Saturday, May 11, 2024

ఆసీస్ సొంతమైన ఐసీసీ గద..

తప్పక చదవండి
  • 209 పరుగుల తేడాతో ఆసీస్ ఘనవిజయం
  • చివరి రోజు చేతులెత్తేసిన భారత బ్యాట్స్ మెన్స్..
  • అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆసీస్..
  • రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టార్గెట్ 444 పరుగులు..
  • 234 రన్స్ కే కుప్పకూలిన భారత్..
  • ఆదివారం 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వైనం..

న్యూ ఢిల్లీ, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ విజేతగా అవతరించింది. సగర్వంగా ఐసీసీ గదను సొంతం చేసుకుంది. అనేక మలుపులు తిరిగిన ఓవల్ టెస్టు చివరి రోజు భారత్ విజయానికి 280 పరుగులు అవసరం కాగా.. ఆస్ట్రేలియా విజయానికి 7 వికెట్లు అవసరం అయ్యాయి. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టైటిల్ గెలుపొందిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది. తొలి సెషన్లోనే భారత బ్యాటర్లు చేతులెత్తేయడం గమనార్హం.

చివరి రోజు టీమిండియా విజయానికి 280 పరుగులు అవసరం కాగా.. విరాట్ కోహ్లి, అజింక్య రహానే క్రీజ్‌లో ఉండటంతో భారత్ విజయంపై ధీమాతో ఉంది. పోరాడితే కనీసం మ్యాచ్ డ్రా అవుతుందని భావించారంతా. కానీ తొలి గంటలోనే భారత ఓటమి ఖాయమైంది. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లి (49), రవీండ్ర జడేజా (0)ను ఔట్ చేసిన స్కాట్ బోలాండ్ భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంజిక్య రహానే క్రీజ్‌లో ఉండటం.. ఓవల్‌లో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధించిన శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్‌‌కు రావాల్సి ఉండటంతో భారత అభిమానుల్లో ఏదో మూలన ఆశలున్నాయి. కానీ స్టార్క్ బౌలింగ్‌లో రహానే (46) వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికే శార్దుల్ ఠాకూర్ కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. లియాన్ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన భరత్ (23) అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్కాట్ బోలాండ్‌కు మూడు, మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

మ్యాచ్ సాగిన విధానం :
ఓవల్ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓ దశలో 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను స్మిత్ (121), ట్రావిస్ హెడ్ (163) భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. బదులుగా భారత్ 296 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను జడేజా (48), రహానే (89), శార్దుల్ ఠాకూర్ (51) ఆదుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 270/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య చేధనలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. దీంతో ఐసీసీ ట్రోఫీలన్ని నెగ్గిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు