Saturday, May 18, 2024

వివక్షతలపై బిజేపి శ్రేణులు, మద్ధత్తుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి..

తప్పక చదవండి

తెలంగాణ ఆరు దశాబద్ధాలుగా అనేక అవస్థలు పడిరది. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమం రంంలో పాలకుల దోపిడీకి గురైంది.అనేక సార్లు వివక్షతలతో భంగపడిరది.అనేక అవమానాలను సహనంతో దిగమింగింది. చివరికి కేసిఆర్‌ నాయకత్వంలో, సబ్బండ వర్గాల కలయికతో, శాంతియుతంగా పోరాడి, తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే, కేసిఆర్‌ దార్శనిక నాయకత్వంలో, తన పాలనా దక్షతను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం చేతనే అనేక ప్రశంసలు పొందింది. అనేక రంగాలలో ఇతర రాష్ట్రాలతో పోటీపడి తన పాలనా సమర్ధతను చాటుకుంది. ప్రగతి సాధనలో పెద్ధరాష్షాల ను వెనెక్కునెట్టి ముందుకు దూసుకు పోతుంది.కేంద్ర ప్రభుత్వాన్ని అబ్బుర పరచే అనేక బహుముఖ నిర్మాణాలను చేపట్టింది. అనేక రంగాలలో కేంద్ర ప్రభుత్వం చేతనే అవార్డులు రివార్డులను సాధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై అకారణ ద్వేషం పెంచుకుంది.ఎందుకో కారణం తెలియదు. భారత దేశంలో బిజేపి పాలిత రాష్ట్రాలలో లేని ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం సాధించింది.ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సహించలేని స్థితికి మోది ప్రభుత్వం వచ్చేసింది. కేసిఆర్‌ పై ఉన్న వ్యక్తిగత ద్వేషం రాష్ట్ర ప్రగతిపై కక్ష సాధింపుకు దారితీసింది. వాస్తవానికి,మొదటి నుండి కేసిఆర్‌ మోది ప్రభుత్వంతో ఎంతో సఖ్యతతో మెదిలాడు. అనేక సందర్భాలలో బిజేపి పాలిత రాష్ట్రాలను మించి కేంద్ర ప్రభుత్వ పథకాలకూ, విధానాలకు తన సంపూర్ణ మద్ధత్తును అందించాడు. తెలంగాణ అభివృద్ధికోసం కేంద్రంతో సఖ్యత అవసరం కనుక అత్యంత వినయంగా కేంద్రంతో మెదిలాడు. చివరకు ఇద్దరి మధ్య ఏ విషయంలో చెడిరదో తెలియదు. అయినా, తెలంగాణ ప్రభుత్వ ప్రగతికి,కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఏదో ఒక రూపంలో అడ్డు తగులుతూనే ఉంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశంలో బిజేపేతర రాష్ట్రాలలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిలో అగ్రగామిగా అవతరించడాన్ని కేంద్రానికి నచ్చడం లేదు.అభివృద్ధిలో తెలంగాణ అనితర కాలంలోనే అగ్రస్థానానికి చేరటం , బిజెపి పాలిత రాష్ట్రాలకు అందనంత ఎత్తుకు తెలంగాణ ఎదగటం మోదికి కంటగింపుగా మారింది. అందుకే, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తుంది. కేంద్రానికి బాసటగా ఆర్థికంగా తెలంగాణ నిలుస్తూ ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రుణాలు తక్కవగానే అదుపులోనే ఉన్నాయి. సకాలంలోనే రుణ కిస్తీలు, వడ్డీలు చెల్లిస్తూవున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రుణాలపై నిందెల వేస్తుంది. ఆర్ధిక సంస్థలనుండి యఫ్‌.ఆర్‌.బి.యం. నిభంధనలకు లోబడి రుణం పొందకుండా అనేక కొర్రీలు వేస్తుంది. తెలంగాణకు చట్టబద్ధంగా రావలసిన పన్నులో వాటలో నిధులను సైతం ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తుంది. అద్దం పర్థం లేని కొర్రీలతో అడ్డుపడుతుంది.చివరికి పన్నుల వాటాలోనూ కోత విధిస్తుంది.ఇతర సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చే గ్రాంట్‌-ఇన్‌- ఎయిడ్‌ పరిస్థితి మరింత దయనీయంగా వివక్షత చూపుతుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్‌ తో సహా ఇతర మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు అనేకసార్లు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఢల్లీి పెద్దలకు ధరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం శూన్యం. తెలంగాణ తన ఆ వేదనను కేంద్ర ప్రభుత్వానికి ఎంత గట్టిగా మొరపెట్టుకున్నా కేంద్రం మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్టే’ వ్యవహరిస్తుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ మంత్రులపై, ప్రభుత్వంపై, అధికారులపై అవమాన పరుస్తూ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బిజెపి పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం మాత్రం తన ‘వల్లమాలిన ప్రేమ’ను కురిపిస్తుంది. దేశ ఆర్థిక రంగానికి అన్ని విధాలుగా దన్నుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం పై మాత్రం కేంద్రం చిన్న చూపు చూస్తుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణపై పక్షపాత దోరణితోనే వుంది. తెలంగాణ కు చట్టబద్ధంగా ఇచ్చిన అనేక హామీలను మరిచిపోయింది.తెలంగాణ పై అకారణంగా ద్వేషం పెంచుకుని,నిధుల విషయంలో వివక్షత చూపుతుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ -ఇన్‌- ఏయిడ్‌ రూపంలో రూ. 41,001 కోట్లు అందుతాయి అని రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే కోతలు విధిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో కేవలం రూ.189 కోట్లు మాత్రమే ఇచ్చింది. మే, నెలలో మరింత తగ్గించి పరిమితంగా రూ.101కోట్లు మాత్రమే ఇచ్చింది.అలాగే అక్టోబర్‌ నెలలో కూడా కేవలం రూ. 85 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ సంవత్సరం మార్చి నెలలో రూ.3,768 కోట్లు అందించింది.అలాగే 2022- 23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌ ఇన్‌ ఏయిడ్‌ మొత్తం రూ. 13,087 కోట్లు మాత్రమే. ఇది రాష్ట్ర బడ్జెట్‌ అంచనాల్లో కేవలం 31 శాతానికి సమానం. తెలంగాణ ప్రభుత్వంపై మొదటి నుంచి మోది సర్కార్‌ వివక్షతనే చూపిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.21,720 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఆశించింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2014-15లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కేవలం 6,489 కోట్లు మాత్రమే. ఇది తెలంగాణ బడ్జెట్‌ అంచనాలలో కేవలం 30% గ్రాంట్‌- ఇన్‌- ఎయిడ్‌ మాత్రమే ఇచ్చింది. గత తొమ్మిది సంవత్సరాల్లో కేవలం రెండుసార్లు మాత్రమే అంటే 2019- 20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే తెలంగాణ బడ్జెట్‌ అంచనాలకు తగ్గట్టుగా,కేంద్రం గ్రాంట్‌- ఇన్‌- ఎయిడ్‌ ను ఇచ్చింది. ఆ తరువాత అన్ని ఆర్థిక సంవత్సరాలలో కూడా ఎన్నడూ 35 శాతానికి మించి నిధులు ఇవ్వలేదు.తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమని కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రం అధిక మొత్తంలో నిధులను ఉదారంగా కేటాయిస్తుంది. ప్రత్యేకించి, మోదీ ప్రభుత్వం తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌ కు మాత్రం,ఏటా బడ్జెట్‌ ప్రతిపాదనలకు మించి గ్రాంట్‌- ఇన్‌- ఎయిడ్‌ ను పక్షపాత ధోరణితో ఇస్తుంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ – ఇన్‌- ఎయిడ్‌ రూపంలో రూ.15,989 కోట్ల రూపాయలు వస్తాయని గుజరాత్‌ తన బడ్జెట్లో అంచనా వేస్తే, కేంద్రం మాత్రం ఫిబ్రవరి చివరి నాటికే రూ.17,856 కోట్లను అందించింది.అంటే,ఇది గుజరాత్‌ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 112 శాతానికి సమానం అన్న మాట.అలాగే, గత సంవత్సరం ఇతర బిజేపి పాలిత రాష్ట్రాలైన కర్నాటకకు 81 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌ కు 81శాతం,ఉత్తరాఖండ్‌ కు 66శాతం, మహారాష్ట్రకు 64 శాతం, మధ్యప్రదేశ్‌ కు 59శాతం, త్రిపురకు 58 శాతం బడ్జట్‌ అంచనాలకు తగినట్లుగా నిధులను పంపిణీ చేసింది. కానీ, తెలంగాణ దెగ్గరికి వచ్చేసరికి మోది ప్రభుత్వానికి నిధులు పంపిణీ చేయటానికి చేతులు రావటంలేదు. రాజకీయ కారణాలతో మోది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటుంది. ఈ పక్షపాత, వివక్షతా వైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరాలను పెంచుతుందే తప్పా ఏలాంటి ప్రయోజనం లేదు. ఇప్పటికే ప్రజాస్వామికంగా ఎన్నికైన విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టండం ద్వారా అక్రమ మార్గంలో అధికారంలోకి వచ్చిన బిజేపి దేశవ్యాప్తంగా అపకీర్తిని మూటకట్టుకుంది. అలాగే రాజ్యాంగ బద్ధమైన ఇడి,ఐటి,సిబిఐ వంటి వ్యవస్థలను, సంస్థలను దుర్వినియోగ పరుస్తూ విపక్షాలపై కక్షపూరిత చర్యలు తీసుకోవటం బిజేపి ప్రభుత్వానికి మాయని మచ్చలు చేసింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అలవికాని హామీలు గుప్పిస్తుంది. ఒకవైపు ఉచిత హామీలు ,సంక్షేమ పథకాలు వొద్ధంటూ విపక్ష రాష్ట్రాలకు నీతులు చెబుతూ,తాను ఎన్నికలలో గెలవటానికి మరో వైపు ఉచిత పథకాల హామీలు గుప్పిస్తుంది. ఈ ద్వంధనీతిని ప్రజలు పసికట్టలేరనే భ్రమలో మోది ప్రభుత్వం ఉంది. దేశంలో కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక చట్ట సంస్కరణ చర్యలు ఎందుకు? పత్రికా స్వేచ్ఛపైఆంక్షలెందుకు? అన్నదమ్ములవలే కలసి, మెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు ఎందుకు? జర్నలిస్టులపై, మేధావులపై భౌతిక దాడులు, నిర్భంధాలెందుకు? నిన్న గవర్నర్‌ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్ట్‌ కామెంట్‌ చేయటం బిజేపి ప్రభుత్వానికి అపకీర్తి కాదా? ఎందుకీ వివక్షతలు, ఎందుకింత అధికార దుర్వినియోగం? ఎందుకింత పదవీ వ్యామోహం? ఎవరికీ, ఎన్నడూ లేనంత మెజారిటీతో రెండు సార్లు ప్రజలు బిజేపిని అందలం ఎక్కిస్తే సామాన్య ప్రజలకు చేసిన మేలు ఏమిటి? మత ద్వేషంతో గృహ దహనాలు, హత్యలు,సామూహిక రేపులు, బుల్‌ డ్రోజర్‌ తో ఇళ్ళు కూల్చడాలు, మనుషులపై ట్రక్కులు ఎక్కించి చంపడాలు,బిజేపి ప్రభుత్వానికి అవసరమా? మోది ప్రభుత్వం, బిజేపి పార్టీ శ్రేణులు, అనుబంధసంస్థలు తమ గత తొమ్మెదేళ్ళ పాలన పై ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేసిన తప్పిదాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు