విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం 2022 వ విద్యా సంవత్సరం నుండి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్రం ఘనంగా ప్రకటించింది.ఈ నూతన విధానంలో విద్యాహక్కు చట్టాన్ని మూడు నుంచి 18 ఏండ్ల వరకు విస్తరించడం, ప్రీ ప్రైమరీ విద్య కంపల్సరీ చేయడం, టీచర్ ఎడ్యుకేషన్లను బలోపేతం చేయాలనడం, సెకండరీ విద్యలో కోచింగ్ ప్రభావాన్ని, పరీక్షల ప్రభావాన్ని తగ్గించే ఆలోచనలు, వొకేషనల్ విద్యతో సమైక్యపరచడం, ఉన్నత విద్యలో లిబరల్ ఆర్ట్ కోర్సులకు ప్రాధాన్యం, విద్యకు బడ్జెట్ పెంపు, విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తి గురించిన అంశాలు ఎంతో ముఖ్యమైనవి. ఒక అయిదేళ్ళ కాలంలో దేశంలో విద్యా విధానం సమూలంగా మార్పు చెందుతుందన్న ఆశాభావం కేంద్రం వ్యక్తం చేసింది. కోవిడ్ సంక్షోభంలో సతమతమవుతున్న సమయాన్ని ఇలాంటి కీలక 2020 నూతన విద్యా విధానం పార్లమెంట్‌లో చర్చ లేకుండా ఆమోదింపచేసింది. స్వాతంత్య్రానంతరం అందరికీ సమానంగా విద్యావకాశాలను, వాటి ఫలితాలను అందజేయడంలో ప్రభుత్వాలు వరుసగా వైఫల్యం చెందాయి. అందరికీ విద్య ను ప్రభుత్వం కల్పించాలి, అలాంటిది రాజ్యాంగ నిర్దేశిత బాధ్యత నుంచి ప్రభుత్వాలు క్రమంగా బయట పడడం వలన ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగిపోయింది. విద్యను వ్యాపార కేంద్రాలుగా మార్చి అందని ద్రాక్షగా చేసాయి. దేశంలో నెలకొని వున్న పలు మౌలికమైన సమస్యలు పరిష్కరించకుండా ప్రస్తుతం ఉన్న 10+2+3 నిర్మాణాన్ని 5+3+3+4 మార్చడం, పునర్వ్యవస్థీకరించి ఒక కొత్త బోధనాశాస్త్ర, పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టాలని ఈ విధానం భావిస్తుంది. పిల్లలు ఆరు సంవత్సరాల వయసులో 1వ తరగతి మొదలవుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి మార్పులు పిల్లల సమగ్ర వికాసానికి సంబంధించిన సంస్కరణలలో యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ అయిన ‘డెలర్’ కమిషన్ నివేదిక మార్గదర్శకంగా ఎంచుకోవాలని ఈ విధానం ప్రముఖంగా పేర్కొన్నది. ముఖ్యంగా అయిదవ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలు నేర్పిస్తారు. బోర్డు పరీక్షలు విద్యార్థి సముపార్జించిన జ్ఞానాన్ని పరీక్షించే విధంగా తీర్చి దిద్ది, మూస తరహా పరీక్షలకు స్వస్తి చెబుతారు. పిల్లల రిపోర్ట్ కార్డులలో కేవలం వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలకు కూడా మార్కులు ఇస్తారు. ఐఐటిలలో, ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో ఆర్ట్స్ హ్యుమానిటీస్ కోర్సులు, హ్యుమానిటీస్ విద్యార్థులు సైన్స్, ఇతర వృత్తి విద్యలు నేర్చుకునే విధంగా కోర్సులను ప్రవేశ పెడతారు. అన్ని కాలేజీలలో, ఉన్నత విద్యా సంస్థలలో లిటరేచర్, సంగీతం, తత్వ శాస్త్రం, ఆర్ట్, డాన్స్, థియేటర్, గణితం, ప్యూర్ అప్లైడ్ సైన్సెస్, సోషియాలజీ, స్పోర్ట్స్, ట్రాన్సలేషన్ విభాగాలు ఉండేటట్లు చూస్తారు. అన్ని కాలేజీలకు ఒకే ఒక్క కామన్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహించడం తప్పని సరి కాదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు పరిమితికి మించి ఏ ఉన్నత విద్యా సంస్థ ఎక్కువ వసూలు చేసేందుకు వీలు లేదు. స్థూల జాతీయ ఉత్పత్తిలో 6 శాతం విద్యా రంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీడీపీలో 4.43 శాతం విద్యా రంగానికి కేటాయిస్తున్నారు. ప్రభుత్వ అసమగ్ర విధానాల వలన పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతుంటే కేరళ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో అమలు చేసిన విద్యా విధానం వల్ల ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ విద్యా సంస్థలలో చేరి చదువుకుంటున్నారు. ఎంతో ప్రయోజనకారిగా వున్న కేరళ తరహాలో విద్యా విధానాన్ని ఇతర రాష్ట్రాలలోనూ తీసుకురావాలని ప్రస్తుతం అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి.
- సి.హెచ్. సాయి ప్రతాప్
98808 51898