Saturday, May 18, 2024

బీ.ఆర్.ఎస్. పార్టీ ఒక్కటే రాజకీయ పార్టీ కాదు..

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని గజం రూ.7,500 ధరకు కేటాయించారు
  • తెలుగుదేశం పార్టీకీ 11 ఎకరాల స్థలం గజం రూ.7,500 ధరకు కేటాయించండి.
  • మాతో పాటు అన్నీ పార్టీలకు ఇదే విధంగా కేటాయించండి..
  • ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్..

హైదరాబాద్ : హైదరాబాద్ లోని కోకాపేటలో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ టెన్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని గజం రూ.7,500 ధరకు కేటాయిస్తూ 18 మే 2023న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 05 జూన్ 2023న భారత్ భవన్ నిర్మాణానికి మీరు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ.. దేశ విదేశాల్లో రాజకీయ సామాజిక, ఆర్థిక రంగాల్లో అనుభవజ్ఞులైన గొప్ప మేధావులను, నోబెల్ విజేతలను కూడా పిలిచి రేపటి పౌరులకు ఇక్కడ నిర్మించే భవనంలో నాయకత్వ శిక్షణ ఇప్పిస్తామని, తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ నిర్మించే 15 అంతస్తుల భవనంలో మిని హాల్స్, విశాలమైన సమావేశ మందిరాలు నిర్మిస్తామని, అత్యాధునిక డిజిటల్ లైబ్రరీలు, వసతి కోసం లగ్జరీ గదులను నిర్మిస్తామని తెలిపారు.

తెలుగుదేశం పార్టీకీ కూడా 11 ఎకరాల స్థలం గజం రూ.7,500 ధరకు కేటాయించండి :
బీఆర్ఎస్ పార్టీకి కేటాయించినట్లుగానే తెలుగుదేశం పార్టీకీ 11 ఎకరాల స్థలం గజం రూ.7,500 ధరకు కేటాయించమని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ కు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన మాటలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నవించేది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీకి సైతం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ భవన నిర్మాణానికి గాను కోకాపేటలో గజం రూ. 7,500 లకు 11 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా విన్నవిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు 1980 దశకంలోనే రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించింది. అందుచేత టీడీపీకి 11 ఎకరాల స్థలం గజం రూ.7,500 ధరకు కేటాయించవలసిందిగా కోరడమైనది.

- Advertisement -

రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నింటికీ 11 ఎకరాల భూమిని కేటాయించాలి :
తెలుగుదేశం పార్టీతోపాటు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నింటికీ 11 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఆఫీసు కోసం హైదరాబాద్ జిల్లా, షేక్పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న ఎన్.బీ.టి. నగర్ లో సర్వే నెం. 403/ పి లో ఎకరం భూమిని గజం రూ.100 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా ఆఫీసు కోసం బంజారాహిల్స్లో ఎకరం భూమిని గజం రూ.100 చొప్పున కేటాయించవలసిందిగా కోరుతున్నామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు :
16 ఆగస్టు 2018 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపుల కోసం జీవో నెం.167 ను విడుదల చేసింది. దీని ప్రకారం గజం రూ.100 చొప్పున ఎకరం స్థలం మించకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భూములు కేటాయించడానికి ఈ జీవో నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత 27 జూలై 2018 న జరిగిన కేబినెట్ సమావేశంలో రూ.100 గజం చొప్పున (టీఆర్ఎస్) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి జిల్లా కేంద్రాలలో ఎకరాకు మించకుండా భూములు కేటాయించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం 33 జిల్లాల్లో గజం రూ.100 చొప్పున బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన స్థలాలను తెలుగుదేశం పార్టీకి సైతం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ జులై, ఆగస్టు నెలలలో 2018 సంవత్సరంలో ఆయా జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేసినా ఇంత వరకు ఒక్క చోట కూడా స్థలం కేటాయించలేదు.

అధికార పార్టకి ఒక న్యాయం ఇతర పార్టీలను మరో న్యాయమా..?
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించి నాలుగు సంవత్సరాలైనా, ఇతర పార్టీలకు స్థలాలు కేటాయించకపోవడం పూర్తిగా అన్యాయం అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో రెండు చోట్లా రాష్ట్రంలో 33 జిల్లాల్లో మీ పార్టీకి స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని మరే పార్టీకి సెంటు స్థలం కూడా కేటాయించకపోవడం పక్షపాత వైఖరితో కూడుకున్నదని అయన పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని పార్టీలను సమదృష్టితో చూడాల్సిన అవసరమున్నదిని ఏ సందర్భముగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజకీయ కార్యకలాపాలు సాగించడం లేదని అన్నీ పార్టీలు రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నాయి కనుక ఇతర పార్టీలకు సైతం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన విధంగానే సత్వరం స్థలాలు కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కోరుతున్నదని కాసాని జ్ఞానేశ్వర్ లేఖలో పేర్కొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు