇప్పటిదాకా చేసిందేమీ లేదు.KCR చెపుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదు. అటవీ హక్కుల చట్టాన్ని పక్కన పెట్టి పోడు భూములపై పూటకో మాట మాట్లాడుతున్నాడు.పట్టాలిచ్చినా అటవీ భూములపై ఫలసాయం అనుభవించటం తప్ప వారికి ఎలాంటి హక్కులు ఉండబోవని,ఆభూములపై ప్రభుత్వానికే అన్ని హక్కులుంటాయని మాట్లాడుతున్నాడు.పట్టాలు పొందటానికి అటవీహక్కుల చట్టం నిర్ధేశించిన మార్గదర్శకాలను,నిబంధనలను పక్కన పెట్టి ఫారెస్టు శాఖ వారికి అధికారాలు కట్టబెట్టాడు.గిరిజన శాఖామంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన నలుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని వేశాడు.జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సలహా కమిటీలను వేశాడు.అటవీహక్కుల గుర్తింపు చట్టంలో ఎక్కడా అవకాశం లేకపోయినా తమ పార్టీ ప్రజాప్రతినిధులకు పట్టాల పంపిణీలో స్థానం కల్పించాడు.దీని వలన పోడు పట్టాల ఎంపికలో రాజకీయ జోక్యానికి అవకాశం కలిగింది. గ్రామాలలో అధికార పార్టీ కార్యకర్తలు పోడురైతులను భయపెట్టి లొంగదీసుకోవటం,ప్రలోభాలకు గురిచేయటంతో పాటు పట్టాలిప్పిస్తామని వారి వద్ద చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు.అటవీహక్కుల చట్టం నిర్దేశించిన నిబంధనలను కేసీఆర్ ప్రభుత్వం పాటించటంలేదు. చట్టం ప్రకారం పట్టాలిస్తున్న వారి లిస్టును గ్రామ సభ ముందు పెట్టటం, తిరస్కరించిన వారి క్లెయిమ్ లను దరఖాస్తు దారులకు తెలియచేయటం లాంటి వేమీఅధికారులు చేయటం లేదు. ప్రభుత్వ ఆదేశాల వల్లనే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున పట్టాలు రాని వారిని ఊరడించడానికి ఇది మొదటి దఫా మాత్రమేనని మిగతా వాటికి కూడా తర్వాత పట్టాలిస్తామని నమ్మబలుకుతున్నారు.ఈమాటల్లో ఎంతమాత్రం నిజాయితీ లేదు.అసలు గిరిజనులకు,ఆదివాసీలకున్న రాజ్యాంగ రక్షణలను, హక్కులను కూడా ఆయన గుర్తించ నిరాకరిస్తున్నాడు.మొదటి నుండీ పోడు రైతులు,కౌలు రైతుల ఎడల KCR వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు.వారిని రైతులుగా గుర్తించటానికే ఆయన సిద్ధంగా లేరు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం గణనీయమైన సంఖ్యలో సాగుతుందనేది వాస్తవం. పోడు పట్టాలకోసం దరఖాస్తులే దానికి నిదర్శనం. అది నిన్న మొన్న ప్రారంభమైనది కాదు.ఆదివాసీల జీవన విధానంలో అదొక భాగం. దానిని ప్రభుత్వం గుర్తించాలి.పోడు రైతులపై జాలి చూపి కొందరికి పట్టాలివ్వటం సమస్యకు పరిష్కారం చూపదు.పోడు వ్యవసాయాన్ని గుర్తించి దానికి రక్షణ, చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం వుంది.జీవనాధారంగా పోడు వ్యవసాయం చేస్తున్న వారందరికీ పట్టా హక్కులు కల్పించాలి. కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతుల పట్టాల విషయంలో పారదర్శకత పాటించాలి.పోడుపట్టాల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. జీవనాధారం కోసం పోడు సేధ్యం చేసుకొంటున్న రైతులను ఇబ్బందులు పెట్టకుండా ఫారెస్టు వారికి ఖచ్చితమైన ఆదేశాలివ్వాలి. పట్టాలతో నిమిత్తం లేకుండా సేద్యంలో వున్న పోడురైతులందరికి రైతు బందు,బ్యాంకు రుణాలు,పంట నష్ట పరిహారం లాంటి సదుపాయాలను వర్తింపచేయాలి.పోడు పట్టాల పంపిణీకి ముందే ప్రభుత్వం వీటిపై నిర్ధిష్టమైన ప్రకటన చేయాలి. ఇష్టాను సారంగా కొద్ది మందికి పట్టాలిచ్చి మెజారిటీ పోడు రైతులకు అన్యాయం చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలి. పోడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడాలి.తెలంగాణ సమాజం ఆదివాసీ పోడు రైతులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- గౌని ఐలయ్య
అఖిల భారత రైతు – కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి
సెల్: 9490700955